
Rains : ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు తగ్గినా వరదలు మాత్రం ఇంకా పోటెత్తున్నాయి. ఎడతెగని వానల నుంచి కొన్ని ప్రాంతాలకు ఊరట లభించింది. అధికార యంత్రాంగం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ఇంకా కొన్ని వేలమంది ప్రజలు జల దిగ్బంధంలోనే ఉన్నారు. ఢిల్లీలో యమునానది నీటిమట్టం 205.33 మీటర్ల ప్రమాదస్థాయిని మించింది. నీటిమట్టం 206.38 మీటర్లకు చేరుకుంది. దీంతో పాత రైలు వంతెనను మూసివేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు.
ఉత్తరాఖండ్‌లో కొండచరియలు విరిగి వాహనాలపై పడ్డాయి. ఈ ప్రమాదంలో మధ్యప్రదేశ్‌కు చెందిన నలుగురు వ్యక్తులు మృత్యువాతపడ్డారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. సోమవారం వరకు 6 రాష్ట్రాల్లో మొత్తం 37 మంది మృతిచెందారు. మంగళవారం మరో 20 మంది చనిపోయారు. హిమాచల్ ప్రదేశ్ లోనే 31 మంది మృతి చెందారు.
ఉత్తరాఖండ్‌లోని ఛమోలీ జిల్లాలో వరద ఉద్ధృతికి ఓ వంతెన కొట్టుకుపోయింది. దీంతో భారత్-టిబెట్ సరిహద్దు రోడ్డు మూసుకుపోయింది. దీంతో కొన్ని గ్రామాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. కొండచరియలు విరిగిపడి జాతీయ రహదారి మూసుకుపోయింది. దీంతో గంగోత్రి-గంగనాని మధ్య దాదాపు 3-4 వేల మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు.
హిమాచల్‌ప్రదేశ్ లో ఇంకా పలుచోట్ల కుంభవృష్టి కొనసాగుతోంది. చాలమంది ప్రజలు, పర్యాటకులు శిబిరాల్లో చిక్కుకుపోయారు. శిమ్లా, సిర్మౌర్, కిన్నౌర్ జిల్లాల్లో వరదలు సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పర్యాటకులను వాయుసేన హెలికాప్టర్ ద్వారా తరలించాలని ప్రయత్నించారు. అయితే వాతావరణం ప్రతికూలంగా ఉండటంతో ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి. దెబ్బతిన్న రహదారుల పునరుద్ధరణకు ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, సరిహద్దు రహదారుల సంస్థ బలగాలను రంగంలో దించారు. రాష్ట్రంలో రూ.4 వేల కోట్ల ఆస్తినష్టం సంభవించిందని సీఎం సుఖ్వీందర్ సింగ్ సుక్కు ప్రకటించారు.