– సింగపూర్ చేరుకున్న ప్రధాని
– కీలక రంగాల్లో పెట్టుబడులకు చర్చలు
– నేడు, రేపు సాగనున్న పర్యటన
– ఘనస్వాగతం పల్కిన ప్రవాస భారతీయులు
Singapore: పెట్టుబడులు పెట్టేందుకు భారత్ అత్యంత అనుకూలమైన దేశమని ప్రధాని మోదీ అన్నారు. తన విదేశీ పర్యటనలో భాగంగా మంగళవారం బ్రూనైలో పర్యటించిన ప్రధాని, సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ ఆహ్వానం మేరకు బుధవారం సింగపూర్ చేరుకున్నారు. సింగపూర్ హోం, న్యాయ వ్యవహారాల మంత్రి కె షణ్ముగం ప్రధానికి సాదర స్వాగతం పలికారు. రెండురోజుల పాటు సాగనున్న ఈ పర్యటనలో పెట్టుబడులను ఆకర్షించటంతో బాటు భౌగోళికంగా అత్యంత కీలకమైన సింగపూర్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పెంచుకోవాలని మోదీ భావిస్తున్నారు. ప్రధాని వెంట విదేశాంగ మంత్రి జై శంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ ఇతర సీనియర్ అధికారులు ఉన్నారు. ప్రధాని హోదాలో మోదీ సింగపూర్‌కు వెళ్లడం ఇది అయిదవసారి కావటం గమనార్హం.
కీలక మిత్రదేశం
1965 నుంచి అంటే.. 60 ఏళ్లుగా భారత్-సింగపూర్ మధ్య దౌత్య సంబంధాలు కొనసాగుతున్నాయి. అలాగే, 2015లో మోదీ సింగపూర్ పర్యటనలో వ్యూహాత్మక భాగస్వామ్యం కొత్త పుంతలు తొక్కింది. నాటి నుంచి సింగపూర్ మనకు వ్యూహాత్మక భాగస్వామిగా ఉంది. ఈ రెండు సందర్భాలూ కలసిరావటంతో ప్రధాని ఈ పర్యటన చేస్తున్నారు. పైగా, ఈ దేశంతో వేలాది ఏళ్లుగా మనకు బలమైన సాంస్కృతిక బంధమూ ఉంది. ఇక్కడ 3.5 లక్షల మంది భారత సంతతి ప్రజలున్నారు. లుక్ ఈస్ట్ పాలసీలో కీలక భాగస్వామిగా, అసోసియేషన్ ఆఫ్ సౌత్‌ఈస్ట్ ఆసియన్ నేషన్స్‌లో సింగపూర్ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. సుమారు 9,000 భారతీయ కంపెనీలు సింగపూర్‌లో నమోదయ్యాయి.
ఘన స్వాగతం
ప్రవాస భారతీయులు మోదీకి గ్రాండ్ వెల్‌కమ్ పలికారు. మోదీకి ఓ మహిళ రాఖీ కూడా కట్టింది. ఈ సందర్భంగా అక్కడ బస చేస్తున్న హోటల్ వద్ద మోదీ డోలు వాయించారు. అక్కడి ప్రవాస భారతీయులతో ప్రధాని ముచ్చటించి, వారి మంచీ చెడూ అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
బిజీబిజీ షెడ్యూల్..
గురువారం పార్లమెంట్ ఆవరణలో ప్రధాని మోదీని అక్కడి ఎంపీలు స్వాగతించనున్నారు. అనంతరం ఆయన దేశాధ్యక్షులు థర్మన్ శణ్ముగరత్నంతో ప్రధాని మోదీ భేటీ కానున్నారు. పలు కీలక అంశాలపై తమ ఆలోచనలను ఇరువురు నేతలు పంచుకోనున్నారు. పిదప.. సింగపూర్‌కు చెందిన సీనియర్ రాజకీయ నాయకులు లూంగ్, గో ఛోక్ టాంగ్‌ను కూడా ప్రధాని కలిసి మాన్యుఫాక్చరింగ్, డిజిటలైజేషన్, సస్టయినబుల్ డవలప్‌మెంట్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టే అంశంపై చర్చించనున్నారు. ఈ పర్యటన దశలో సెమీకండక్టరు రంగంలో మానవ వనరుల నైపుణ్యాభివృద్ధికి సంబంధించి ఎంఒయులపై సంతకాలు జరుగుతాయని విదేశాంగ శాఖ తెలిపింది.