The Biggest Pranksters in world : యూట్యూబ్ లో ప్రాంక్ వీడియోలు ఎంత పాపులరో అందరికీ తెలిసిందే. కళ్ల ముందే జరిగే కనికట్టుకు అవాక్కయ్యే జనాలు ఎందరో. ప్రాంక్ వీడియోలతో ఏదో కొందర్ని నిర్ఘాంతపోయేలా చేయొచ్చు. కానీ… ఇద్దరు ముదుర్లు మాత్రం తమ ప్రాంక్ విద్యా ప్రావీణ్యంతో… ప్రపంచమే అవాక్కయ్యేలా చేశారు.
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను కొనగానే… 75 శాతం మంది ఉద్యోగుల్ని తీసేస్తాడనే ప్రచారం జరిగింది. అది ఎంత నిజమో తెలీదు గానీ… ట్విట్టర్ ను ఇలా కొన్నాడో లేదో… నలుగురు టాప్ ఎంప్లాయిస్ ని అలా తీసేశాడు… మస్క్. ఈ పని ట్విట్టర్ ఉద్యోగుల్లో చాలా ఆందోళన కలిగించింది. సరిగ్గా ఈ పరిస్థితినే చక్కగా వాడుకున్నారు… ఇద్దరు ప్రాంక్‌స్టర్లు. వాళ్లలో ఒకడు భారతీయుడు.
ట్విటర్ ఆఫీస్ దగ్గర… చేతిలో రెండు అట్టపెట్టెలతో మీడియాకు కనిపించారు… రాహుల్ లిగ్మా, డానియల్ జాన్సన్ అనే ఇద్దరు వ్యక్తులు. ట్విట్టర్ నుంచి తమను తీసేశారని ఎంతో ఆవేదనగా చెప్పారు. ఒబామా భార్య మిషెల్లీ ఉంటే తమకీ పరిస్థితి రానిచ్చేవారు కాదంటూ బోరుమన్నారు. అంతే. వాళ్ల అమాయక, ఆవేదనాభరిత నటన చూసి… మీడియా మొత్తం గుడ్డిగా నమ్మేసింది. ట్విట్టర్ నుంచి ఆ వార్తను ఖరారు చేసుకోకుండానే… బ్రేకింగ్ న్యూస్ అంటూ ఊదరగొట్టింది. ఆ న్యూస్ చూసిన జనాలు అయ్యో పాపం అని అనుకున్నారు. ఆ తర్వాతే అందరికీ తెలిసింది… వాళ్లు చేసింది ప్రాంక్ అని. దాంతో… మస్క్ సహా అందరూ నోరెళ్లబెట్టారు. ఓరి మీ ప్రాంక్ పిచ్చి తగలెయ్యా! అని తిట్టుకున్నారు. ఎవరేమనుకుంటే వాళ్లకేం. తమ ప్రాంక్ విద్యా ప్రావీణ్యానికి ప్రపంచమే అవాక్కైనందుకు తెగ సంబరపడిపోతున్నారు… ఆ ఇద్దరు ప్రాంక్‌స్టర్లు.