దివంగత రతన్ టాటా లక్షల కోట్లకు అధిపతి. చనిపోయే వరకు ఆయన టాటా ట్రస్ట్ కి చైర్మన్ గా వ్యవహరించారు. అయితే ఆయన మరణం తర్వాత ఆయన పదవులకు కుటుంబ పరంగా వారసులున్నారు కానీ, ఆజన్మ బ్రహ్మచారిగా ఉన్న రతన్ టాటా వ్యక్తిగత ఆస్తులకు వారసులెవరనేది చర్చనీయాంశంగా మారింది. అయితే రతన్ టాటా 2022 ఫిబ్రవరి 23న రాసిన ఓ వీలునామా ఇప్పుడు చర్చల్లోకి వచ్చింది. ఆ వీలునామా పరిశీలించి ఆస్తులను కేటాయించాలని ఇప్పటికే బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ విల్లు వ్యవహారం ఇంకా అధికారికంగా బహిర్గతం కాకపోయినా.. అందులో ఏముందనే విషయాలు అనధికారికంగా వెలుగులోకి వచ్చాయి.
చెల్లెళ్లకు రూ.800కోట్లు..
ట్రస్ట్ ఆస్తులు, టాటా గ్రూప్ ఆస్తులతో సంబంధం లేకుండా.. వ్యక్తిగతంగా రతన్ టాటాకు రూ.10వేల కోట్ల ఆస్తులున్నాయని తెలుస్తోంది. ఇందులో కూడా ఎక్కువ భాగం ఆయన చారిటీకే కేటాయించడం విశేషం. రతన్ టాటా ఆస్తుల్లో దాదాపు రూ.3800 కోట్లు రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్, ఎండోమెంట్ ట్రస్ట్ లకు కేటాయించారట. తన సవతి సోదరీమణులు శిరీన్ జజీభోయ్, దియానా జజీభోయ్ పేరు మీద రూ.800 కోట్లు రాశారట రతన్ జీ. టాటా గ్రూప్ మాజీ ఉద్యోగి, మోహిన్ దత్తాకు మరో రూ.800 కోట్ల విలువైన ఆస్తులు రాసినట్లు చెబుతున్నారు.
సిబ్బందికి రూ.3కోట్లు..
తన ఇల్లు, కార్యాలయ సిబ్బందికి రతన్ తన ఆస్తుల్లో వాటా ఇచ్చారు. సిబ్బంది మొత్తానికి రూ.3కోట్లు అందేలా వీలునామా రాశారు. తన వద్ద ఏడేళ్లుగా పనిచేస్తున్న సేవకులకు రూ.15 లక్షలు కేటాయించారు. ఎవరెవరు ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారనే దానిపై వారికి అందే వాటా విలువ పెరుగుతుంది. పార్ట్‌టైమ్ హెల్పర్లు, కార్ క్లీనర్లకు లక్ష రూపాయలు కేటాయించారు.
వంటమనిషికి రూ.కోటి
రతన్ టాటా వద్ద కొన్నేళ్లుగా రాజన్ షా అనే వంట మనిషి నమ్మకంగా పనిచేస్తున్నాడు. అతడికి కోటి రూపాయలకంటే ఎక్కువ వచ్చేలా విల్లు రాశారు. 51 లక్షల రూపాయలు ఆల్రడీ టాటా గ్రూప్ నుంచి అతను లోన్ తీసుకుని ఉన్నాడు. ఆ లోన్ కూడా మాఫీ చేయాలంటూ వీలునామాలో పేర్కొన్నారు. ఆయన వ్యక్తిగత సహాయకుడు సుబ్బయ్య కోనార్ కి 36 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడంతోపాటు, మరో 30 లక్షలు చేతికి అందేలా చేశారు. రతన్ టాటా సెక్రటరీ డెల్నాజ్ గిల్డర్ కి 10 లక్షల రూపాయలు దక్కేలా చూశారు.
శాంతనుకి ఎంతంటే..?
ఇంతమందికి ఇన్ని ఇచ్చిన రతన్ టాటా.. చివరి కాలంలో తనకు సహాయకుడిగా ఉండి సేవ చేసిన శాంతను నాయుడిని ఎందుకు మరచిపోతారు. దాదాపు కోటి రూపాయల మేర శాంతనుకి మేలు చేశారు రతన్ టాటా. ఆయన తీసుకున్న విద్యా రుణాన్ని మాఫీ చేశారు. కార్నెల్ యూనివర్శిటీలో ఎంబీఏ చేసేందుకు శాంతను ఈ లోన్ తీసుకున్నారు. తన డ్రైవర్ రాజు లియోన్ తీసుకున్న రుణం కూడా మాఫీ చేశారు రతన్ టాటా. తన పొరుగింట్లో ఉండే జేక్ మాలిటే అనే వ్యక్తికి రతన్ టాటా రూ.23లక్షలు అప్పుగా ఇచ్చారు. దాన్ని వసూలు చేయకూడదని వీలునామాలో పేర్కొన్నారు.
జంతు ప్రేమికుడు రతన్ జీ..
రతన్ టాటాకు జంతువులంటే చాలా ప్రేమ. ఆ జంతువులకోసం కూడా ఆయన ప్రత్యేకంగా వీలునామాలో ఒక పేరా కేటాయించారు. రతన్ టాటాకు టిటో అనే జర్మ్ షెపర్డ్ కుక్క ఉంది. దాని సంరక్షణ కోసం 12 లక్షల రూపాయలు కేటాయించారు. ప్రతి నెలా దాని మెయింటెనెన్స్ కోసం 10వేలు వాడేలా వీలునామాలో ప్రస్తావించారు రతన్ టాటా.