Madhuri Dixit Posters Rajasthan| నిండు అసెంబ్లీలో ఓ ఎమ్మెల్యే నోరు పారేసుకున్నారు. “రాష్ట్రంలో సెకండ్ గ్రేడ్ బాలీవుడ్ నటి ఫ్లెక్సీలే దర్శనమిస్తున్నాయి. సెకండ్ గ్రేడ్ యాక్టర్లు తప్ప మీకు ఇంకెవరి ఫోటోలు దొరకలేదా? షారుఖ్ ఖాన్ తప్ప మిగిలిన నటులంతా ఆ కోవకే చెందుతారు అని సదరు ఎమ్మెల్యే నోటి కొచ్చినట్లు మాట్లాడారు. రాజస్థాన్‌లో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది.
రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష కాంగ్రెస్.. రాష్ట్రంలో జరిగిన ఐఫా అవార్డ్స్ ఫంక్షన్ గురించి బీజేపీ ప్రభుత్వంపై అనేక ప్రశ్నలు వేసింది.
ఈ సందర్భంగా ప్రతిపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యే టికారం జుల్లీ అసెంబ్లీలో మాట్లాడుతూ.. “రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్ల ప్రజా డబ్బును ఖర్చు చేసి ఐఫా (IIFA Awards 2025) ఉత్సవాలను నిర్వహించింది. ఐఫా పేరిట దేనికి ఎంత ఖర్చు చేసారో లెక్కలు బహిర్గతం చేయాలి. మీరు ఏర్పాటు చేసిన హోర్డింగ్స్ రాష్ట్రాన్ని ప్రమోట్ చేస్తున్నట్లుగా లేదు. ఐఫాను ప్రమోట్ చేస్తున్నట్లుంది. ఐఫా వల్ల రాష్ట్రానికి ఏమి లాభం కలిగింది? ఈ కార్యక్రమానికి వచ్చిన సినీ ప్రముఖులు టూరిస్ట్ ప్రాంతాలను సందర్శించారా? సినీ ఇండస్ట్రీ నుంచి ఐఫా కార్యక్రమానికి వచ్చిన స్టార్లు ఎవరు? నాకు తెలిసి షారుఖ్ ఖాన్ మినహా మిగిలిన వారందరూ సెకండ్ గ్రేడ్ యాక్టర్లే. ఫస్ట్ గ్రేడ్ యాక్టర్లు ఈ కార్యక్రమానికి వచ్చినట్లు కనిపించలేదు” అని వ్యాఖ్యానించారు.
Also Read: బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లు హిందువులను దోచుకుంటున్నాయి.. దిగ్విజయ్ సింగ్ మండిపాటు
దీంతో ఎమ్మెల్యే టికారం జుల్లీ వ్యాఖ్యలను అధికార బీజేపీ ఎమ్మెల్యేలు ఖండించారు. అయినా బిజేపీ ఎమ్మెల్యేలకు టికారం జుల్లీ ధీటుగా సమాధానమిచ్చారు. టికారం మాట్లాడుతూ.. “అవును మాధురి దీక్షిత్ ఇప్పుడు సెకండ్ గ్రేడ్ యాక్టర్. నాటి దిల్, బేటా సినిమాలకు మాత్రమే ఆమె స్టార్. ఆమె శకం ఎప్పుడో ముగిసింది” అని తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు.
కొద్ది రోజుల క్రితం ఇదే కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా నేత షామా మొహమ్మద్ ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్ రాజకీయ దుమారం రేపింది. షామా తన ట్వీట్లో.. “రోహిత్ శర్మ ఫిట్‌గా లేడు! బరువు తగ్గాలి. భారత క్రికెట్ జట్టులో గత సారథులతో పోల్చితే ఆకట్టుకోని కెప్టెన్ అతడే” అని రాశారు. ఆమె చేసిన ట్వీట్ పై పెద్ద ఎత్తున దుమారమే చెలరేగింది.
భారతీయులు రోహిత్ శర్మకు మద్దతు పలుకుతూ షామాపై విమర్శలు గుప్పించారు. ఆ విమర్శలు తట్టుకోలేక షామా దెబ్బకు దిగొచ్చారు. దుబాయ్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టును విజయపథం వైపు నడిపించారని రోహిత్ శర్మపై ప్రశంసల వర్షం కురిపించారు.