– తెలంగాణలో వరదలపై కేంద్రం స్పందన
– ఎస్‌డీఆర్ఎఫ్ నిధుల వినియోగానికి గ్రీన్ సిగ్నల్
– నష్టం వివరాలు నిర్ణీత ఫార్మాట్‌లో పంపాలన్న కేంద్రం
– తెలంగాణ సీఎస్‌కు హోంశాఖ నుంచి లేఖ
– త్వరలోనే కేంద్ర బృందం ఏరియల్ సర్వే
– విపత్తు నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అంటూ బీఆర్ఎస్ విమర్శలు
Telangana Flood: తెలంగాణలో వరదలపై కేంద్రం సరిగ్గా స్పందించడం లేదని విమర్శలు వచ్చిన నేపథ్యంలో, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించి రాష్ట్రం దగ్గర కేంద్ర నిధులు ఉన్నాయని, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎస్‌డీఆర్ఎఫ్) నుంచి వినియోగించుకోవచ్చని చెప్పారు. రాష్ట్రం దగ్గర 13 వందల కోట్ల దాకా నిధులున్నాయన్నారు. ఇదే క్రమంలో కేంద్ర హోంశాఖ నుంచి రాష్ట్ర సీఎస్‌కు లేఖ వచ్చింది. అందులో ఎస్‌డీఆర్ఎఫ్ నిధులపై కీలక ఆదేశాలు జారీ చేసింది కేంద్రం.
కేంద్రం నుంచి లేఖ
తెలంగాణ సీఎస్‌కు కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. తెలంగాణలో వరద నష్టం వివరాలు నిర్ణీత ఫార్మాట్‌లో పంపాలని ఆదేశించింది. రూ.1,345 కోట్ల ఎస్‌డీఆర్ఎఫ్ నిధులు ఇప్పటికే తెలంగాణ దగ్గర అందుబాటులో ఉన్నాయని వెల్లడించింది. వరదల్లో సాయం చేసేందుకు ఇప్పటికే 12 ఎన్‌డీఆర్ఎఫ్ దళాలు, 2 హెలికాప్టర్లు పంపించినట్లు చెప్పింది కేంద్ర హోంశాఖ. ఎస్‌డీఆర్ఎఫ్ నిధికి కేంద్ర వాటా నిధుల కోసం వివరాలు పంపాలని స్పష్టం చేసింది. జూన్‌లో 208 కోట్ల రూపాయల విడుదలకు ఎలాంటి వినతి రాలేదని తెలిపింది. యుటిలైజేషన్ సర్టిఫికెట్ సమర్పించకపోవడం వల్లే ఆ నిధులు విడుదల చేయలేదని పేర్కొంది. అది సమర్పించిన వెంటనే వాటిని విడుదల చేస్తామని తెలిపింది హోంశాఖ.
త్వరలో ఏరియల్ సర్వే
అకాల వర్షాలు, వరదలు తెలంగాణలోని పలు జిల్లాల్లో తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఈ నేపథ్యంలో నిధుల వినియోగం, మంజూరుకు సంబంధించి రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో హోంశాఖ డైరెక్టర్ అశిష్ గవాయ్‌కు కీలక ఆదేశాలు జారీ చేశారు షా. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఢిల్లీ నుంచి లేఖ వచ్చింది. ఎస్‌డీఆర్ఎఫ్ నిధులపై క్లారిటీ ఇచ్చింది. ఇటు ఏరియల్ సర్వేపైనా అమిత్ షాను కోరిన నేపథ్యంలో ఆయన సానుకూలంగా స్పందించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో త్వరలోనే కేంద్ర బృందం సర్వే చేయనుంది.
రంగంలోకి బీజేపీ
బీజేపీ కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు సిద్ధమైంది. కిషన్ రెడ్డి, బండి సంజయ్ నేతృత్వంలో రెండు బృందాలు జిల్లాల్లో పర్యటించనున్నాయి. వరదల వల్ల జరిగిన నష్టాన్ని వీరు అంచనా వేయనున్నారు. అలాగే, బాధితులను పరామర్శించి ఓదార్చనున్నారు.