Insurance claim Rejected| కుటుంబానికి ఆర్థిక భరోసా ఉంటుందని జీవిత బీమా పాలసీ తీసుకుంటారు. కానీ పాలసీదారుడు మరణించిన తర్వాత బీమా కంపెనీ డబ్బులు ఇవ్వడానికి నిరాకరిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌కు చెందిన ఓ మహిళకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. భర్త మరణంతో బాధపడుతున్న ఆమెకు బీమా కంపెనీ నుంచి మరో షాక్ తగిలింది. దీంతో ఆమె వినియోగదారుల కోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో కోర్టు సంచలన తీర్పు చెప్పింది.
రూ.కోటి బీమా పాలసీ తీసుకున్న వ్యక్తి, పాలసీ తీసుకున్న 15 నెలల తరువాత గుండెపోటుతో మరణించాడు. ఆ వ్యక్తి భార్య బీమా క్లెయిమ్ కోసం ప్రయత్నించగా.. ఇన్సూరెన్స్ కంపెనీ బీమా ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో ఆమె రాయ్‌పూర్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ లో అప్పీల్ చేసింది.
చందా అనే మహిళ తన భర్త పవన్ పించా మరణించిన తర్వాత బీమా క్లెయిమ్ కోసం దరఖాస్తు చేశారు. అయితే, 2020 మార్చి 17న బీమా కంపెనీ ఆమె అభ్యర్థనను తిరస్కరించింది. పవన్ ఇతర బీమా కంపెనీల వద్ద కూడా జీవిత బీమా పాలసీలు తీసుకున్నారని కంపెనీ పేర్కొంది. వాటి వివరాలను దరఖాస్తులో వెల్లడించలేదని ఆరోపించింది.
పవన్ పించా ఓ ప్రైవేట్ కంపెనీలో డైరెక్టర్‌గా పనిచేసేవారు. ఆయన 2018 సెప్టెంబర్ 10న జీవిత బీమా పాలసీ తీసుకున్నారు. ఇందుకోసం ఏడాదికి రూ.36,969.40 ప్రీమియం చెల్లించేవారు. ఈ పాలసీ ద్వారా పవన్‌కు రూ.కోటి జీవిత బీమా లభించేది. ఆయన భార్యకు అదనంగా రూ.50 లక్షల బీమా కవరేజీ ఉండేది. పాలసీ గడువు 39 సంవత్సరాలు కాగా, మెచ్యూరిటీ తేదీ 2057 సెప్టెంబర్ 10.
అయితే, 2019 డిసెంబర్ 21న పవన్‌కు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మరణించారు. దీంతో భార్య చందా బీమా మొత్తాన్ని కోరారు.
వినియోగదారుల కమిషన్ అదనపు బెంచ్ ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది. మరణ బీమా కింద భార్యకు పూర్తి రూ.కోటి చెల్లించాలని బీమా కంపెనీని ఆదేశించింది. అంతేకాకుండా, అదనంగా రూ.1.15 లక్షలు పరిహారం, న్యాయ ఖర్చుల కింద చెల్లించాలని సూచించింది. ఇందులో మానసిక వేదన కోసం రూ.1 లక్ష కేటాయించింది. కేసు ఖర్చుల కోసం మరో రూ.15,000 ఇవ్వాలని పేర్కొంది. ఈ మొత్తాన్ని 45 రోజుల్లో చెల్లించాలి. గడువులోగా చెల్లించకపోతే మొత్తం బకాయిపై ఏటా 7 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.
అయితే, బీమా కంపెనీ.. పాలసీ జారీ చేసే ముందే ఇతర బీమాల వివరాలను పరిశీలించే అవకాశం ఉందని కమిషన్ గుర్తించింది. ప్రీమియం తీసుకున్న తర్వాత ఈ కారణంతో క్లెయిమ్ తిరస్కరించడం సమంజసం కాదని అభిప్రాయపడింది.
Also Read: న్యాయమూర్తి కాదు యముడు.. 4 నెలల్లో 22 మందికి ఉరిశిక్ష.. దెబ్బకు 100 హత్యకేసులు మరో కోర్టుకు బదిలీ
బీమా కంపెనీ కోర్టు అధికార పరిధిపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. బీమా ఏజెంట్‌ని కూడా కేసులో చేర్చాలని వాదించింది. అయితే, కమిషన్ వద్ద ఉన్న మెడికల్ రిపోర్ట్స్, పాలసీ డాక్యుమెంట్స్, అఫిడవిట్లు, ఇతర ఆధారాలను కోర్టు పరిశీలించింది. పాలసీదారుడి భార్య చందా సమాచారం దాచినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదు.
ఇతర బీమా కంపెనీలు.. పవన్ తీసుకున్న కొన్ని పాలసీలకు సంబంధించిన క్లెయిమ్‌లను ఇప్పటికే చెల్లించాయని నివేదిక తెలిపింది. అందుకే పాలసీ కింద బీమా మొత్తాన్ని నిరాకరించడం తప్పు అని కమిషన్ తేల్చింది. ఇది అన్యాయమని, సేవల్లో లోపంగా పేర్కొంటూ బీమా డబ్బులతో పాటు ఫైన్ కూడా విధించింది.