Maharashtra Family Tragedy: మహారాష్ట్రలో ఓ కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు కొండపైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో తీగలాగితే సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తొలుత ఐఫోన్ కారణంగా ప్రమాదం జరిగిందని ప్రచారం సాగినా, దీని వెనుక చాలా మిస్టరీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతకీ పోలీసులు దర్యాప్తులో ఏం జరిగింది?
మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ జిల్లాలో ఐ ఫోన్ వివాదం నేపథ్యంలో ఖువాడియా కొండ మీద నుంచి ఓ కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మృతి చెందినవారిలో తండ్రి మురళీధర్, తల్లి సంగీత, 19 ఏళ్ల కుమారుడు కునాల్ ఉన్నారు. ఈ దంపతుల పెద్ద కుమారుడు సుమారు ఆరేళ్ల కిందట అనారోగ్యంతో చనిపోయాడు. మురళీధర్ ఓ ట్రాన్స్‌పోర్టు కంపెనీలో మేనేజర్‌గా పని చేస్తున్నాడు. ఫ్యామిలీ వివాదాలు నేపథ్యంలో పనిలో మునిగిపోయి నెలల తరబడి ఇంటికి దూరంగా ఉండేవారని సమాచారం. ఘటనకు రెండు రోజుల ముందు తండ్రి ఇంటికి తిరిగి వచ్చాడట. ఘటనకు ఒక రోజు ముందు కునాల్ తల్లి సంగీత.. తన యూట్యూబ్ ఛానల్‌లో ఓ వీడియో పోస్టు చేయడం అందరి దృష్టి అటువైపు మళ్లింది. మానవ సంబంధాలు, ప్రేమ విలువలను వివరించారు. తన బంధువుల్లో కొందరిపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. తన కుటుంబాన్ని వేధించారని, ఆస్తి తగాదాలు సృష్టించారని ఆరోపిస్తోంది. పోలీసులు ఈ వీడియో ప్రామాణికతపై దర్యాప్తు చేస్తున్నారు.
సంగీత తీవ్ర ఆవేదనతో కనిపిస్తూ, చాలా కాలంగా కుటుంబ వివాదాన్ని వివరించే ప్రయత్నం చేశారు. తన భర్త సోదరి, లేదా ఆడపడుచు, ఇతర బంధువులు తమ కుటుంబంలో కలహాలు రేపుతున్నారని ఆరోపించారు. దీంతో వారంతా తమ కుటుంబంలో శాంతి, సంతోషాన్ని నాశనం చేసినట్టు పేర్కొంది. బంధువులు తమ కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని, తన భర్తను వేధిస్తున్నారని తెలిపింది. ఆస్తిలో వాటా కావాలన్న డిమాండ్ అందులో ఉంది. కుమారుడు కునాల్ గురించి కూడా ప్రస్తావించింది. బంధువులు.. కునాల్‌ను తండ్రి-తల్లి నుండి వేరు చేశారని, కుటుంబం కష్టకాలంలో ఉన్నప్పుడు తనకు-భర్తకు మధ్య సఖ్యత లేదని తెలిపింది. తండ్రికి దూరంగా కొడుకు ఉన్నప్పటికీ.. కుటుంబంలోని కొందరు సభ్యులు పండుగలు జరుపుకున్నారని, బయట భోజనం చేస్తూ, పార్టీలు చేసుకుంటూ యధావిధిగా తమ జీవితాలను గడుపుతున్నారని చెప్పింది.
మురళీధర్-సంగీత మధ్య ఆస్తుల విషయాల్లో విభేదాలు ఉన్నాయని తెలిపారు. కొన్నాళ్లుగా కునాల్ తల్లిదండ్రులు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. తల్లిదండ్రులు కలసి ఉండాలని కొడుకు బలంగా కోరుకున్నాడు. చదువులో చురుకైన కునాల్, 10వ తరగతిలో 82 శాతం మార్కులు సాధించాడు. ఎంబీబీఎస్ చదవాలనే లక్ష్యంతో కునాల్ ఉన్నాడని వివరించారు.
మురళీధర్-సంగీత దాదాపు రెండున్నర దశాబ్దా కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి వివాహానికి మురళీధర్ తల్లిదండ్రులు అంగీకరించలేదని, ఆ తర్వాత మురళీధర్‌కు తన కుటుంబ సభ్యులకు మధ్య సంబంధాలు సరిగా లేవని తెలిపింది. మరి ఏం జరిగిందో తెలీదు. మురళీధర్-సంగీత మధ్య కొన్నేళ్లుగా మనస్పర్ధలు ఉన్నట్లు తెలిపింది. అయితే మురళీధర్ ఫ్యామిలీ అద్దె ఇంటికి వచ్చి కేవలం నాలుగు నెలలు అయ్యింది. వారంతా చాలా ప్రశాంతంగా ఉండేవారని, కునాల్ ఎవరితో మాట్లాడేవాడు కాదని ఇంటి కేర్‌టేకర్ ఆదిత్య తెలిపారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఘటనకు ముందు కునాల్ తల్లి సంగీతా చంద్‌గూడే వీడియో బయటపడడంతో అటువైపు దృష్టించారు. సంగీత తన బంధువులలో కొందరిపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. తన కుటుంబాన్ని వేధించారని, ఆస్తి తగాదాలు సృష్టించారని ఆరోపించినట్టు ఉందని తెలుస్తోంది. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు ఇప్పుడు ఆ వీడియో ప్రామాణికతపై దర్యాప్తు చేస్తున్నారు. ఆ వీడియో ఎప్పుడు చిత్రీకరించారు? అది నిజమైనదేనా? కాదా? నిర్ధారించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ వీడియోలో చేసిన ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న బంధువుల పాత్రపై ఆరా తీస్తున్నారు. గతంలో జరిగిన కుటుంబ కలహాల గురించి సమాచారం సేకరిస్తున్నారు. ఈ ఘటనకు ముందు కుటుంబ సభ్యుల మధ్య ఎలాంటి సంభాషణలు జరిగాయో తెలుసుకునేందుకు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
ఖువాడియా కొండపైకి తొలుత వెళ్లాడు కొడుకు కునాల్. యువకుడు కొండపైకి వెళ్లడం చూసిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, కుటుంబ సభ్యులు కిందకి రావాలని రిక్వెస్ట్ చేశారు. అయినా యువకుడు వినలేదు. కునాల్‌ను రక్షించే క్రమంలో తండ్రి మురళీధర్ కొడుకు చేయి పట్టుకుని లాగడానికి ప్రయత్నించాడు. బ్యాలెన్స్ తప్పి తండ్రి-కొడుకు సుమారు 300 అడుగుల లోయలో పడిపోయారు. కళ్ల ముందు జరిగిన సంఘటనను చూసిన తల్లి సంగీత కూడా కొండ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. కేవలం నిమిషాల వ్యవధిలోనే ఒకే కుటుంబం అంతా ఈ లోకాన్ని విడిచిపెట్టింది.
ALSO READ: పాఠశాలల్లో హిజాబ్ కంటే.. యూనిఫామే ముఖ్యం.. అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు