ప్రయాణీకులకు మెరుగైన వసతులు కల్పిస్తే, ప్రయాణాన్ని మరింత ఆహ్లాదకరంగా మార్చేందుకు భారతీయ రైల్వే కీలక చర్యలు చేపడుతుంది. ఇందులో భాగంగానే కొత్త తరహా దుప్పట్లను ఆవిష్కరించారు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. రాజస్థాన్‌లోని ఖతిపుర జైపూర్ రైల్వే స్టేషన్ లో ఈ కార్యక్రమం నిర్వహించారు. తొలుత జైపూర్-అసర్వ ఎక్స్ ప్రెస్ లోని ఎసి క్లాస్ ప్రయాణీకులకు కవర్ దుప్పట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇకపై దుప్పట్లు కంపు కొట్టే అవకాశం లేదన్నారు.
కవర్ దుప్పట్లను పైలెట్ ప్రాజెక్టు కింద జైపూర్-అసర్వ ఎక్స్ ప్రెస్ లో ప్రవేశపెట్టారు. అన్ని ఏసీ కోచ్ ప్రయాణీకులకు ఈ కవర్ దుప్పట్లు అందిస్తున్నారు. వీటి ద్వారా మురికి దుప్పట్లు, దుర్వాసన ఫిర్యాదులు ఉండవని రైల్వే అధికారులు భావిస్తున్నారు. ఈ సౌకర్యం విజయవంతమైతే, దేశ వ్యాప్తంగా దీనిని అమలు చేస్తామని మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇంతకు ముందు ఏసీ కోచ్ ల లోని బెడ్ రోల్స్ లో అందించిన దుప్పట్లను ప్రతి నెలా ఉతుకుతున్నట్లు రైల్వే మంత్రి పార్లమెంట్ కు వెల్లడించారు. బెడ్ రోల్ కిట్ లో అదనపు బెడ్ షీట్ అందించేది. ఇప్పుడు వీటికి క్విల్ట్ కవర్ ను ఏర్పాటు చేశారు. రైళ్లలో దుప్పట్లు సంవత్సరాలుగా వాడుకలో ఉన్నాయని, కానీ.. వాటి శుభ్రతపై ప్రయాణీకులలో పలు అనుమానాలు ఉన్నాయన్నారు. ఇకపై ఈ ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో దుప్పట్లకు కవర్ సౌకర్యాన్ని ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు.
రైళ్లలో ఫస్ట్, సెకెండ్, ధర్డ్ ఏసీ కోచ్ లు ఉంటాయి. వీటిలో ప్రయాణించే ప్యాసింజర్లకు కవర్లలతో కూడిన బెడ్ షీట్స్ మరింత సౌకర్యాన్ని అందించనున్నాయి. ఇంకా చెప్పాలంటే ఈ కవర్ దుప్పట్లు ప్రయాణాన్ని సౌకర్యవంతంగా మార్చనున్నాయి. ముఖ్యంగా శీతాకాలంలో ప్రయాణీకులకు ఎంతో ఉపయోగకరంగా ఉండనున్నాయి. ఈ పైలెట్ ప్రాజెక్టు సక్సెస్ అయిన తర్వాత అన్ని రైళ్లలో ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. అటు జైపూర్-అసర్వ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ (12981) రైలు.. 11 గంటల 55 నిమిషాల్లో జైపూర్ నుంచి అసర్వ చేరుకుంటుంది.
Read Also: ఇండియన్ డైమండ్ క్రాసింగ్.. నాలుగు రైల్వే లైన్లు ఒకే చోట కలిసే ఈ అద్భుతం గురించి మీకు తెలుసా?
మరోవైపు ప్రయాణీకులు ఈజీగా రైల్వే సమాచారం తెలుసుకునే కొత్త వ్యవస్థను జైపూర్ రైల్వే స్టేషన్ లో మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించారు. కొత్త ప్లాట్ ఫారమ్ లు, ప్రయాణీకుల సమాచార వ్యవస్థ లాంటి ఇతర సౌకర్యాలను ప్రారంభించారు. రాజస్థాన్ లోని జోధ్ పూర్, జైపూర్, అజ్మీర్, బికనీర్ డివిజన్లలోని చిన్న స్టేషన్లలో ప్లాట్ ఫారమ్ ఎత్తులను పెంచారు. సైన్ బోర్డులు, సమాచార వ్యవస్థలను కూడా ఏర్పాటు చేశారు.
Read Also: విజయవాడ రైల్వే స్టేషన్, రైళ్లలో ఆకస్మిక తనిఖీలు.. శుభ్రత పాటించనివారికి జరిమానాలు!