Ex Clerk: ఆయనొక ప్రభుత్వ ఉద్యోగి. ప్రస్తుతానికి రిటైర్మెంట్ అయ్యాడు. ఉద్యోగంలో ఉండగా ఆయన జీతం కేవలం 15 వేలు మాత్రమే. దాంతో ఫ్యామిలీని పోషించేవాడు. రిటైర్మెంట్ తర్వాత ఆయన ఆస్తులు చూసిన అధికారులకు ఖంగుతిన్నారు. అసలేం జరిగింది? ఎక్కడ? అన్న డీటేల్స్ లోకి వెళ్దాం.
కర్ణాటక ప్రభుత్వంలో రీసెంట్‌గా ఓ ఉద్యోగి పదవీ విరమణ పొందారు. ఆయన పేరు కలకప్ప నిండగుండి. ఆయన సొంతూరు కొప్పల్ జిల్లా. గ్రామీణ మౌలిక సదుపాయాల డెవలప్‌మెంట్ విభాగంలో గుమాస్తాగా పని చేసి రిటైర్ అయ్యాడు. ఆయన శాలరీ కేవలం 15 వేలు మాత్రమే. కాకపోతే విస్తారంగా అక్రమాస్తులు కూడబెట్టాడు.
ఒకటీ రెండు కాదు ఏకంగా వాటి విలువ 30 కోట్ల రూపాయల పైమాటే. ఎందుకోగానీ అతడి కదలికపై అధికారులకు అనుమానం వచ్చింది. ఆయనపై పలు ఆరోపణలు గుప్పుమన్నారు. రిటైర్మెంట్ తర్వాత కర్ణాటక లోకాయుక్త అధికారులు మెరుపు దాడులు చేశారు. ఆయన ఆస్తులకు చూసిన అధికారులకు కళ్లు బైర్లు కమ్మాయి.
24 ఇళ్లు, 4 ప్లాట్లు, 40 ఎకరా వ్యవసాయ భూమి బయటపడింది. ఈ ఆస్తులన్నీ అతని పేరుతోపాటు భార్య, సోదరులు, బంధువుల పేర్లు రిజిస్ట్రేషన్ జరిగింది. బంగారం, వెండి వస్తువుల గురించి చెప్పనక్కర్లేదు. కిలోల కొద్దీ ఆభరణాలు బయటపడ్డాయి. కలకప్ప అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. కాకపోతే ఎలాంటి ఆధారాలు లేవు.
ALSO READ: మద్యం తాగి ఖాళీ సీసా ఇస్తే డబ్బు వాపస్.. కేరళలో కొత్త పాలసీ
గ్రామీణ ప్రాంతాల్లో 96 ప్రాజెక్టులకు సంబంధించి నకిలీ పత్రాలు, బిల్లులు సృష్టించారు. ఏకంగా రూ.72 కోట్లకు పైగా నిధులను దుర్వినియోగం చేసినట్టు తేలింది. దీనిపై ఫిర్యాదులు లోకాయుక్తకు వచ్చాయి. న్యాయస్థానం నుంచి ఆదేశాలు రావడంతో అధికారులు స్పందించారు.
కలకప్పతోపాటు బంధువుల ఇళ్లలో ఒక్కసారిగా సోదాలు చేశారు. పైన వెల్లడించిన ఆస్తులను గుర్తించారు. 350 గ్రాముల బంగారం, 1.5 కిలోల వెండి ఆభరణాలు, రెండు కార్లు, రెండు టూ వీలర్స్ వాహనాలను సీజ్ చేశారు. సర్వీసులో ఉండగా అవినీతికి పాల్పడ్డాడా? సర్వీసు ముగిసిన తర్వాత వేరే అధికారులతో కలిసి అవినీతికి తెరలేపాడా? అనే దానిని నిర్ధారించే పనిలో అధికారులు పడ్డారు.