Phone Tapping: దేశ రాజకీయాల్లో మళ్లీ ఫోన్ ట్యాపింగ్ ప్రకంపనలు మొదలయ్యాయి. తన ఫోన్ ను ట్యాప్ చేస్తున్నారని ఆరోపించిన రాహుల్, ఈ అంశంపై చర్చకు రావాలని ప్రధానికి సవాల్ విసిరారు. ఇక తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనాలు తెరపైకి రావడానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందన్నారు సీఎం రేవంత్. లేటెస్ట్‌గా ప్రశాంత్ కిషోర్ కామెంట్స్‌తో ఫోన్ ట్యాపింగ్ వివాదం మరోసారి చర్చల్లోకి వచ్చింది.
ఫోన్ వుండడం ఎంత కామనో తమ ఫోన్ ను ఎవరైనా ట్యాప్ చేస్తున్నారా? అన్న అనుమానం అలా మారింది. ముఖ్యంగా పొలిటీషియన్లు, బ్యూరోక్రాట్స్‌లో ఫోన్ ట్యాపింగ్ గుబులు రేపుతోంది. శాంతి భద్రతల కోణంలో ఫోన్ ట్యాపింగ్ చేయోచ్చు.. కానీ ఆ మిషతో వ్యక్తిగత సంబాషణల చోరీ జరుగుతుందనే ఆరోపణలు గతంలో రచ్చ రేపాయి. తన ఫోన్‌ను నా ఫోన్‌ను ప్రధాని మోదీ ట్యాప్ చేస్తున్నారంటూ లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు ఇప్పుడు దేశ రాజకీయాల్లో చర్చకు దారితీశాయి. తన ఫోన్‌లోనే కీలక ఆధారాలు ఉన్నాయని, మోదీతో బహిరంగ చర్చకు సిద్ధమని రాహుల్ సవాల్ విసిరారు.
Also Read: మమ్మల్ని ఆపడం ఎవరి తరమూ కాదు.. భారత్ సమ్మిట్‌లో రేవంత్ ధీమా
ఇక ఇదే వ్యవహారంపై స్పందించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. తన ఫోన్ ట్యాప్ చేసినా తనకు అభ్యంతరం లేదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ త్వరలోనే పూర్తవుతుందని, సంచలన విషయాలు బయటకొస్తాయని ప్రకటించారు. మరోవైపు జనసురాజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఫోన్ ట్యాపింగ్ అనేది వాస్తవమన్నారాయన. పెగాసస్ వ్యవహారంలో తన ఫోన్ కూడా నిఘా లక్ష్యాల్లో ఉన్నట్లు తనకు తెలిసిందన్నారు పీకే. దేశంలో చాలా మంది ఫోన్లు ట్యాపవుతున్నాయి. ఈ అంశంపై విస్తృతంగా చర్చ జరగాలి. ఫోన్ ట్యాపింగ్ గురించి ప్రజలకు నిజాలు తెలవలన్నారు ప్రశాంత్ కిషోర్.
అటు రాహుల్ గాంధీ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై బీజేపీ ఎదురుదాడికి దిగింది. ఆరోపణలకు ఆధారాలేవీ లేవని కొట్టిపారేసింది.రాహుల్ ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం ఎవరికీ లేదన్నారు బీజేపీ నేత రాజీవ్ చంద్రశేఖర్.. ఆధారాలు చూపకుండా ఆరోపణలు చేయడం రాహుల్‌కు అలవాటుగా మారిందని మండిపడ్డారు. ఫోన్ ట్యాప్ అవుతోందని అనుమానముంటే పోలీసులకు ఇచ్చి పరీక్షించుకోవాలని సవాల్ విసిరారు బీజేపీ నేతలు. ఆరోపణలు ఒకవైపు.. ఖండనలు మరోవైపు.. అసలు ఫోన్ ట్యాపింగ్ వెనుక నిజాలేంటన్నది తేలాల్సి ఉంది!. ఫోన్ ట్యాపింగ్ వ్యవహరం రాజకీయాల్లో ముసలం తేవడం ఖాయమనే చర్చ జరుగుతోంది.
Also read: పాక్ పై టీమిండియా ‘దండ్రయాత్ర’..9వ సారి ఆసియా కప్ మనదే