దీపావళి అంటేనే దీపాల పండుగ. చిమ్మ చీకట్లు కమ్ముకున్న వేళ దీపాల కాంతులు కనువిందు చేస్తాయి. అయితే, ఈ వేడుకను సౌత్ తో పోల్చితే నార్త్ లో మరింత ఘనంగా జరుపుకుంటారనే ఓ ప్రచారం ఉంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో కూడా ఇదే విషయాన్ని నిరూపిస్తుంది. అంతేకాదు, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.
తాజాగా స్వీటీ సింగ్ అనే మహిళ ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఆమె బెంగళూరు నుంచి ఢిల్లీకి విమానంలో ప్రయాణిస్తున్నట్లు చెప్పింది. ఈ సందర్భంగా రెండు నగరాల మధ్య దీపావళి వేడుకల్లో తేడా ఎలా ఉంటుందో చూపించే ప్రయత్నం చేసింది. బెంగళూరులో విమానం టేకాఫ్ కాగానే ఓ వీడియో తీసింది. దీపావళి పండుగ అయినప్పటికీ, కర్నాటక రాజధానిలో అనుకున్న స్థాయిలో దీపాల కాంతులు కనిపించలేదు. పైగా చాలా చోట్ల చీకట్లు కనిపించాయి. విమానం ఢిల్లీకి చేరగానే మరోసారి వీడియో తీసింది. ఇందులో దేశ రాజధాని నగరం అంతా దీపాల కాంతుల్లో వెలిగిపోతూ కనిపించింది. ఈ వీడియో వైరల్ కావడంతో దీపావళి సందర్భంగా రెండు మెట్రో నగరాలు ఎందుకు భిన్నంగా కనిపించాయనే అంశంపై ప్రజలు తమ లోచనలు పంచుకున్నారు. సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగింది. “ఢిల్లీ: ఈ నగరం నా హృదయం” అంటూ షేర్ చేసిన ఈ వీడియో ఇప్పటి వరకు 3.1 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. వేలాది కామెంట్స్ వస్తున్నాయి.
Read Also: రన్నింగ్ ట్రైన్ లో శిశువుకు శ్వాస సమస్య, ఆర్మీ జవాన్ ఏం చేశాడంటే?
ఇక ఈ వీడియోకు సంబంధించి సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. బెంగళూరు విమానాశ్రయం నగరానికి దూరంగా ఉందని, ఢిల్లీ విమానాశ్రయం జనాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు పక్కనే ఉందని, అందుకే దీపాల వెలుగు ఎక్కువగా కనిపించిందని కొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. “మీరు ఎక్కడికి వెళ్ళినా, ఢిల్లీ/NCR దీపావళి వైబ్ ను ఏ ప్రాంతంతో పోల్చలేరు. బీహార్ నుంచి వచ్చినందున, ఇక్కడ పండుగను చూసి నేను ఆశ్చర్యపోతాను. అందరికీ ప్రకాశవంతమైన, ఆనందకరమైన దీపావళి శుభాకాంక్షలు” అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. “బెంగళూరువాడిగా, ఢిల్లీ/ఉత్తర రాష్ట్రాలు దీపావళి, హోలీ పండుగలను గొప్పగా జరుపుకుంటాయని భావిస్తున్నాను. అదే సమయంలో గణేష్ చతుర్థి, ఉగాది, కృష్ణ జన్మాష్టమి, మకర సంక్రాంతి లాంటి పండుగలను సౌత్ స్టేట్స్ ఘనంగా జరుపుకుంటాయి” అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. “పండుగల విషయంలో ఒక ప్రాంతంతో మరో ప్రాంతాన్ని పోల్చాల్సిన అవసరం లేదు. కొన్ని పండుగలు ఉత్తరాదిలో ఘనంగా జరపుకుంటారు. మరికొన్ని పండుగలను దక్షిణాదిలో ఘనంగా జరపుకుంటారు” మరో వ్యక్తి రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ చర్చ జోరుగా కొనసాగుతోంది.
Read Also: మెట్రో రైల్లో చిన్నారుల డ్యాన్స్, చూస్తే ఫిదా కావాల్సిందే!