విజయవాడలో గత వందేళ్లలో లేనంతగా వర్షం పడి ఊరంతా నీట మునిగింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు స్థానికంగా ఉన్న వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండటంతో కృష్ణానది భీకరంగా ప్రవహిస్తోంది. రాజధాని అమరావతి ప్రాంతాన్ని, విజయవాడ నగరాన్ని వరద చుట్టుముట్టింది. సీఎం చంద్రబాబు నివాసంతోపాటు పలువురు మంత్రుల నివాసాలు, ప్రభుత్వ అధికారుల భవనాలు కూడా నీటమునిగాయి. ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. స్వయంగా సీఎం చంద్రబాబు విజయవాడలోని కలెక్టర్ కార్యాలయంలోనే బస చేసి సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. స్వయంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.
ఇలాంటి టెన్షన్ వాతావరణంలో పులివెందుల ఎమ్మెల్యే జగన్ సడన్‌గా విజయవాడలో ఓదార్పు యాత్రకు వచ్చి తనదైన రాజకీయం చేసి వెళ్లారు. విజయవాడలో కృష్ణానది అంచున కృష్ణలంక, రామలింగేశ్వర నగర్, యనమలకుదురు తదితర ప్రాంతాల వాసులు గతంలో చినుకు పడితే వణికిపోయేవారు. ప్రకాశం బ్యారేజ్ గెట్లెక్కితే బెంబేలెత్తిపోయేవారు. కరకట్ట వెంబడి ఇళ్లను నీళ్లు ముంచెత్తి జనానికి కంటి మీద కునుకు లేకుండా చేసేవి ఆ ప్రాంతాల నుంచి దాదాపు 80 వేల మంది పునరావాస కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలో 2014లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రిటైనింగ్ వాల్ నిర్మాణం ప్రారంభించింది. దాదాపు పూర్తైపోయిన ఆ వాల‌్‌ని జగన్ సర్కారు వచ్చాక ఇరిగేషన్ అధికారులు పూర్తి చేయించారు.
ఈ రిటైనింగ్ వాల్ ఉండటంతో ఇప్పుడు ప్రకాశం బ్యారేజీలో 11 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చినా కృష్ణలంక, రామలింగేశ్వర నగర్, యనమలకుదురు ప్రాంతాలకు వరదనీరు చేరలేదు. ఐతే.. దీన్ని వైసీపీ తమ ఘనతే అని చెప్పుకుంటోంది. తామే రిటైనింగ్ వాల్ నిర్మించామని.. దానివల్లే వరద నీరు విజయవాడలో లోతట్టు ప్రాంతాలను చుట్టుముట్టలేదని చెప్పుకుంటోంది. ఇదంతా జగన్ ఘనతే అని వైసీపీ ప్రచారం చేసుకుంటోంది. తాజాగా విజయవాడ వచ్చి వెళ్లిన జగన్ కూడా తన పార్టీ కార్యకర్తలతో జేజేలు కొట్టించుకుని రిటైనింగ్ వాల్ తన ఘనతే అని సొంత మీడియాలో ప్రచారం చేసుకున్నారు.
రిటైనింగ్ వాల్‌తో పాటు వరదలను తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేశారు పులివెందుల ఎమ్మెల్యే.. గడిచిన ఐదేళ్లలో ఏనాడూ వరద ప్రాంతాలను సందర్శించని ఆయన.. నేరుగా విజయవాడలో బురద నీటిలోకి దిగి సొంత పార్టీ వారినే ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఎప్పటి మాదిరిగానే వాలంటీర్ల వ్యవస్థ గురించి చెప్తూ.. చంద్రబాబు సర్కార్‌పై ధ్వజమెత్తి వెళ్లారు. వరద బాధితుల పరామర్శకు వచ్చిన ఆయన తనదైనస్టైల్లో నవ్వుతూ అందరికీ షేక్ హ్యాండ్లు ఇస్తూ.. తనదైన మ్యానరిజంతో బుగ్గలు నిమురుతూ కాసేపు గడిపి లండన్ టూర్ కోసం హడావుడిగా వెళ్లిపోయారు. అటు పార్టీ పరంగా కాని ఇటు వ్యక్తిగతంగా కాని వరద బాధితులకు సాయం ప్రకటించే టైం లేకుండా పోయిందాయనకి.
సీఎం అవ్వడానికి ముందు పాదయాత్ర పేరుతో జనంలో కాళ్లకి బలపం కట్టుకుని తిరిగిన జగన్ అధికారంలోకి వచ్చాక.. జనానికి నల్లపూస అయ్యారు. పరదాల మాటున పాలనతో విమర్శలు ఎదుర్కొన్నారు. ఒక సారి వరద ప్రాంతాల సందర్శనకు వెళ్లి రెడ్ కార్పెట్ వేయించుకుని నడిచి మరోసారి అందరికీ టార్గెట్ అయ్యారు. అలాంటాయన విజయవాడలో చేసిన హడావుడితో మరో సారి నెటిజన్ల చేతిలో ట్రోల్ అవుతున్నారు.
Also Read: బెజవాడ వరద.. బాధితుల ఆగ్రహం.. కొందరికే సాయం.. అడ్మినిస్ట్రేషన్ ఫెయిలైందన్న సీఎం చంద్రబాబు
ఇంతకీ ఆ రిటైనింగ్ వాల్ ను కట్టించిందెవరు ? జగన్ చెబుతున్న మాటల్లో నిజమెంత ఉంది ? అని చూస్తే.. ఆయన చెప్పేవన్నీ అబద్ధాలని తేలిపోయాయి. కృష్ణానదికి వరద పోటెత్తిన ప్రతిసారి కృష్ణలంక మునిగిపోయేది. ఏడాదికి ఒకసారైనా అక్కడి నివాసితులు వరద నీటిలో నానాల్సిందే అన్నట్లు ఉండేది పరిస్థితి. అందుకే.. 2009లోనే కృష్ణానది నుంచి కృష్ణలంకను రక్షించేందుకు రిటైనింగ్ వాల్ కట్టాలని ప్లాన్ చేసింది నాటి టీడీపీ ప్రభుత్వం. మూడు విడతలుగా వాల్ కట్టాలని డిజైన్ చేశారు.
తొలివిడతలో రామలింగేశ్వర నగర్ – రాణిగారి తోట మధ్య, రెండో విడతలో రాణిగారి తోట – కనకదుర్గ వారధి, మూడో విడతలో పద్మావతి ఘాట్ – కనకదుర్గ వారధి ల మధ్య.. మొత్తం 3.44 కిలోమీటర్ల మేర రిటైనింగ్ వాల్ కట్టాలని ప్లాన్ చేశారు. 2009-2014 మధ్యలో టీడీపీ హయాంలోనే 2.28కిలోమీటర్ల మేర రిటైనింగ్ వాల్ కట్టడం పూర్తయింది.
గోడనిర్మాణం చేపట్టిన సమయంలో.. అక్కడున్న నివాసితులను టీడీపీ ప్రభుత్వం ఖాళీ చేయించి.. బదులుగా మరోక ఇల్లు కట్టిస్తామని, నష్టపరిహారం చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ.. దానిని ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ రాజకీయం చేసింది. ఇళ్లు కోల్పోయిన కుటుంబాలతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులో ఫిర్యాదులు దాఖలు చేయించింది. కోర్టులో కేసు ఉండటంతో గోడ నిర్మాణం పూర్తికాలేదు. ఇంకా కిలోమీటరున్నర మేర నిర్మాణం జరగాల్సి ఉండగా.. అప్పుడే వచ్చిన ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. కానీ.. కాంప్లికేటెడ్ ఏరియాల్లో గోడ నిర్మాణం పూర్తి కావడంతో 2019లో వచ్చిన వరదల నుంచి ఆయా ప్రాంతాలు ముంపుకు గురికాకుండా కాపాడింది.
ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం.. మధ్యలోనే ఆగిపోయిన రిటైనింగ్ వాల్ నిర్మాణాన్ని పూర్తి చేసింది. కానీ వైసీపీ మాదిరిగా టిడిపి ఆ సమయంలో ఎలాంటి సమస్యలు సృష్టించలేదు. ఇప్పుడు వచ్చిన వరదల నుంచి కృష్ణమ్మ దిగువన ఉన్న ప్రాంతాలను కాపాడిన ఆ వాల్ ను కట్టించింది తామేనని చెప్పుకుంటున్నారు వైసీపీ నేతలు. ఆ పార్టీ సోషల్ మీడియా టీమ్ ఈ విషయంపై నిన్నటి నుంచి ప్రచారం చేసుకుంటోంది. వైసీపీనే ఆ గోడ కట్టించింది అనుకుందాం. 2019 జూన్ లో అధికారంలోకి వచ్చిన వైసీపీ.. 3 నెలల్లోనే గోడ నిర్మాణాన్ని పూర్తి చేసేసిందా ? అసలు అది సాధ్యమయ్యే పనేనా ? రిటైనింగ్ వాల్ పూర్తయ్యాక నాటి మంత్రులు కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ అక్కడున్న ఫొటోలను షేర్ చేసి.. ఆ క్రెడిట్ అంతా తమదేనని చెప్పుకుంటోంది వైసీపీ.
రిటైనింగ్ వాల్ కట్టించిన ఘనత తనదేనని తన పార్టీ వారితో జగన్ చెప్పించుకుంటుండంపై బెజవాడ వాసులు మండిపడుతున్నారు. అది టీడీపీ హయాంలో కట్టారు కాబట్టే 2019లో కూడా విజయవాడ ఈస్ట్ నియోజకవర్గానికి చెందిన కృష్ణలంక వాసులు టీడీపీ అభ్యర్థినే గెలిపించారని గుర్తు చేస్తున్నారు. ఏదేమైనా జనాలు కష్టాల్లో ఉంటే.. జగన్ మాత్రం ఆ కష్టాలను కూడా తనకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నిస్తుండటంపై దుమ్మెత్తి పోస్తున్నారు ప్రజలు.