Mallikarjun Kharge on NDA: ప్రధాని మోదీ సారథ్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోయే అవకాశం ఉందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖర్జున ఖర్గే జోస్యం చెప్పారు. మోదీ ప్రభుత్వానికి మెజార్టీ లేదని, ఎన్డీఏ సర్కార్ పొరపాటున ఏర్పడిందని అన్నారు. మోదీ ప్రభుత్వం కూలిపోవాలని తాము కోరుకోవట్లేదని తెలిపారు. దేశానికి మంచి జరగాలని ఆశిస్తున్నట్లు చెప్పారు.
దేశాన్ని బలోపేతం చేసేందుకు కలిసికట్టుగా పనిచేయాల్సి ఉందన్నారు. కానీ.. మంచి జరగకుండా చేయటం ప్రధాని మోదీకి అలవాటు అని విమర్శించారు. దేశం మరింత బలోపేతం అవడం కోసం తాము సహకరిస్తామని ఖర్గే పేర్కొన్నారు. మోదీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి పూర్తి సంఖ్యాబలం లేదని అన్నారు. ఎన్డీఏ సర్కారు మైనార్టీ సర్కార్ అని తెలిపారు. ఇదిలా ఉంటే ఖర్గే వ్యాఖ్యలపై ఎన్డీఏ మిత్ర పక్షాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి.
గతంలో కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాలను గుర్తు చేస్తూ విమర్శలు గుప్పించాయి. మెజార్టీ రాకుండానే పీవీ నరసింహ రావు, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాలు నడిపించలేదా ? కాంగ్రెస్ చరిత్ర గురించి ఖర్గేకు గుర్తు లేదా అని జేడీయూ నేత ఒకరు ఎద్దేవా చేశారు.
Also Read: బీహార్ సీఎం నితీష్ కుమార్‌పై పీకే సంచలన వ్యాఖ్యలు
ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 293 సీట్లు సాధించింది. గతంలో రెండు సార్లు సొంతంగా మెజార్టీ మార్క్ దాటిన బీజేపీ ఈ సారి 240 సీట్లకు పరిమితం అవడంతో కాంగ్రెస్ నేతలు.. మోదీ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదిలా ఉంటే 1991లో కాంగ్రెస్‌కు కూడా 244 స్థానాలు దక్కగా.. మిత్ర పక్షాలతో కలిసి పీవీ నరసింహ రావు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2004లో కాంగ్రెస్ 114 స్థానాల్లో గెలుపొందగా.. మిత్ర పక్షాల అండతో మన్మోహన్ సింగ్ ప్రధాని అయ్యారు.