Lays Chips consumer case| రూ.5 రూపాయల చిప్స్ ప్యాకెట్ కోసం మొదలైన వివాదం చివరకు రూ.8,000 పరిహారం వరకు వెళ్లింది. ఈ ఘటన రాజస్థాన్‌లో జరిగింది. ఈ కేసులో వినియోగదారుల కమిషన్ పెప్సికో ఇండియా హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అసలు ఈ వివాదం ఎలా మొదలైంది? కమిషన్ ఏం తీర్పు ఇచ్చింది? ఆ వివరాలు మీ కోసం..
మీడియా రిపోర్ట్స్ ప్రకారం.. జైపూర్‌కు చెందిన చంద్రమాన్ జలాన్ అనే వ్యక్తి ఈ ఫిర్యాదు చేశారు. ఆయన ఒక హార్డ్‌వేర్ స్టోర్ యజమాని. 2020 నవంబర్ 10న ఇంటికి వచ్చిన అతిథులకు అందించేందుకు మెట్రో క్యాష్ అండ్ క్యారీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి పలు ఆహార పదార్థాలు కొనుగోలు చేశారు. వాటిలో రూ.5 విలువైన లేస్ చిప్స్ ప్యాకెట్ కూడా ఉంది. అతిథులకు చిప్స్ అందిస్తున్న సమయంలో ప్యాకెట్ చాలా తేలికగా అనిపించిందని జలాన్ పేర్కొన్నారు. దీంతో ప్యాకెట్‌లోని చిప్స్‌ను తూకం వేసి చూడగా అవి కేవలం 4 గ్రాములే ఉన్నాయి. ప్యాకెట్‌పై 15 గ్రాముల నికర బరువు అని ఉంది. దీంతో మొత్తం 11 గ్రాములు చిప్స్ ప్యాకెట్‌లో లేవని చంద్రమాన్ ఆరోపించారు.
ఈ విషయంపై రిటైలర్‌ను సంప్రదించినా సంతృప్తికరమైన సమాధానం రాలేదని ఆయన తెలిపారు. దీంతో 2022 ఏప్రిల్ 6న వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. సేవల్లో లోపం, అన్యాయమైన వ్యాపార పద్ధతులు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Also Read: ఒకసారి కాదు.. మూడు సార్లు పెళ్లి చేసుకునే అమ్మాయిలు! ఆ ప్రాంతంలో వింత సంప్రదాయం
జైపూర్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్.. ఈ కేసుపై 2026 సెప్టెంబర్ 17న తీర్పు ఇచ్చింది. కమిషన్ అధ్యక్షుడు అశోక్ శర్మతో పాటు సభ్యులు అజయ్ కుమార్, సుప్రియా అగర్వాల్ ఈ విచారణలో పాల్గొన్నారు. మెట్రో క్యాష్ అండ్ క్యారీ తన వాదనలను కమిషన్ ముందు వినిపించింది. ప్యాకెట్‌లో బరువు తక్కువగా ఉంటే, అది తయారీ దశలో జరిగిన లోపం అయి ఉంటుందని పేర్కొంది. మరోవైపు, నోటీసులు అందినప్పటికీ పెప్సికో విచారణకు హాజరు కాలేదు. దీంతో ఆ సంస్థకు సంబంధించి ఏకపక్షంగా విచారణ కొనసాగింది.
కొనుగోలు రసీదు, అందుబాటులో ఉన్న ఆధారాలను పరిశీలించిన కమిషన్.. రిటైలర్ సంస్థ (మెట్రో క్యాష్ అండ్ క్యారీ) చెల్లుబాటు అయ్యే రసీదుతో ఉత్పత్తిని విక్రయించ చిందని పేర్కొంది. అందువల్ల మెట్రో క్యాష్ అండ్ క్యారీపై ఫిర్యాదును కొట్టివేసింది. అయితే తయారీదారైన పెప్సికోపై ఫిర్యాదును స్వీకరించి, సంస్థను బాధ్యురాలిగా నిర్ధారించింది.
Also Read: పురుషుల కోసం కొత్త గర్భనిరోధక మాత్ర.. కేవలం 30 నిమిషాల ముందు తీసుకుంటే సరిపోతుంది
కమిషన్ ఆదేశాల ప్రకారం, పెప్సికో మొదట చిప్స్ ప్యాకెట్ కొనుగోలు ధర అయిన రూ.5ను వడ్డీతో సహా తిరిగి చెల్లించాలి. 2022 ఏప్రిల్ 6 నుంచి చెల్లించే వరకు సంవత్సరానికి 6 శాతం వడ్డీ వర్తిస్తుంది.
అదనంగా, మానసిక వేదనకు పరిహారంగా రూ.5,000, కేసు ఖర్చుల కోసం రూ.3,000 చెల్లించాలని కమిషన్ ఆదేశించింది. ఈ రెండు మొత్తాలు కలిపి రూ.8,000 అవుతాయి. ప్యాకెట్ ధర, దానిపై వర్తించే వడ్డీ దీనికి అదనం.
తీర్పు వెలువడిన నెలలోపు చెల్లింపులు పూర్తి చేయాలి. గడువులోగా చెల్లించకపోతే, 2026 సెప్టెంబర్ 17 నుంచి చెల్లించే వరకు సంవత్సరానికి 6 శాతం వడ్డీ వర్తిస్తుంది. ఈ తీర్పు ప్యాకేజీపై పేర్కొన్న బరువు, ఉత్పత్తిలో వాస్తవంగా ఉన్న పరిమాణం మధ్య తేడాలపై వినియోగదారులు చట్టపరమైన పరిష్కారం కోరవచ్చని తెలియజేస్తోంది.