Parliament session updates(Latest political news in India) : మణిపూర్ అంశం పార్లమెంట్ ను కుదుపేస్తోంది. ఈ వర్షాకాల సెషన్ లో పార్లమెంట్ ఉభయ సభల్లో కార్యకలాపాలు సజావుగా సాగడం లేదు. ప్రతిపక్షాల ఆందోళనతో తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. సోమవారం కూడా పార్లమెంట్ లో అదే పరిస్థితి ఎదురైంది. మణిపూర్ అంశాన్ని రూల్ 267 కింద చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో తొలుత మధ్యాహ్నం 2 గంటల వరకు లోక్ సభ వాయిదా పడింది. అలాగే రాజ్యసభ కార్యకలాపాలకు అంతరాయం కలిగింది.
సోమవారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవడానికి ముందు ప్రధాని మోదీ
కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. తాజాగా పరిణామాలపై చర్చించారు. మరోవైపు ప్రతిపక్షాల కూటమి ఇండియా సభ్యులు కూడా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రెండురోజులపాటు మణిపూర్‌లో పర్యటించిన ఎంపీలు ఈ భేటీకి హాజరయ్యారు. మణిపూర్ అంశంపై పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.
రాజ్యసభలో మణిపూర్ అంశాన్ని చర్చించాలని తాము కోరుకుంటున్నామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. సభ్యులకు ఇచ్చిన స్వేచ్ఛను విపక్ష ఎంపీలు దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా విపక్షాలు 9 రోజులపాటు సభా సమయాన్ని వృథా చేశాయని వెల్లడించారు.