One Girl Three Weddings| పెళ్లి అంటే సాధారణంగా ఒకసారి జరిగే వేడుక అని మనకు తెలుసు. కానీ ఒక సుదూర ప్రాంతంలోని ఒక హిందూ సమాజంలో యువతులకు జీవితంలో మూడు సార్లు వివాహాం చేస్తారు. ఆ ప్రత్యేక వివాహ ఆచారాలు వేడుకలుగా నిర్వహిస్తారు. వినడానికి వింతగా అనిపించినా, ఈ ఆచారాల వెనుక ఎన్నో ఏళ్ల మత విశ్వాసాలు, సాంస్కృతిక సంప్రదాయాలు ఉన్నాయి. అసలు ఈ మూడు వేడుకలు ఎందుకు నిర్వహిస్తారు? వాటి వెనుక ఉన్న విశేషాలు ఏమిటో తెలుసుకుందాం.
నేపాల్‌లోని ఖాట్మండు లోయలో నేవార్ సమాజానికి చెందిన ప్రజలు ఎక్కువగా నివసిస్తారు. వీరికి ప్రత్యేకమైన మతపరమైన ఆచారాలు, సాంస్కృతిక సంప్రదాయాలు ఉన్నాయి. ఈ సమాజంలో ప్రతీ అమ్మాయి జీవితంలో మూడు వివాహాలు వేడుకగా నిర్వహించే సంప్రదాయం ఉంది. మొదటి రెండు వివాహాలు మతపరమైన విశ్వాసాలతో ముడిపడి ఉంటాయి. మూడో వేడుకలో అమ్మాయి ఒక వ్యక్తిని జీవిత భాగస్వామిగా చేసుకుంటుంది.
అయితే, ప్రతి కుటుంబం ఈ సంప్రదాయాలను ఒకే విధంగా పాటించకపోవచ్చు. ప్రాంతాన్ని బట్టి ఆచారాల్లో మార్పులు కూడా కనిపిస్తాయి.
మొదటి వివాహం బేల్ పండు (వెలగ పండు)తో జరుగుతుంది. ఈ మొదటి వేడుకను ‘ఇహి’ లేదా ‘బేల్ వివాహం’ అని పిలుస్తారు. సంప్రదాయం ప్రకారం.. సాధారణంగా 5 నుంచి 9 ఏళ్ల మధ్య వయసున్న అమ్మాయిలకు ఈ వివాహం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో అమ్మాయికి వెలగపండుతో ప్రతీకాత్మక వివాహం జరిపిస్తారు.
నేవార్ సమాజంలోని మత విశ్వాసాల ప్రకారం.. ఈ మొదటి పెళ్లి వేడుకకు శ్రీ మహా విష్ణు వరుడు. ఈ వివాహం వల్ల అమ్మాయికి దైవ రక్షణ లభిస్తుందని విశ్వసిస్తారు. ముఖ్యంగా, భవిష్యత్తులో భర్త మరణించినా మహిళను వితంతువుగా పరిగణించాల్సిన అవసరం ఉండదని సంప్రదాయ విశ్వాసం.
రెండో పెళ్లి వేడుకను ‘బహ్రా’ లేదా ‘బహ్రా తయేగు’ అని పిలుస్తారు. సాధారణంగా అమ్మాయి యుక్తవయస్సుకు చేరుకునే సమయంలో ఈ వేడుక నిర్వహిస్తారు. ఈ వివాహ ప్రక్రియలో అమ్మాయిని సుమారు 12 రోజుల పాటు ప్రత్యేక గదిలో ఉంచుతారు. ఈ సమయంలో కుటుంబంలోని మహిళలు ఆమెకు తోడుగా ఉంటారు. కొన్ని ఆచారాల ప్రకారం.. ఈ సమయంలో సూర్యకాంతి, పురుషుల చూపు ఆమెపై పడకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. నిర్ణీత సమయం పూర్తయ్యాక శుద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ తర్వాత సూర్యుడితో వివాహ వేడుక జరుపుతారు. ఈ ఆచారం అమ్మాయి జీవితంలో ఎదుగుదల, రక్షణకు ప్రతీకగా భావిస్తారు.
Also Read: చాణక్య నీతి.. ఈ 7 చెడు అలవాట్లు ఉంటే జీవితంలో విజయం ఎప్పటికీ సాధించలేరు
మొదటి రెండు వివాహాల తర్వాత, అమ్మాయి పెద్దయ్యాక.. మనిషితో పెళ్లి చేసుకుంటుంది. ఈ పెళ్లి సాధారణంగా కుటుంబ సంప్రదాయాలు, మతపరమైన కార్యక్రమాల మధ్య జరుగుతుంది. మొదటి రెండు వేడుకలు ఆధ్యాత్మిక ప్రాధాన్యాన్ని కలిగి ఉండగా.. మూడో వివాహం దాంపత్య జీవితానికి సంబంధించినది.
నేవార్ సమాజంలోని ఈ మూడు వేడుకలు వారి మత విశ్వాసాలు, సంస్కృతి, కుటుంబ సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. ఆధునిక కాలంలో జీవనశైలి, వ్యక్తిగత అభిప్రాయాల కారణంగా కొన్ని ఆచారాల్లో మార్పులు వస్తున్నాయి. అయినప్పటికీ, ఈ సంప్రదాయం నేపాల్ సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తోంది.
Also Read: ఇంజినీర్ జాబ్ మానేసి రాపిడో డ్రైవర్ పనికి.. ఇప్పుడు నెలకు రూ.1.2 లక్ష ఆదాయం