ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్-పాక్ మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో అనేక కుట్ర కోణాలు వెలుగులోకి వచ్చాయి. భారత్ పై దాడికి పాక్ విఫలయత్నాలు చేసింది. పౌర స్థావరాలపైకి మిసైళ్లు ప్రయోగించింది. డ్రోన్లతో దాడి చేయాలని చూసింది. అయితే ఈ యుద్ధం భారత్-పాక్ మధ్య మాత్రమే కాదు. పాకిస్తాన్ కి జతకలసిన చైనా, టర్కీని కూడా భారత్ సమర్థంగా నిలువరించినట్టయింది. అవును, పాకిస్తాన్ కి ఆ రెండు దేశాలు పూర్తి స్థాయిలో మద్దతిచ్చాయి. యుద్ధంలో పాక్ కి మద్దతివ్వడమే కాదు, ఆయుధాలు సరఫరా చేశాయి, దాడి వ్యూహాలు రచించాయి. ప్రతి దశలోనూ భారత్ ని దెబ్బతీయాలని చూశాయి. కానీ మన సైనిక సామర్థ్యం ముందు ఒక్కటిగా వచ్చిన అ మూడు దేశాలు తోకముడిచాయి.
టర్కీ విశ్వాస ఘాతుకం..
భారత్ పై దాడికోసం పాకిస్తాన్ కి టర్కీ డ్రోన్లు సరఫరా చేసింది. కష్ట సమయాల్లో మన దగ్గర సాయం పొందిన టర్కీ, మన శత్రుదేశం పాకిస్తాన్ కి మద్దతివ్వడం, అది కూడా మనతో యుద్ధం జరిగే సమయంలో పాక్ వైపు నిలబడటంతో భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. టర్కీ దిగుమతులపై ఆంక్షలు విధించింది, టర్కీ టూరిజాన్ని కూడా నిలువరించే నిర్ణయాలు తీసుకుంది. టర్కీ కేవలం డ్రోన్లు మాత్రమే సరఫరా చేసింది, కానీ చైనా కుట్రలు ఊహలకు అందనివి. దాడుల్లో పాక్ ఉపయోగించిన ఆయుధాలలో ఎక్కువ శాతం చైనా సమకూర్చినవే. తమ ఆయుధాలకు పాకిస్తాన్ ని ప్రధాన మార్కెట్ గా మార్చుకోడానికి చైనా చేసిన ప్రయత్నాల్లో ఇది కూడా ఒకటి. ఆయుధాలతోపాటు విలువైన సమాచారాన్ని కూడా పాకిస్తాన్ కి అప్పగించింది చైనా.
చైనా కుతంత్రం..
ఆపరేషన్ సిందూర్ కి సంబంధించిన వివరాలను భారత డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ లెఫ్ట్ నెంట్ జనరల్ రాహుల్ ఆర్ సింగ్ తాజాగా వెల్లడించారు. పాకిస్తాన్ కి చెందిన మిలట్రీ హార్డ్ వేర్ లో 81 శాతం చైనా నుంచి సరఫరా అయినదేనని ఆయన తెలిపారు. తాను తయారు చేసిన ఆయుధాల సామర్థ్యాన్ని పరీక్షించుకోవడానికి పాక్‌ను ఒక ప్రయోగశాలలా చైనా ఉపయోగించుకుందని అన్నారాయన. భారత్ దాడికి అనుసరించాల్సిన పద్ధతులు, యుద్ధ వ్యూహాల గురించిన సమాచారం చైనా నుంచి ఎప్పటికప్పుడు పాకిస్తాన్ కి చేరవేశారని చెప్పారు.
#WATCH | Delhi: At the event 'New Age Military Technologies' organised by FICCI, Deputy Chief of Army Staff (Capability Development & Sustenance), Lt Gen Rahul R Singh says, "Air defence and how it panned out during the entire operation was important… This time, our population… pic.twitter.com/uF2uXo7yJm
— ANI (@ANI) July 4, 2025
ఇది యాపారం..
2015 నుంచి ఇప్పటి వరకు చైనా, పాకిస్తాన్ మధ్య 8.2 బిలియన్ల డాలర్ల విలువైన ఆయుధాల బిజినెస్ జరిగింది. 2020 నుంచి 2024 మధ్య నాలుగేళ్ల కాలంలో ప్రపంచంలోనే చైనా నాలుగో అతిపెద్ద ఆయుధ ఎగుమతిదారు. ఆ ఎగుమతుల్లో అత్యధిక శాతం.. అంటే 63 శాతం పాకిస్తాన్ కే చేరాయి. పాకిస్తాన్ ను తమకు అతిపెద్ద క్లైంట్ గా మార్చుకోడానికి చైనా వ్యూహాత్మక ఎత్తుగడలు వేసింది. దాడి సమయంలో ఆయుధ సామగ్రితోపాటు, వ్యూహాలు కూడా అందించేందుకు సిద్ధపడింది. పాక్ ఆ వలలో పడింది. చైనా ఆయుధాలకు ప్రయోగశాలలా మారింది.
భారత్ యుద్ధం కేవలం పాక్ తో మాత్రమే కాదు, పాక్ కి మద్దతుగా నిలిచిన చైనా, టర్కీలను కూడా భారత్ ఏకకాలంలో ఎదుర్కొన్నట్టయింది. యుద్ధంలో భారత్ దే పైచేయి కావడంతో పాక్ తోకముడిచింది, మరింత ఎక్కువ నష్టం జరిగకముందే కాల్పుల విరమణకు ఒప్పుకుంది. చైనా, టర్కీలు పాకిస్తాన్ కి సాయం చేసినా ఆ కుట్రల్ని భారత్ సమర్థంగా తిప్పికొట్టినట్టయింది.