Gujarat Ministers Resign: గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మినహా మంత్రులందరూ గురువారం రాజీనామా చేశారు. నూతన మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో మంత్రులంతా రాజీనామా చేశారు. రేపు కొత్త కేబినెట్ కొలువు దీరనుంది. గుజరాత్ మంత్రివర్గంలో సీఎం భూపేంద్ర పటేల్ సహా 17 మంది మంత్రులు ఉన్నారు. వీరిలో 8 మంది కేబినెట్ స్థాయి మంత్రులు, మిగిలిన వారు సహాయ మంత్రులుగా ఉన్నారు.
మొత్తం 182 మంది సభ్యులున్న గుజరాత్ అసెంబ్లీలో 27 మంది మంత్రులు లేదా మొత్తం సభ్యుల్లో 15 శాతం మంది మంత్రులు ఉండవచ్చు. సీఎం భూపేంద్ర పటేల్ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ (BJP) శుక్రవారం మంత్రివర్గ విస్తరణకు సిద్ధమైంది. నూతన కేబినెట్ పై కసరత్తు కొనసాగుతోంది. నూతన కేబినెట్ విస్తరణలో దాదాపు 10 మంది కొత్త మంత్రులు వచ్చే అవకాశం ఉందని, ప్రస్తుత మంత్రులలో దాదాపు సగం మందిని మార్చే అవకాశం ఉందని బీజేపీ సీనియర్ నేత తెలిపారని పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది.
కొత్త మంత్రివర్గం శుక్రవారం ఉదయం 11.30 గంటలకు గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయనుంది. కొత్త కేబినేట్ లో యువకులు, అనుభవజ్ఞులైన నాయకులు ఉంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. గురువారం సాయంత్రం సీఎం నివాసంలో జరిగిన సమావేశంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సాల్, సీఎం పటేల్ పాల్గొన్నారు.
సునీల్ బన్సాల్, ,సీఎం పటేల్ మంత్రులను వ్యక్తిగతంగా కలిశారని సమాచారం. మంత్రుల రాజీనామాలకు ముందు కేంద్ర నాయకత్వం నిర్ణయాన్ని వారికి తెలియజేశారని తెలుస్తోంది. రాష్ట్రంలో రాజకీయ, సంస్థాగత సవాళ్లకు ఎదుర్కోనేందుకు మంత్రివర్గాన్ని విస్తరించాలని బీజేపీ నిర్ణయించింది. ఈ మేరకు మంత్రులతో రాజీనామాలు చేయించి, మంత్రి వర్గాన్ని విస్తరిస్తుందని పార్టీ నాయకులు తెలిపారు.
Also Read: Bangalore News: నారా లోకేశ్ కామెంట్స్.. డీకే శివకుమార్ రిప్లై, బెంగళూరుకు సాటి లేదని వ్యాఖ్య
గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు జగదీష్ విశ్వకర్మ నేతృత్వంలో కేంద్ర నాయకత్వం నిర్ణయాన్ని మంత్రులకు తెలియజేసి, వారి అభిప్రాయాలు తీసుకున్నారు. రాబోయే ఎన్నికలకు ముందు కుల, ప్రాంతీయ ప్రాతినిధ్యాన్ని సమతుల్యం చేయడానికి బీజేపీ వ్యూహంలో భాగంగా కేబినెట్ పునర్వ్యవస్థీకరణను చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.