Heavy Rains: దేశం నుంచి పూర్తిగా నైరుతి రుతుపవనాలు నిష్క్రమించాయి. ఇప్పుడు ఈశాన్య రుతుపవనాలు వంతైంది. దక్షిణాది రాష్ట్రాలపై ఆ ప్రభావం తీవ్రంగా చూపనుంది. శనివారం అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 20 నాటికి అది వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలాఉండగా ఈనెల 24న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు తెలుస్తోంది.
ఈశాన్య రుతుపవనాలు ఎంట్రీ
దేశం నుండి నైరుతి రుతుపవనాలు నిష్క్రమించినట్టు భారత వాతావరణ శాఖ-IMD గురువారం తెలిపింది. అదే సమయంలో ఈశాన్య రుతుపవనాలు దక్షిణాది రాష్ట్రాల్లోకి ప్రవేశించాయి. ముఖ్యంగా తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళలో భారీ వర్షాలు పడనున్నాయి. రాబోయే వారం రోజులపాటు కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌ల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
శుక్రవారం నాడు తమిళనాడు, కేరళ, లక్షద్వీప్‌లలో అతి భారీ వర్షాలు కురుస్తాయని భావించింది. గడిచిన 24 గంటల్లో తమిళనాడులో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. అలాగే కొంకణ్, గోవాలో కూడా భారీ వర్షాలు నమోదయ్యాయి.
దక్షిణాది రాష్ట్రాల్లో వానలే వానలు
అటు ఏపీకి వర్షాలు పడనున్నాయి. రానున్న 24 గంటల్లో రాయలసీమ-దక్షిణ కోస్తాల్లో అక్కడక్కడ భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. శుక్రవారం రాయలసీమలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ చెప్పింది. జూన్ ఒకటి నుంచి సెప్టెంబరు 30 వరకు నైరుతి సీజన్‌గా అధికారులు పరిగణిస్తున్నారు. ఒకరోజు ఆలస్యంగా దేశంలోని అన్నిప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాలు వైదొలిగాయి.
నైరుతి సీజన్‌లో దేశంలో భారీ వర్షాలు పడ్డాయి. నాలుగు నెలల సీజన్‌లో 937.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. గురువారం నుంచి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాయి. అక్టోబరు నుంచి డిసెంబరు మధ్య ఈశాన్య రుతుపవనాల సీజన్‌గా పరిగణిస్తారు. ఈ సీజన్‌లో బంగాళాఖాతం మీదుగా తుఫానులు సంభవిస్తాయి. వీటి ప్రభావంతో దక్షిణాదిలో భారీగా వర్షాలు కురుస్తాయి.
ALSO READ: గుజరాత్ కేబినెట్ మొత్తం రాజీనామా, ఎందుకంటే
ఈశాన్య రుతుపవనాల కాలంలో కేరళలో సగటున 492 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. గతేడాది 487.2 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇదిలావుండగా కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. కొన్ని జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదు అవుతుందని తెలిపింది.
ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో శనివారం నాటికి అల్పపీడనం ఏర్పడనుంది. పశ్చిమ వాయవ్యంగా పయనించి సోమవారానికి వాయుగుండంగా బలపడనుంది. అలాగే ఈనెల 24న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. వాయవ్యంగా పయనించే క్రమంలో బలపడనుందని ఐఎండీ తెలిపింది.