Telangana Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి క్రమంగా ప్రభావం చూపుతోంది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అటు తెలంగాణలో భారీగా వర్షాలు పడనున్నాయి. ఈ క్రమంలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు.
ఎల్‌నినో ప్రభావం తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపింది. వర్షం లేక సామాన్యులు, రైతులు అల్లాడిపోతున్నారు. పగలు-రాత్రిళ్లు వాతావరణ ఒకేలా ఉంది. రుతుపవనాలు తిరోగమనం నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని ఇప్పటికే వాతావరణ కేంద్రం అంచనా వేసింది. తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా ఏపీ-తెలంగాణల్లోని వివిద ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
హైదరాబాద్- అమరావతి వాతావరణ కేంద్రాలు విడుదల చేసిన తాజా సూచనల మేరకు.. తెలంగాణలో రాబోయే రెండు రోజులు చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేసింది. అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో సోమవారం తెల్లవారుజామున నుంచి తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో అప్పుడే చినుకులు మొదలయ్యాయి. తెలంగాణలో మధ్యాహ్నం నుండి అక్కడక్కడా ఉరుములు మెరుపులతో భారీ వర్షం పడనుంది. సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, నల్గొండ, యాదాద్రి – భోంగీర్, మెదక్, సిద్దిపేట, జనగాం, కామారెడ్డి, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్‌లో మధ్యాహ్నం, రాత్రి సమయంలో అక్కడక్కడ ఉరుములు మెరిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
అటు నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నారాయణపేట, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి – కొత్తగూడెం, మహబూబాబాద్ అంతటా రాత్రి నుంచి మరుసటి రోజు ఉదయం వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ క్రమంలో తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్, హైదరాబాద్ సహా 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఇక హైదరాబాద్‌లో తెల్లవారుజామున నుంచి చినుకులు మొదలయ్యాయి. ఉదయం ఆఫీసులకు వెళ్లేవారు గొడుగులతో బయలుదేరారు. మధ్యాహ్నం నుండి రాత్రి వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. అందుకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని పేర్కొంది.
ALSO READ: కేసీఆర్ దూకుడుతో కాంగ్రెస్‌కు కొత్త టెన్షన్!
అమరావతి వాతావరణ కేంద్రం చెప్పిన వివరాలు మేరకు.. ఉత్తర కోస్తాంధ్రా, యానాంలో ఉరుములు, మెరుపులు ఉండొచ్చని తెలిపింది. వర్షాలు పడే సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం తెలియజేసింది. ఇక రాయలసీమలో వారం రోజులపాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.