Wife Violates divorce Agreement | భార్యాభర్తల మధ్య వివాదాలు తలెత్తినప్పుడు సమస్యను పరిష్కరించుకోవడానికి కొందరు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఇందుకోసం కొన్ని షరతులతో ఒప్పందాలు కూడా చేసుకుంటారు. అయితే ఒప్పందం ప్రకారం డబ్బు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు తీసుకున్న తర్వాత కూడా ఒకరు తమ మాట తప్పితే పరిస్థితి ఎలా ఉంటుంది? కేరళలో ఇలాంటి ఆసక్తికరమైన కేసు హైకోర్టుకు చేరింది.
విడాకుల ఒప్పందం ప్రకారం డబ్బు తీసుకున్న భార్య, ఆ తర్వాత విడాకులకు నిరాకరించింది. దీంతో భర్త న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఈ కేసులో కేరళ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అసలు ఏం జరిగింది? కోర్టు ఏం చెప్పిందో తెలుసుకుందాం.
ఈ దంపతుల మధ్య 2011లో వైవాహిక సమస్యలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో భార్య తన భర్తపై మూడు కేసులు పెట్టింది. తన బంగారం, ఇతర ఆస్తులను తిరిగి ఇవ్వాలని కోరింది. 2016లో ఇద్దరూ రాజీకి వచ్చారు. కొన్ని షరతులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందాన్ని జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ముందు సమర్పించారు. న్యాయస్థానం కూడా దీన్ని ఆమోదించింది. అయితే ఒప్పందంలోని షరతులను భార్య పాటించలేదని భర్త వాదించారు.
ఈ ఒప్పందం ప్రకారం భార్య తన మామ (భర్త తండ్రి)కు చెందిన ఇంటిని ఖాళీ చేయాలి. అయితే ఆమె ఇంటిని విడిచిపెట్టడానికి నిరాకరించింది. దీంతో మామ సివిల్ కోర్టులో కేసు వేశారు. ఇంటిని ఖాళీ చేయించాలని కోరారు. మరోవైపు, భర్త విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. డివోర్స్ యాక్ట్ సెక్షన్ 10A కింద దరఖాస్తు చేసుకున్నాడు.
ఒప్పందంలో భాగంగా భర్త నిర్ణయించిన మొత్తాన్ని కోర్టులో డిపాజిట్ చేశాడు. అలాగే ఉమ్మడి ఫిక్స్‌డ్ డిపాజిట్ నుంచి డబ్బు తీసుకునేందుకు భార్యకు అవకాశం కల్పించాడు. భార్య ఆ డబ్బును, ఫిక్స్‌డ్ డిపాజిట్ మొత్తాన్ని కూడా తీసుకుంది. అయినప్పటికీ విడాకులకు అంగీకరించలేదు. తనకు తెలియకుండానే మోసపూరితంగా ఒప్పందంపై సంతకం చేయించారని ఆమె వాదించింది. ఒప్పందంలోని పూర్తి వివరాలు తనకు తెలియవని పేర్కొంది.
డబ్బు, ఫిక్స్‌డ్ డిపాజిట్ మొత్తాన్ని భార్య స్వచ్ఛందంగా తీసుకుందని ఫ్యామిలీ కోర్టు గుర్తించింది. అయితే ఒప్పందంలోని ఇతర షరతులను పాటించడానికి నిరాకరించడాన్ని తప్పుబట్టింది. తనకు నివసించడానికి మరో ఇల్లు లేదని భార్య చెప్పింది. అయితే ఒప్పందం ప్రకారం ప్రయోజనాలు పొందిన తర్వాత బాధ్యతలను తిరస్కరించలేరని కోర్టు అభిప్రాయపడింది. దీంతో భార్య హైకోర్టులో అప్పీల్ చేసింది.
Also Read: భార్య లోన్ కట్టకపోతే భర్త పెన్షన్ డబ్బులు కట్ చేసిన బ్యాంక్.. కోర్టు తీర్పు ఇదే
2025 ఆగస్టు 21న కేరళ హైకోర్టు ఈ కేసులో తీర్పు వెలువరించింది. భర్త ఒప్పందంలోని ఆర్థిక షరతులను పూర్తిగా నెరవేర్చాడని కోర్టు గుర్తించింది. భార్య కూడా డబ్బు, ఫిక్స్‌డ్ డిపాజిట్ మొత్తాన్ని తీసుకున్నట్లు ఆమె తరఫు న్యాయవాది అంగీకరించారు. అలాంటి పరిస్థితుల్లో ఒప్పందంపై మోసపూరితంగా సంతకం చేయించారని చెప్పడం సమంజసం కాదని ధర్మాసనం అభిప్రాయపడింది. ఒప్పందంలో తనకు అనుకూలమైన షరతులను స్వచ్ఛందంగా అంగీకరించి, తన బాధ్యతలు మాత్రం మోసం ద్వారా విధించారని చెప్పలేరని పేర్కొంది.
అందువల్ల ఫ్యామిలీ కోర్టు నిర్ణయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. భార్య దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టివేసింది.
Also Read: భార్య ఏడ్చినంత మాత్రాన భర్త వేధించనట్లేనా? ఆత్మహత్య, 498A కేసులో కోర్టు కీలక తీర్పు