Budget 2024: పార్లమెంటులో రేపు ఆర్థిక మంత్రి నిర్మలా సీతరామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను పూర్తి స్థాయి బడ్జెట్ ని సమర్పించబోతున్నారు. ఈ బడ్జెట్ లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (MSME- Micro Small And Medium Enterprises)కు కేంద్రం ఊరట నిచ్చే ప్రకటన చేయబోతోందని సమాచారం.
ఇప్పటివరకు ఈ చిన్న పరిశ్రమల నుంచి ఏదైనా సరుకులు కొనుగోలు చేసి 45 రోజుల లోపు చెల్లింపు చేయాలని కార్పోరేట్ కంపెనీలకు నిబంధన ఉండేది. ఇప్పుడా నిబంధనలను కేంద్రం తొలగించబోతోందని సమాచారం. దీనికి సంబంధించిన ప్రకటన రేపు లోక్ సభలో కేంద్ర మంత్రి చేయనున్నారని వార్తా సంస్థ పిటిఐ తెలిపింది.
Also Read: కొత్త బడ్జెట్‌లో ఆదాయపు పన్ను పరిమితి పెరుగబోతోందా?.. పాత లేదా కొత్త టాక్స్ స్లాబ్‌లో ఏది ఉచితం?
ఆదాయపు పన్ను సెక్షన్ 43B(H) లో మార్పులు చేసే అవకాశం
ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు.. బడ్జెట్ తయారీ దశలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యాపారాలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం.. ఆదాయపు పన్ను సెక్షన్ 43B(H) లో మార్పులు చేయాలని నిపుణులు చేసిన సూచనలకు కేంద్రం అంగీకరించింది.
గత ఆర్థిక సంవత్సరం 2023-24లో ఆదాయపు పన్ను చట్టంలో సెక్షన్ 43B క్లాజ్ తీసుకువచ్చింది. ఈ సెక్షన్ ప్రకారం.. కార్పొరేట్ సంస్థలు.. చిన్న పరిశ్రమల నుంచి ఏదైనా వస్తువుల కొనుగోలు చేసినా.. లేదా వారి నుంచి సేవలు పొందినా 45 రోజుల లోపు చెల్లింపులు చేయాలి.
ఈ ఆదాయపు పన్ను సెక్షన్ 43B క్లాజ్ ని, ఫైనాన్స్ చట్టం 2023లో భాగంగా కేంద్రం తీసుకువచ్చింది. ఈ చట్ట ప్రకారం.. కార్పొరేట్ కంపెనీలు ఎం ఎస్ ఎంఈలతో రాతపూర్వకంగా చేసుకున్న అగ్రీమెంట్ ప్రకారం.. 45 రోజుల లోపు చెల్లింపులు చేయకపోతే ఆ మొత్తాన్ని ఆదాయపు పన్నులో నుంచి మినహాయింపు చేయరు. ఫలితంగా కార్పొరేట్ కంపెనీలు అధికంగా టాక్స్ చెల్లించాల్సి వస్తుంది.
సెక్షన్ 43B క్లాజ్ తో నష్టం జరుగుతోందని చిన్న పరిశ్రమల వాదన
కేంద్రం తమ మంచి కోరి కార్పొరేట్ కంపెనీలు తమకు సమయానికి చెల్లింపులు చేయాలని కొత్త ఆదాయపు పన్ను చట్టం చేసినా.. దాని వల్ల తమ బిజినెస్ తగ్గిపోతోందని ఎం ఎస్ ఎంఈ లు కేంద్రాన్ని కోరాయి. ఈ నిబంధన వల్ల కార్పోరేట్ కంపెనీలు తమ నుంచి సరుకులు కొనుగోలు చేయకుండా రిజిస్ట్రేషన్ లేని చిన్న వ్యాపారుల వద్ద కొంటున్నారని తెలిపాయి.
కార్పోరేట్ కంపెనీలు బిజినెస్ విషయంలో తమను బ్లాక్ మెయిల్ చేస్తున్నాయని కొందరు చిన్న పరిశ్రమల యజమానులు ఫిర్యాదుల చేశారు. సరుకు కొనుగోలు చేయాలంటే రాతపూర్వక అగ్రీమెంట్లు వద్దని.. లేకపోతే ఎంఎస్ఎంఈ గా చేసుకున్న రిజిస్ట్రేషన్ రద్దు చేసుకోవాలని కార్పొరేట్ కంపెనీలు షరతులు విధిస్తున్నాయి అని ఎంఎస్ ఎంఈ యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ అంశంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మే నెలలో స్పందించారు. ఎంఎస్ఎంఈల సమస్యలను బడ్జెట్ 2024-25లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
భారతదేశ జీడిపీలో ఎంఎస్ ఎంఈల వాటా 30 శాతం ఉంది. వ్యవసాయం తరువాత చిన్న పరిశ్రమలదే అతిపెద్ద కాంట్రీబూషన్. దేశ ఎగుమతులలో45.56 శాతం ఎంఎస్ ఎంఈ ఉత్పత్తులే ఉండడం గమనార్హం.