
Remote work : కొవిడ్ అనంతరం వర్క్ ఫ్రం హోం, రిమోట్ వర్క్ కాన్సెప్ట్‌లకు ప్రాధాన్యం, ఆదరణ పెరిగింది. తుఫాన్లు, వరదలు వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ రిమోట్ వర్కింగ్ అక్కరకొస్తోంది. ఇందుకు తాజా ఉదాహరణ దుబాయ్. అక్కడి ప్రభుత్వం కొద్ది రోజుల పాటు రిమోట్‌వర్క్‌ను అనుమతించింది. ఇక రిమోట్ వర్కర్లకు డెన్మార్క్ అత్యుత్తమ దేశంగా నిలిచింది. సైబర్ సెక్యూరిటీ ప్రొవైడర్ నార్డ్‌లేయర్ సర్వేలో ఈ విషయం బయటపడింది. ఈ మేరకు గ్లోబల్ రిమోట్ వర్క్ ఇండెక్స్(జీఆర్‌డబ్ల్యూఐ) 2023ను రూపొందించారు.
ఇక్కడ జీవన వ్యయం, ఇంటర్నెట్ ఖరీదైన వ్యవహారం అయినా యూరప్‌లోని ఈ ఉత్తరాది దేశం రిమోట్ వర్కర్లకు హాట్ ఫేవరెట్‌గా మారింది. సామాజికపరమైన పురోగతి, నాణ్యమైన ఇంటర్నెట్, సామాజికభద్రత, ఈ-గవర్నమెంట్, ఆరోగ్యరంగం భేషుగ్గా ఉండటం వంటివి ఇందుకు దోహదపడుతున్నాయి. నెదర్లాండ్స్, జర్మనీ దేశాలు 2, 3వ ర్యాంకులు దక్కించుకున్నాయి.
జర్మనీలో సైబర్ భద్రత, సైబర్ చట్టాలు ఎంతో పటిష్ఠంగా ఉండటంతో రిమోట్ వర్క్‌కు బెస్ట్ డెస్టినేషన్‌గా నిలిచింది. ఈ ఏడాది జీఆర్‌డబ్ల్యూఐ ర్యాంకింగ్‌లలో యూరప్ దేశాలు చక్కటి పనితీరును కనబర్చాయి. టాప్‌టెన్‌లో ఆ తర్వాత స్థానాల్లో స్పెయిన్, స్వీడన్, పోర్చుగల్, ఎస్తోనియా, లిథ్వేనియా, ఐర్లండ్, స్లోవేకియా నిలిచాయి.
తొలి యూరోపియనేతర దేశంగా కెనడా 14వ స్థానాన్ని దక్కించుకుంది. ఉత్తమ రిమోట్ వర్క్ ప్రాంతాల్లో అమెరికాది 16వ స్థానం. డిజిటల్, మౌలిక వసతుల కల్పన కారణంగా ఆసియాలోని పలు దేశాలు రిమోట్ వర్క్‌కు అనుకూలంగా మారాయి. సామాజిక భద్రత విషయంలో ముందున్న జపాన్, దక్షిణ కొరియా దేశాలకు 10, 12 స్థానాలు దక్కాయి.
సైబర్, ఆర్థిక భద్రత, సామాజిక భద్రత, డిజిటల్ మౌలిక సదుపాయాలు వంటి అంశాలు ప్రాతిపదికగా తొలి ఆరునెలల కాలానికి చూపిన పనితీరును మదింపు చేశారు. మొత్తం 108 దేశాల్లో ఈ అధ్యయనం చేపట్టి.. ర్యాంకింగ్ జాబితాను రూపొందించారు.