PUBG Love Story: ఆన్‌లైన్ గేమ్‌ల ద్వారా ఏర్పడే పరిచయాలు కొన్నిసార్లు జీవితాలను ఎంతటి విషాదంలోకి నెడతాయో చెప్పడానికి కోల్‌కతాలో జరిగిన ఓ ఘటనే నిదర్శనం. పబ్‌జీ గేమ్‌తో మొదలై మూడేళ్ల పాటు సాగిన ఓ ప్రేమకథ.. మరో యువతి ఎంట్రీతో అత్యంత దారుణంగా ముగిసింది.
పబ్‌జీ పరిచయం.. మూడేళ్ల ప్రేమ
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని బారానగర్ ప్రాంతానికి చెందిన అంజలి షా (26)కు, ధరమ్ వీర్ అనే యువకుడికి మూడేళ్ల క్రితం పబ్‌జీ గేమ్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో ఇద్దరూ కొంతకాలంగా సన్నిహితంగా ఉంటున్నారు. అయితే, వీరి ప్రేమ సాఫీగా సాగుతున్న సమయంలోనే ధరమ్ వీర్‌కు అదే పబ్‌జీ గేమ్ ద్వారా మరో యువతి పరిచయమైంది.
బ్రేకప్ చెప్పిందన్న కక్షతో..
కొత్తగా పరిచయమైన యువతితో ధరమ్ వీర్ చనువుగా ఉండటాన్ని గమనించిన అంజలి అతడిని నిలదీసింది. ఈ విషయంపై ఇద్దరి మధ్య తీవ్ర గొడవలు జరగడంతో, ఇక కలిసి ఉండలేనని భావించిన అంజలి అతడికి బ్రేకప్ చెప్పింది. దీన్ని జీర్ణించుకోలేని ధరమ్ వీర్, ఆమెను ఎలాగైనా అంతమొందించాలని పక్కా ప్లాన్ వేశాడు.
గెస్ట్ హౌస్‌లో హత్య..
పథకం ప్రకారం కోల్‌కతాలో ఓ గెస్ట్ హౌస్ బుక్ చేసిన ధరమ్ వీర్, చివరిసారిగా మాట్లాడుదామనే నెపంతో అంజలిని అక్కడికి పిలిచాడు. ఇద్దరి మధ్య మాటలు జరుగుతుండగానే, ఆమె తలపై బలమైన వస్తువుతో బాది, గొంతు నులిమి దారుణంగా హత్య చేశాడు. అనంతరం అంజలి ఫ్లాట్‌కు వెళ్లి అక్కడున్న బంగారం, ఆమె మొబైల్ ఫోన్‌తో పాటు ఇతర విలువైన వస్తువులను దోచుకుని పరారయ్యాడు.
రైల్వే స్టేషన్‌లు మారుతూ ప్రయాణం..
పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు అంజలి ఫోన్‌ను తన వెంట తీసుకెళ్లి, ఉద్దేశపూర్వకంగా రైల్వే స్టేషన్‌లు మారుతూ ప్రయాణించాడు. చివరకు ఢిల్లీకి చేరుకున్న నిందితుడి కదలికలను సాంకేతిక ఆధారాలతో గుర్తించిన పోలీసులు, నవంబర్ 12న ధరమ్ వీర్‌ను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు.
Also Read: తెలంగాణలో పాలసీ పెరాలసిస్ లేదు.. పెట్టుబడిదారులకు సీఎం రేవంత్ రెడ్డి బిగ్ ఆఫర్!