Modi Cabinet Reshuffle: జెన్ జెడ్ ఉద్యమం.. బీజేపీలో ఓ కుదుపు కుదిపేసింది. దీని దెబ్బకు బీజేపీలో వేగంగా పరిణామాలు మారిపోతున్నాయి. పాతతరం వారిని పక్కన పెట్టేసి కొత్తవారికి పగ్గాలు అప్పగించే పనిలో పడింది. తొలుత బీజేపీలో మార్పులు చేర్పులు చేసింది. ఈ క్రమంలో మంత్రి గడ్కరీ చేసిన కామెంట్స్.. మోదీ కేబినెట్ విస్తరణకు సంకేతాలు ఊపందుకున్నాయి. ఇంతకీ గడ్కరీ ఏమన్నారు?
మంగళవారం నాగపూర్‌లో జరిగిన ఈవెంట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్రమంత్రి గడ్కరీ. కొత్త తరానికి బాధ్యతలు అప్పగించాల్సిన సమయం ఆసన్నమైందని, నేను చేయాలనుకున్నంత కాలం పని చేశానని అన్నారు. గతంలో మాదిరిగా ఎక్కువగా పని చేయలేకపోతున్నానని, ప్రజా పనుల్లో ప్రమేయం తగ్గిపోయిందన్నారు. ఆ పనులు కొత్త తరాలకు అప్పగించాలని, వారికి సీనియర్లు మార్గ నిర్దేశం చేయాలన్నారు.
గడిచిన మూడు దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని, ఇకపై పాలనాపరమైన ఒత్తిళ్ల కంటే సామాజిక సంక్షేమం, రైతుల శ్రేయస్సుపై దృష్టి సారిస్తానని తేల్చే చెప్పేశారు. ఈ లెక్కన మోదీ కేబినెట్‌లో సీనియర్ మంత్రులు క్రమంగా తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
జెన్ జెడ్ దెబ్బకు బీజేపీ వేగంగా పావులు కదుపుతోంది. ఓ వైపు పార్టీలో యువతకు ప్రాధాన్యత ఇస్తూ కీలక మార్పులు జరిగాయి. ఇప్పుడు మోదీ కేబినెట్ విస్తరణ వంతైంది. ప్రస్తుతం మోదీ కేబినెట్‌లో డజను వరకు కేంద్రమంత్రుల పదవులు ఖాళీ ఉన్నాయి. వాటిని యువత, మహిళలకు ఇవ్వాలని ఆలోచన చేస్తోంది. దీనివల్ల యువతకు ప్రయార్టీ ఇస్తున్న సంకేతాలు జెన్ జీలోకి వెళ్లవచ్చని ఆలోచన చేస్తోంది.
కేంద్ర మంత్రివర్గంలో ప్రస్తుతం ప్రధానమంత్రితో సహా 69 మంది సభ్యులు ఉన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 75(1A) ప్రకారం.. 81 మంది సభ్యులకు అనుమతి ఉంది. 12 పదవులు ఖాళీగా ఉంటాయి. 2029 లోక్‌సభ ఎన్నికలకు ముందు పలు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి. ఈ క్రమంలో భారీగా మార్పులు జరుగుతున్నాయి. ఒకటి కంటే ఎక్కువ శాఖలు నిర్వహిస్తున్న కొంతమంది మంత్రులపై భారాన్ని తగ్గించాలని భావిస్తోంది.
ఒకటి కంటే ఎక్కువ శాఖలకు బాధ్యతలు నిర్వహిస్తున్న మంత్రులు 14 మంది ఉన్నారు. చాలామంది సీనియర్లను తప్పించి యువత, మహిళలకు ఛాన్స్ ఇవ్వాలని ప్రధాని ఆలోచనగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనివల్ల మంత్రులపై పని భారం తగ్గుతుందని అంటున్నాయి. ఈ క్రమంలో ఒక వ్యక్తికి ఒక పదవి అనే సూత్రాన్ని పూర్తిస్థాయిలో ఇంప్లిమెంట్ చేయాలని భావిస్తోంది.
పేపర్ లీక్‌లపై యువత ఆందోళనల నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత రాజ్యసభ పదవీకాలం పూర్తి కావడంతో మైనారిటీ వ్యవహారాల సహాయ మంత్రి కురియన్, రైల్వే శాఖ సహాయ మంత్రి బిట్టు తమ పదవులకు రాజీనామా చేశారు. నితిన్ నవీన్ నాయకత్వంలో ఏర్పడిన కొత్త టీమ్‌కు జాతీయ కోశాధికారిగా పీయూష్ గోయల్ నియమితులయ్యారు.
ఢిల్లీకి హర్ష్ మల్హోత్రా, యూపీకి పంకజ్ చౌదరిలను కొత్త రాష్ట్ర అధ్యక్షులుగా బీజేపీ నియమించింది. పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, న్యాయశాఖ సహాయమంత్రి బిఎల్ వర్మల రాజ్యసభ పదవీకాలం నవంబరుతో ముగియనుంది. మంత్రివర్గంలో 70 ఏళ్లు పైబడిన మంత్రులు డజను మంది ఉన్నారు. కేవలం రామ్మోహన్ నాయుడు అత్యంత పిన్న వయసు కలిగిన వ్యక్తి మోదీ కేబినెట్‌లో ఉన్నారు.
కొత్త మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణతో యువత, మహిళలకు ప్రయార్టీ ఇవ్వాలని ఆలోచన చేస్తోందట మోదీ నాయకత్వం. పంజాబ్ నుంచి హర్సిమ్రత్ కౌర్ బాదల్, ఆమ్ ఆద్మీ పార్టీని వీడి బీజేపీలో చేరిన ఏడుగురు రాజ్యసభ ఎంపీల్లో ఒకరికి స్థానం దక్కవచ్చని చెబుతున్నాయి. శివసేన షిండే వర్గానికి చెందిన ఎంపీల సంఖ్య పెరగడంతో క్యాబినెట్ రేసులో ఎంపీ శ్రీకాంత్ షిండే పేరు బలంగా వినిపిస్తోంది.
ALSO READ: ముగ్గురు ఫ్యామిలీ సభ్యుల ఆత్మహత్యలో కొత్త కోణం, ఘటనకు ముందు వీడియో
తృణమూల్ కాంగ్రెస్ పై తిరుగుబాటు చేసి NDAకు మద్దతు ఇచ్చిన NCPI వర్గానికి చోటు కల్పించనున్నట్లు సమాచారం. త్వరలో అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఉత్తరప్రదేశ్, గుజరాత్ నుండి కొత్త ముఖాలకు చోటు దక్కవచ్చని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. వీటితోపాటు హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలకు చెందిన నేతలకు ఈసారి మోదీ మంత్రివర్గంలో చోటు దక్కవచ్చనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.