Supreme Court: రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతున్న రామాయణ సినిమాకు సుప్రీం కోర్టులో ఊరట దక్కింది. ఈ చిత్రంపై దాఖలైన పిటిషన్ పై అత్యవసర విచారణ జరిపేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. సినిమాలో ఇతిహాసానికి సంబంధించిన వాస్తవాలను వక్రీకరించారంటూ దాఖలైన పిటిషన్ పై స్పందిస్తూ భిన్నాభిప్రాయం ఉంటే మీరే ఒక సినిమాను తీసుకోవాలని పిటిషనర్లకు సూచించింది.
రణ్ బీర్ కపూర్, సాయిపల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో నటించిన రామాయణ సినిమా ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల సునామీని సృష్టిస్తోంది. అయితే ఈ సినిమాలో చరిత్రకు సంబంధించిన అంశాలను వక్రీకరించారంటూ ఇటీవల సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్య బాగ్చీ, వి. మోహనలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.
ఈ క్రమంలో స్పందిస్తూ సినిమా ఇప్పటికే థియేటర్లలో విడుదలైందని పేర్కొంది. చూడాల్సిన వారు ఇప్పటికే చూసేశారని, అందువల్ల అత్యవసర విచారణ అవసరం లేదని స్పష్టం చేసింది. సినిమా మేకర్స్ తమ అవగాహన మేరకు సినిమా తీశారని, భిన్నమైన కోణాన్ని చెప్పాలనుకుంటే సినిమా లేదా డాక్యుమెంటరీ రూపంలో వ్యక్తపరచవచ్చని ధర్మాసనం పేర్కొంది.
Also Read: ‘మూడేళ్లు ఓపిక పట్టాం, ఇక సహించం’.. సీఎస్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిర్యాదు!
అంతేకానీ ఇలా అత్యవసరం పేరుతో కోర్టు సమయాన్ని వృథా చేయవద్దని సూచించింది. సాధారణ క్రమంలోనే పిటిషన్ విచారణకు వస్తుందని తెలిపింది. కాగా యువతపై సినిమా చిత్రీకరణ ప్రభావం చూపే అవకాశం ఉందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. ఇతిహాసంలోని అనేక అంశాలను సరిగ్గా చూపలేదని కోర్టుకు విన్నవించారు.