BigTV English

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

4 పోలింగ్ బూత్ లలో పేరున్న ఓటర్..
పలు పోలింగ్ కేంద్రాల్లో ఓట్లు వేసిన ఓటర్లు
ఒకే ఇంటి అడ్రస్ లో 80మందికి ఓట్లు
4 రాష్ట్రాల్లో ఓటు వేసిన ఒకే ఓటర్
కర్నాటక, మహారాష్ట్ర, యూపీలో ఉమ్మడిగా ఓటు హక్కు ఉన్న ఓటర్లు


ఈ ఉదాహరణలన్నీ ఎవరో చేసిన ఆరోపణలు కాదు, ఎన్నికల కమిషన్ ఇచ్చిన సమాచారాన్ని మరోసారి తెరపై చూపిస్తూ కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చెప్పిన ఉదాహరణలు. అవును, ఈ ఉదాహరణలతో ఈసీని టార్గెట్ చేశారు రాహుల్ గాంధీ. కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీ చెప్పినట్లే చేస్తోందని మండిపడ్డారు. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందన్నారాయన.

అణుబాంబు లాంటి సాక్ష్యం..
ఈసీకి వ్యతిరేకంగా తమ వద్ద అణుబాంబు లాంటి సాక్ష్యం ఉందని లోక్ సభలో పేర్కొన్న రాహుల్ గాంధీ.. తాజాగా ఓ ప్రెస్ మీట్ నిర్వహించి ఈసీ తప్పుల్ని ఎండగట్టారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ఈసీ అక్రమాలకు పాల్పడిందని, బీజేపీ కోసం దొంగ ఓట్లను చేర్పించిందన్నారు. ఎగ్జిట్‌పోల్స్‌కు , ఎన్నికల ఫలితాలకు చాలా తేడా ఉందని చెప్పిన ఆయన, అదంతా ఈసీ మహత్యమేనని ఎద్దేవా చేశారు. మహారాష్ట్ర , హర్యానా ఎన్నికల్లో పోలింగ్‌కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను ఉద్దేశపూర్వకంగానే మాయం చేశారని, దీనికి ఈసీ ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు. ఆ రెండు రాష్ట్రాల్లో సాయంత్రం 5 గంటల తరువాత భారీగా పోలింగ్‌ నమోదవడం వెనక ఈసీ హస్తం ఉందన్నారు. ఎలక్ట్రానిక్‌ డేటాను ఈసీ తమకు ఇవ్వడం లేదని, అది ప్రజల ఆస్తి కదా అని ప్రశ్నించారు రాహుల్ గాంధీ.

మహదేవ్ పుర
కర్నాటకలోని మహదేవ్ పుర నియోజకవర్గాన్ని ఒక కేస్ స్టడీలా తీసుకుని తమ టీమ్ పరిశోధన చేసిందని, అందులో చాలా విషయాలు బయటపడ్డాయన్నారు రాహుల్ గాంధీ. ఒక సింగిల్ బెడ్ రూమ్ ఇంటి అడ్రస్ తో ఏకంగా 80మందికి ఓటు హక్కు కల్పించారని, మరో పాడుబడిన ఇంట్లో ఏకంగా 46మంది ఓటర్లు ఉన్నట్టు తప్పుడు అడ్రస్ సృష్టించారన్నారు. మహదేవ్ పురలో మొత్తంగా 1,00,250 దొంగ ఓట్లు ఉన్నాయని ఆయన ఉదాహరణలతో సహా బయటపెట్టారు.

అక్కడే ఎందుకు?
కర్నాటకలో పక్కాగా 16 లోక్ సభ స్థానాలు గెలుస్తామని కాంగ్రెస్ నమ్మకం పెట్టుకుంది. కానీ గత ఎన్నికల్లో అక్కడ కేవలం 9 స్థానాల్లో మాత్రమే ఆ పార్టీ గెలిచింది. ఇందులో బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గ ఫలితం కాస్త విచిత్రంగా అనిపించింది. ఈ లోక్ సభ పరిధిలోకి వచ్చే అన్ని అసెంబ్లీ సెగ్మెంట్స్ లో కాంగ్రెస్ దే పైచేయి. ఒక్క మహదేవ్ పుర లో మాత్రం ఊహించని స్థాయిలో బీజేపీకి ఓట్లు పడ్డాయి. ఆ ఓట్లపై కాంగ్రెస్ పరిశోధన మొదలు పెట్టింది. బెంగళూరు సెంట్రల్ లోక్ సభ నియోజకవర్గంలో పోలైన మొత్తం ఓట్లు 6.26 లక్షలు. బీజేపీకి అక్కడ 32,707 ఓట్ల మార్జిన్ తో గెలిచింది. లోక్ సభ పరిధిలోకి వచ్చే మహదేవ్ పుర మినహా మిగతా అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ దే మెజార్టీ అయినా చివరిగా బీజేపీ గెలవడం విచిత్రంగా మారింది. ఇక్కడ 1,00,250 దొంగ ఓట్లను బీజేపీ చేర్చినట్టు రాహుల్ గాంధీ ఆరోపించారు.

5రకాలుగా దొంగ ఓట్లు..
ఓటరు జాబితాలో ఒకరి పేరు పదే పదే రిపీట్ అవుతుంది. అందులో ఒకటే అసలు ఓటు, మిగతావన్నీ దొంగ ఓట్లు..
ఒకే ఓటరుకి వివిధ రాష్ట్రాల్లో ఓటు హక్కు..
ఫేక్ చిరునామాతో ఓటర్లు, లేదా చిరునామా అనే చోట జీరో అని చూపిస్తారు..
ఒకే చిరునామాతో బల్క్(ఎక్కువమంది) ఓటర్లు
ఓటర్ ఐడీలో ఫొటోలు గుర్తించడానికి వీల్లేకుండా ముద్రించడం, ఫామ్-6 దుర్వినియోగం..
ఇలా మొత్తం 5 రకాలుగా ఈసీ అక్రమాలకు పాల్పడిందని ఉదాహరణలో సహా ప్రెస్ మీట్ లో చూపించారు రాహుల్ గాంధీ.

రాహుల్ ఆరోపణలపై కర్నాటక రాష్ట్ర చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ (CEO) కార్యాలయం స్పందించింది. రాహుల్ ఆరోపణలను, ఆయన చూపించిన వివరాలను డిక్లరేషన్‌ రూపంలో అందజేయాలని కోరింది. అవసరమైన చర్యలు తీసుకుంటామని రాహుల్ కి ఓ లేఖ రాసింది.

Related News

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

MP News: పట్టించుకోని వాహనదారులు.. పెట్రోల్ కష్టాలు రెట్టింపు, ఏం జరిగింది?

Big Stories

×