Pune Municipal Elections: సాధారణంగా ఎన్నికలు వస్తున్నాయంటే అభ్యర్థులు ఏం చెబుతారు? రోడ్లు వేయిస్తాం, తాగునీరు ఇస్తాం, డ్రైనేజీ బాగుచేయిస్తాం అని హామీలు ఇస్తారు. కానీ, మహారాష్ట్రలోని పుణె మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. ఇక్కడ ప్రజా సమస్యల ప్రస్తావన కంటే.. ఓటర్లకు ఇచ్చే ఖరీదైన కానుకల జాతరే ఎక్కువగా కనిపిస్తోంది. ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు ప్రకటిస్తున్న ‘బంపర్ ఆఫర్లు’ చూసి జనం అవాక్కవుతున్నారు.
ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అభ్యర్థులు పోటీలు పడి మరీ వినూత్న హామీలు గుప్పిస్తున్నారు. ఒక అభ్యర్థి “మాకు ఓటేస్తే థాయ్‌లాండ్ ట్రిప్ (Thailand Trip) తీసుకెళ్తాం” అని యువతను ఊరిస్తుంటే, మరొకరు ఏకంగా “లక్కీ డ్రాలో గెలిస్తే కారు బహుమతిగా ఇస్తాం” అని ఆఫర్ చేస్తున్నారు. కేవలం పురుషులే కాకుండా మహిళా ఓటర్లను టార్గెట్ చేస్తూ.. బంగారు ఉంగరాలు, వెండి ఆభరణాలు, ఖరీదైన పైఠానీ చీరలు, ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎల్‌ఈడీ టీవీలు ఇస్తామంటూ ప్రచారం హోరెత్తిస్తున్నారు.
నేరుగా డబ్బులు పంచడం పాత పద్ధతి అనుకున్నారో ఏమో గానీ, ఇలా లక్కీ డ్రాలు, పోటీల పేరుతో ఖరీదైన బహుమతులను ఎరగా వేస్తున్నారు. కొన్ని చోట్ల ‘ఉచిత తీర్థయాత్రలు’ కూడా హామీల జాబితాలో ఉన్నాయి. అభివృద్ధి మ్యానిఫెస్టోలను పక్కనపెట్టి, ఇలా ‘నజరానాల’తో ఓట్లు కొనుగోలు చేసే ప్రయత్నం చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాల్సిన ఎన్నికలు.. ఇలా కార్పొరేట్ ఆఫర్ల మేళాలాగా మారడంపై విజ్ఞులైన ఓటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా పుణె ఎన్నికల ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పుణె ఎన్నికల పరిణామాలు చూస్తుంటే రాజకీయాలు ఎంతగా దిగజారిపోయాయో అర్థమవుతోంది. ప్రజాస్వామ్యంలో “ఓటు” అనేది పౌరుడి చేతిలో ఉన్న ఆయుధం, కానీ నేడు అది అంగడి సరుకులా మారిపోవడం దురదృష్టకరం. రోడ్లు, నీళ్లు, పాఠశాలలు, మౌలిక వసతుల గురించి ప్రశ్నించాల్సిన ఓటరు.. థాయ్‌లాండ్ ట్రిప్పులకు, కార్లకు, బంగారానికి ఆశపడి తన భవిష్యత్తును తాకట్టు పెట్టుకుంటున్నాడు.
డబ్బు, విలాసాలు రాజకీయాలను శాసిస్తున్నాయనడానికి ఇదే నిదర్శనం. ఈరోజు ఖరీదైన కానుకలతో ఓట్లు కొంటున్న నాయకులు, రేపు అధికారంలోకి వచ్చాక ప్రజాసేవ చేస్తారని ఆశించడం అవివేకమే అవుతుంది. వారు ఎన్నికల్లో పెట్టిన పెట్టుబడిని వడ్డీతో సహా రాబట్టుకునే పనిలో పడతారే తప్ప, సామాన్యుడి కష్టాలను పట్టించుకోరు. ఓటర్లు ఇలా తాయిలాలకు లొంగిపోతే.. నిజాయితీ గల, సమర్థులైన నాయకులు రాజకీయాలకు దూరమయ్యే ప్రమాదం ఉంది. ఇది ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ‘తాయిలాలు కాదు.. మన తలరాత మార్చే నాయకుడు కావాలి’ అని ఓటరు గ్రహించిననాడే నిజమైన మార్పు సాధ్యం.