Supreme Court: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయలోని షిల్లాంగ్ హనీమూన్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితురాలిగా ఉన్న సోనమ్ కు షిల్లాంగ్ కోర్టు మంజూరు చేసిన బెయిల్ ను సుప్రీం కోర్టు రద్దు చేసింది. మూడు వారాల్లోపు సంబంధిత కోర్టు ఎదుట లొంగిపోవాలని ఆమెకు ఆదేశాలు జారీ చేసింది. అయితే విచారణలో ఆలస్యం జరిగితే ఆరు నెలల తరువాత కొత్తగా బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసే స్వేచ్ఛ ఆమెకు ఉంటుందని పేర్కొంది.
మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ కు చెందిన వ్యాపారవేత్త రాజా రఘువంశీ వివాహం సోనమ్ తో జరిగిన విషయం తెలిసిందే. 2025 మే 21న భార్యాభర్తలు ఇద్దరు కలిసి హనీమూన్ కోసం షిల్లాంగ్ వెళ్లారు. మే 26న దంపతులు కనిపించకుండా పోవటంతో ఫిర్యాదు అందుకున్న పోలీసులు గాలింపు జరిపారు. అయితే రఘువంశీ, సోనమ్ ల ఆచూకీ తెలియలేదు. కాగా, 2025 జూన్ 2న సోనమ్ సోహ్రా సమీపంలోని వెయిసావ్ డాంగ్ జలపాతం సమీపంలో ఉన్న లోయలో రఘువంశీ మృతదేహం దొరికింది.
దీనిపై కేసులు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపగా సోనమ్ కు రాజ్ కుష్వాహా అనే మరో వ్యక్తితో వివాహేతర సంబంధాలు ఉన్నట్టుగా వెల్లడైంది. ఈ క్రమంలో ఇద్దరు కలిసి కుట్ర ప్రకారం రఘువంశీని హనీమూన్ పేర తీసుకెళ్లి హత్య చేయించినట్టుగా తెలిసింది. దీని కోసం ఆకాశ్ సింగ్ రాజ్ పుత్, విశాల్ సింగ్ చౌహాన్, ఆనంద్ కుర్మి అనే వ్యక్తుల సహకారం తీసుకున్నట్టుగా తేలింది. ఈ క్రమంలో పోలీసులు ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేశారు.
అరెస్ట్ అయిన సోనమ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన షిల్లాంగ్ కోర్టు ఇటీవల ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీనిపై మేఘాలయ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సుప్రీం కోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా సోనమ్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ కేసులో మొత్తం 94 మంది సాక్షులుగా ఉన్నట్టు తెలిపారు. ఇప్పటివరకు కేవలం నలుగురి వాంగ్మూలాలను మాత్రమే రికార్డు చేసినట్టు చెప్పారు. కేసులో అదనపు ఛార్జ్ షీట్ దాఖలైందన్నారు. సోనమ్ బెయిల్ షరతులను పూర్తిగా పాటిస్తున్నట్టు కోర్టుకు తెలిపారు.
మరోవైపు మేఘాలయ ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఛార్జ్ షీట్ లో నమోదైన వివరాల ప్రకారం సోనమ్ స్వయంగా పోలీసుల ఎదుట లొంగిపోయిందని చెప్పారు. చట్టంలోని ఓ సెక్షన్ కు సంబంధించి చిన్న టైపింగ్ పొరపాటు ఆధారంగా బెయిల్ ఇవ్వటం సరైంది కాదన్నారు. బెయిల్ కొనసాగితే సోనమ్ పరారయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలిపారు.
Also Read: జియో మైండ్ బ్లోయింగ్ ప్లాన్స్.. రూ. 400 లోపే అన్‌లిమిటెడ్ 5G డేటా.. వివరాలివే!
కేసు విచారణ సందర్బంగా సుప్రీం కోర్టు సమాజంలో వస్తున్న మార్పులపై వ్యాఖ్యలు చేసింది. ‘సమాజంలో మార్పులు రావటం సహజం. నేటి తరం మా తరంకన్నా ఎక్కువ సమాచారాన్ని కలిగి ఉండొచ్చు. అయితే, ఒత్తిడికి ఎదుర్కొనే విషయంలో వాళ్లు మరింత సున్నితంగా ఉంటున్నారు’ అని పేర్కొంది. దీనిపై స్పందించిన సొలిసిటర్ జనరల్ వారి వద్ద సమాచారం ఎక్కువగా ఉంది.. కానీ జ్ఞానం కాదని వ్యాఖ్యానించారు. దీనిపై జస్టిస్ వరాలే స్పందిస్తూ వాట్సాప్ లో వచ్చే ప్రతీ విషయాన్ని జ్ఞానంగా భావించే పరిస్థితి ఏర్పడిందన్నారు. అనంతరం సోనమ్ కు మంజూరు చేసిన బెయిల్ ను రద్దు చేస్తూ తీర్పు చెప్పారు.
Also Read: పల్సర్ ప్రేమికులకు తీపి కబురు.. సరికొత్త 125cc, 150cc మోడల్స్ వచ్చేస్తున్నాయ్..!