Kishan Reddy: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న విద్యార్థుల ఆందోళనలు, నీట్ పేపర్ లీకేజీ ఉదంతం, కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీల విమర్శలపై తీవ్రంగా స్పందించారు. విద్యార్థుల భవిష్యత్తు, పరీక్షల పారదర్శకతపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరిస్తూనే, ప్రతిపక్షాల వైఖరిని ఎండగట్టారు.
నీట్ పేపర్ లీక్‌పై నిజాయితీగా స్పందన
మా ప్రభుత్వ హయాంలో నీట్ పరీక్ష పేపర్ లీక్ అయిన మాట వాస్తవమేనని, ఈ పొరపాటును ఒప్పుకోవడానికి తమకేమీ సంకోచం లేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే, ప్రభుత్వం సమస్యను దాచిపెట్టకుండా తక్షణమే స్పందించిందని ఆయన తెలిపారు. బాధ్యులను అరెస్టు చేసి జైలుకు పంపామని, విద్యార్థులకు ఎలాంటి అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతోనే మళ్లీ నీట్ పరీక్షను నిర్వహించామని వివరించారు. పేపర్ లీకేజీలను అరికట్టేందుకు 2024లోనే కేంద్ర ప్రభుత్వం కఠినమైన చట్టాన్ని తెచ్చిందని, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా నిందితులకు కఠిన శిక్షలు పడేలా చేస్తామని ప్రధాని మోదీ మాట ఇచ్చారని గుర్తుచేశారు.
రాజకీయ లబ్ధి కోసమే జంతర్ మంతర్ ఆందోళనలు
జంతర్ మంతర్ వేదికగా జరుగుతున్న ఆందోళనల వెనుక కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీల రాజకీయ స్వార్థం ఉందని ఆయన ఆరోపించారు. గతంలో షాహీన్ బాగ్ నిరసనల్లో పాల్గొన్న ఆందోళనకారులే ఇప్పుడు విద్యార్థుల ముసుగులో దేశాన్ని నిర్వీర్యం చేసేందుకు ‘టుక్డే టుక్డే గ్యాంగ్’గా మారి ఈ నిరసనలు నడిపిస్తున్నారని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు.
రేవంత్ రెడ్డి వైఖరి
కాంగ్రెస్, బిఆర్ఎస్ నాయకులకు ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు లేదని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో పదో తరగతి పేపర్ లీక్ అయినప్పుడు ఆయన ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. యూపీఏ పాలనలోనూ అనేక ప్రశ్న పత్రాలు లీకయ్యాయని గుర్తుచేశారు. అశోక్ నగర్‌లో విద్యార్థులకు ఇచ్చిన హామీలను విస్మరించి, రాహుల్ గాంధీ విదేశీ బీచ్‌లలో విహరిస్తున్నారని ఎద్దేవా చేశారు.
కేటీఆర్ పాలనపై విమర్శలు
బిఆర్ఎస్ హయాంలో ఇంటర్మీడియట్ ఫలితాల గందరగోళం వల్ల 26 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని, టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీక్ అయినప్పుడు కేటీఆర్ ఏం చేశారో అందరికీ తెలుసని, అలాంటి వ్యక్తి ఇప్పుడు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు.
సమస్య వచ్చునప్పుడు సంబంధిత మంత్రి రాజీనామా చేయడం ఒక్కటే దానికి పరిష్కారం కాదని, వ్యవస్థలో పారదర్శకత తీసుకురావడమే శాశ్వత పరిష్కారమని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
Also Read: ఆగస్టు 9న బీసీ రణభేరి.. కూటమి సర్కార్‌పై వైసీపీ మాజీ మంత్రుల సంచలన సమరశంఖం!