
Chandrayaan 4 Update : చంద్రయాన్-3 మిషన్‌లో భాగంగా ఇస్రో పంపిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ నిద్రాణ స్థితి నుంచి బయటకు రావడం దాదాపు అసాధ్యమే. ఇప్పటి వరకు ఏ దేశమూ సాహసించని రీతిలో భారత్ ఈ మిషన్‌ను చేపట్టి.. జాబిల్లి దక్షిణ ధ్రువంపై కాలు మోపిన తొలిదేశంగా చరిత్ర సృష్టించింది. విక్రమ్, ప్రజ్ఞాన్ అక్కడ దిగడమే కాదు.. 2 వారాల పాటు విలువైన సమాచారాన్ని భూమికి విజయవంతంగా చేరవేశాయి.
చంద్రయాన్-3 మిషన్ సక్సెస్‌తో తదుపరి మిషన్‌ను చేపట్టడానికి ఇస్రో సిద్ధమైంది. చంద్రయాన్-3ను మించి ఈ సారి చంద్రుడి ఉపరితలంపైకి భారీ రోవర్‌ను పంపనుండటం విశేషం. ప్రస్తుతం ఈ మిషన్ అభివృద్ధి దశలోనే ఉంది. అన్నీ అనుకూలిస్తే 2025కల్లా చంద్రయాన్-4 మిషన్‌ను చేపట్టే అవకాశాలున్నాయి. ఇస్రో, జపాన్ అంతరిక్ష పరిశోధన సంస్థ (JAXA) సంయుక్తంగా దీనిని చేపడుతున్నాయి. ఈ ప్రాజెక్టును లూనార్ పోలార్ ఎక్స్‌ప్లొరేషన్ మిషన్(LUPEX)గానూ వ్యవహరిస్తున్నారు.
చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో విస్తృత అధ్యయనం కోసం చేపడుతున్న ఈ మిషన్‌లో భాగంగా లాండర్‌ను, రోవర్‌ను జాబిల్లిపైకి పంపుతారు. చంద్రుడిపై 15 రోజుల పాటు రాత్రి సమయం ఉంటుంది. ఆ సమయంలో అక్కడ ఉష్ణోగ్రతలు 200 డిగ్రీలకు దిగువన నమోదవుతాయి. అంతటి అతి శీతల పరిస్థితులను లాండర్, రోవర్‌లు తట్టుకుని మనుగడ సాగించలేవు. దీంతో ఇస్రో ముందు జాగ్రత్తగానే వాటిని నిద్రాణ స్థితికి చేర్చింది. అనంతరం సెప్టెంబర్ 22న పగలు మళ్లీ మొదలైనా.. అవి నిద్రాణ స్థితిని వీడలేదు.
లాండర్, రోవర్‌ను మేల్కొలిపేందుకు ఇస్రో చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని.. ఈ సారి రాత్రిళ్లు కూడా పనిచేసేలా భారీ రోవర్‌కు రూపకల్పన చేస్తున్నారు. దీని వల్ల పగలు, రాత్రి భేదం లేకుండా అది నిర్విరామంగా పని చేయగలదు. దక్షిణ ధ్రువ ప్రాంతంలో నీటిజాడల అన్వేషణను మరింత లోతుగా చేపట్టే లక్ష్యంతో ఈ ప్రాజెక్టుకు ఇస్రో-జాక్సా రూపకల్పన చేస్తున్నాయి.
చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో నీటి లభ్యతపై పరిశోధనలు చేయడం కీలకం కానుంది. ఒకవేళ ఇవన్నీ ఫలిస్తే.. అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. చంద్రుడి పోలార్ రీజియన్‌లో నీరు పుష్కలంగా ఉన్నట్టు నిపుణులు భావిస్తున్నారు. ఈ నీటిని వెలికితీయగలిగితే భవిష్యత్తు రోదసి ప్రయోగాలకు ఎంతో ఉపయుక్తం కాగలదు. అంతే కాదు.. చంద్రుడి నుంచి సుదూరంగా ఉన్న గ్రహాలపైనా అన్వేషణకు మార్గం సుగమం అవుతుంది.
చంద్రుడిపై మానవ సహిత రోదసి యాత్రలతో పాటు అక్కడ ఆవాసాలు ఏర్పాటు చేసుకోవడం సాధ్యం కాగలదని జాక్సా శాస్త్రవేత్తలు అభిప్రాయ పడుతున్నారు. జపాన్‌కు చెందిన హెచ్ 3 రాకెట్ ద్వారా ఈ ప్రయోగం నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. రోవర్‌ను జాక్సా అభివృద్ధి చేస్తుండగా.. లూనార్ లాండర్‌ను ఇస్రో శాస్త్రవేత్తలు తయారు చేస్తున్నారు.
నీటి జాడలు ఉన్న ప్రాంతాన్ని రోవర్ వెతికి పట్టుకుంటుంది. ఆ ప్రాంతంలో డ్రిల్లింగ్ చేసి.. మట్టిని సేకరించి విశ్లేషిస్తుంది. ఆ మట్టిలో నీటి పరిమాణం ఎంత ఉందో కూడా లెక్కిస్తుంది. ఈ పనులన్నింటినీ స్వయంగా చక్కబెట్టుకోగలిగేలా రోవర్‌ను రూపొందిస్తున్నారు. ఈ మిషన్‌కు సంబంధించి ఇస్రో-జాక్సా సంస్థలు 2017లోనే ఒప్పందం చేసుకున్నాయి.
Vidushi Swaroop : ఆ వృత్తిలో ఫ్రెషర్స్‌కి భలే డిమాండ్.. స్టాండ్ అప్ కమెడియన్ వ్యాఖ్యలపై వివాదం