
Sonia Gandhi latest news(Politics news today India) :
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ఎజెండా ఏంటో చెప్పాలని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ రాశారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ఎజెండాలో 9 అంశాలను చేర్చాలని కోరారు.
విపక్ష పార్టీలను సంప్రదించకుండానే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల షెడ్యూల్ ను కేంద్రం ప్రకటించింది. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. కానీ ఎందుకోసం ఈ సమావేశాలు నిర్వహించనున్నారనే క్లారిటీ మాత్రం లేదు. ఈ నేపథ్యంలోనే వచ్చే సమావేశాల్లో కొన్ని అంశాలను చర్చకు తీసుకురావాలని సోనియా గాంధీ లేఖలో కోరారు.
అదానీ అక్రమాలు, మణిపూర్ అల్లర్లు, కులాల వారీగా జనగణన, రైతు సమస్యలు, కనీస మద్దతు ధర విషయంలో ఇచ్చిన హామీపై పార్లమెంట్ లో చర్చ చేపట్టాలని సోనియా కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య దిగజారుతున్న సంబంధాలు, ప్రకృతి వైపరీత్యాల నుంచి ప్రజలను ఆదుకోవడం, హర్యానాతోపాటు అనేక రాష్ట్రాల్లో చెలరేగుతున్న మత ఘర్షణలు, సరిహద్దుల్లో కొనసాగుతున్న చైనా ఆక్రమణలపై పార్లమెంట్ స్పెషన్ సెషన్ లో చర్చించాలని లేఖలో పేర్కొన్నారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై విపక్షాల కూటమి నేతలు ఇప్పటికే చర్చించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కాంగ్రెస్, డీఎంకే, ఆర్జేడీ, ఎస్పీ, ఎన్సీపీ, సీపీఎం, సీపీఐ, ఆప్, టీఎంసీ, జేఎంఎం పార్టీల నేతలు పాల్గొన్నారు. మోదీ చాలీసా కోసమయితే తాము పార్లమెంట్ కు వెళ్లమన్నారు. కానీ సమావేశాల్లో ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ స్పష్టం చేశారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జమిలి ఎన్నికల కోసం బిల్లు, ఉమ్మడి పౌరస్మృతి అమలు, ఓబీసీ వర్గీకరణ లాంటి అంశాలపై చర్చించడానికే ఏర్పాటు చేసినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీకి సోనియా గాంధీ లేఖ రాయడం ఆసక్తిగా మారింది.
KCR: కేసీఆర్ దగ్గర విపక్షాలను కొనేంత డబ్బుందా? రాజ్‌దీప్ మాటల్లో నిజమెంత?