Kolkata Doctor Murder Case: పశ్చిమ బెంగాల్‌లోని కలకత్తా ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో ట్రైనీ వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటన కేసు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనను నిరసిస్తూ వైద్యులు కూడా ఆందోళన బాట పట్టారు. గత అయిదు రోజులుగా దేశ వ్యాప్తంగా విధులు బహిష్కరించి నిరసన తెలుపుతున్నారు. అంతే కాకుండా నిందితుడికి కఠినంగా శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే కలకత్తా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
కోర్టు పర్యవేక్షణలో కేసు దర్యాప్తు జరగాలని మృతురాలి తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. ఇదిలా ఉంటే దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ఘటన జరిగి 5 రోజులు గడిచినా పోలీసుల దర్యాప్తులో ఎలాంటి పురోగతి కనిపించడం లేదని మండిపడింది. ఈ నేపథ్యంలోనే కేసును సీబీఐకి బదిలీ చేస్తూ హై కోర్టు చీఫ్ జస్టిస్ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు విచారణ చేపట్టిన రాష్ట్ర పోలీసులు కేసుకు సంబంధించిన అన్ని పత్రాలను బుధవారం ఉదయంలోపు సీబీఐకి అందజేయాలని ఆదేశించారు. అంతే కాకుండా కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి మూడు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని సీబీఐ అధికారులను కోర్టు ఆదేశించింది.
హత్యాచార ఘటనకు నిరసనగా దేశ వ్యాప్తంగా అత్యవసర సేవలు మినహా విధులను వైద్య సిబ్బంది బహిష్కరించిన విషయం తెలిసిందే. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాకు రాసిన లేఖలో కలకత్తా ఘటన చరిత్రలో దారుణ ఘటనగా ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఫోర్డా వెల్లడించింది. డ్యూటీలో ఉన్న వైద్యురాలి మాన ప్రాణాలు కాపాడలేని మెడికల్ కాలేజీ అధికారులు రాజీనామా చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేసింది.
నిరసనలు చేస్తున్న వైద్యులపై చర్యలు కూడా తీసుకోవాలని.. కేసులో సత్వర చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వాలని వైద్య సంఘం కోరింది. వైద్యుల భద్రత కోసం కేంద్రం వెంటనే సెక్యూరిటీ ప్రోటోకాల్‌ను అమలు చేయాలని మరోవైపు వైద్యులపై హింసను అరికట్టేందుకు ఆసుపత్రులను సేఫ్ జోన్లుగా ప్రకటించాలని నడ్డాకు లేఖ రాసింది. అన్ని రాష్ట్రాల్లో వైద్యులపై దాడులు నివారించేందుకు ప్రత్యేక చట్టాలు చేసినా క్షేత్రస్థాయిలో అవి క్రియాశీలకంగా పనిచేయడం లేదని.. కేంద్రం ప్రత్యేక చట్టం చేయకపోవడమే ఇందుకు కారణమని లేఖలో వెల్లడించింది.
Also Read: త్వరలో జమ్ము కశ్మీర్‌లో ఎన్నికలు.. 20 నాటికి ఎన్నికల షెడ్యూల్
వెలుగులోకి సంచలన విషయాలు..
హత్యాచార ఘటనలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో జరిగిన పెనుగులాటలో మృతురాలి గొంతు భాగంలో థైరాయిడ్ కార్టిలేజ్ విరిగిందని పోస్టుమార్టంలో వెల్లడైంది. ఆగస్టు 9న తెల్లవారు జామున 3 నుంచి 5 గంటల మధ్యలో ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఉదరం, పెదాలు, వేళ్లు, ఎడమ కాలుకు గాయాలు ఉన్నాయని కేకలు వినిపించకుండా ఆమె తలను గోడకు అదిమిపట్టి ముక్కు, నోరు మూసేసినట్లు వెల్లడైంది. ఆమె ముఖమంతా గోటి గాయాలు కూడా అయ్యాయి.