Indian Railways: భారతీయ రైల్వేలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రైలు గరీబ్ రథ్ ఎక్స్ ప్రెస్. పూర్తి ఏసీ కోచ్ లతో నడుస్తున్న ఈ రైలు.. దేశంలోనే అత్యంత చౌక ధరలో ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది. దేశంలోని అనేక నగరాలను ఈ రైళ్లు కలుపుతున్నాయి. అయితే, గత కొంతకాలంగా ఈ రైళ్ల పేరు మారే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే విషయాన్ని కొంత మంది ఎంపీలు పార్లమెంట్ లో లేవనెత్తారు. అయితే, గరీబ్ రథ్ ఎక్స్ ప్రెస్ రైలు పేరు మార్చాలని రైల్వే మంత్రిత్వ శాఖకు ఎటువంటి అభ్యర్థన అందలేదని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్ సభలో స్పష్టం చేశారు. అమృత్ సర్ కు చెందిన కాంగ్రెస్ ఎంపీ గుర్జిత్ సింగ్ ఆజ్లా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు.
ఎంపీ గుర్జిత్ సింగ్ అడిగిన ప్రశ్న ఏంటంటే?
ప్రయాణీకుల ఆత్మగౌరవానికి సంబంధించిన ఆందోళన కారణంగా గరీబ్ రథ్ ఎక్స్ ప్రెస్ పేరు మార్చాలని ప్రజలు చేస్తున్న విజ్ఞప్తి గురించి ప్రభుత్వానికి తెలుసా? అని కాంగ్రెస్ ఎంపీ గుర్జిత్ అడిగారు. ఒకప్పుడు సరసమైన AC ప్రయాణానికి ప్రతీక అయిన గరీబ్ రథ్ అనే పదం ఇప్పుడు మధ్యతరగతి ప్రజలకు అసౌకర్యంగా మారినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ రైళ్ల పేరు ఏమైనా మార్చుతున్నారా? అని ప్రశ్నించారు.
పేరు మార్చాలని ఎటువంటి అభ్యర్థన లేదు!
గరీబ్ రథ్ రైలు పేరు మార్చడం గురించి అధికారిక ప్రతిపాదన లేదా విజ్ఞప్తి రైల్వే మంత్రిత్వ శాఖకు రాలేదని మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. తక్కువ ధర ఎయిర్ కండిషన్డ్ రైలు సేవగా ప్రవేశపెట్టబడిన గరీబ్ రథ్ ఎక్స్ ప్రెస్, దాని అసలు పేరుతోనే సేవలు కొనసాగిస్తుందన్నారు. ప్రస్తుతానికి పేరు మార్పుకు సంబంధించి ఎలాంటి ఆలోచనలు లేవన్నారు. భారతీయ రైల్వే సమాజంలోని అన్ని వర్గాలకు సరసమైన, మంచి నాణ్యతతో కూడిన సేవలను అందించడంపై దృష్టి సారించినట్లు వైష్ణవ్ వెల్లడించారు.
దేశ వ్యాప్తంగా 144 వందే భారత్ రైళ్లు
అటు రోజు రోజుకు వందేభారత్ రైల్వే సేవలు పెరుగుతున్నాయని అశ్విని వైష్ణవ్ తెలిపారు. వందే భారత్, అమృత్ భారత్, నమో భారత్ ర్యాపిడ్ రైల్ అత్యాధునిక సౌకర్యాలతో ప్రయాణ అనుభవాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. ఈ రైళ్లలో అందుబాటులో ఉన్న అధునాతన భద్రతా వ్యవస్థలు, మెరుగైన సౌకర్యాలు ప్రయాణీకులు చక్కటి ప్రయాణ అనుభవాన్ని అందిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం, భారత రైల్వేల బ్రాడ్ గేజ్ విద్యుదీకరణ నెట్ వర్క్ లో 144 వందే భారత్ రైలు సర్వీసులు నడుస్తున్నాయని వైష్ణవ్ అన్నారు. పేద, మధ్యతరగతి ప్రయాణీకులకు సరసమైన రవాణా సౌకర్యాన్ని అందించేందుకు ఇండియన్ రైల్వే పూర్తిగా నాన్-ఎసి ఆధునిక రైళ్లు అయిన అమృత్ భారత్ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ఇప్పటికే, 14 సర్వీసులు నడుస్తున్నాయాన్నారు. అమృత్ భారత్ రైళ్లో 11 జనరల్ క్లాస్ కోచ్‌లు, 8 స్లీపర్ క్లాస్ కోచ్‌లు, 01 ప్యాంట్రీ కార్, 02 లగేజ్ కమ్ దివ్యాంగజన్ కోచ్‌లు ఉన్నట్లు వెల్లడించారు.
Read Also: మన దేశంలో సేఫ్ సిటీ ఇదే, టాప్ 10లో తెలుగు నగరాలు ఉన్నాయా?