Supreme Court Menstruation| ఎవరికైనా అన్యాయం జరిగితే కోర్టు కెళతారు. అక్కడ న్యాయమూర్తి ముందు తమకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ.. న్యాయం చేయమని విన్నవించుకుంటారు. కానీ న్యాయమూర్తులకే అన్యాయం జరిగితే. ఇలాంటి ఒక కేసు దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టుకు చేరింది. తమకు అన్యాయం జరిగిందంటూ కొందరు మహిళా న్యాయమూర్తులు సుప్రీం కోర్టులో కేసు వేశారు. ఆ మహిళా న్యాయమూర్తులు మరెవరో కాదు హై కోర్టులో జడ్జీలు కావడం మరింత ఆందోళన కలిగించే అంశం. ఈ కేసు విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు మహిళా న్యాయమూర్తి జస్టిస్ బివి నాగరత్న హై కోర్టు, రాష్ట్ర న్యాయ శాఖ మహిళా న్యాయమూర్తుల పట్ల వివక్ష చూపిందంటూ తీవ్రంగా విమర్శలు చేశారు.
మధ్య హైకోర్టులో న్యాయమూర్తులుగా విధులు నిర్వహించే అయిదుగురు ప్రొబేషన్ (ఉద్యోగంలో చేరిన కొత్తలో) మహిళా జడ్జీలను పనితీరు సరిగా లేదని రాష్ట్ర న్యాయ శాఖ వారిని జూన్ 2023లో ఉద్యోగం నుంచి తొలగించింది. దీంతో ఆ అయిదుగురు మహిళా జడ్జీలు నవంబర్ 2023లో తమను అన్యాయంగా ఉద్యోగం తొలగించారని సుప్రీం కోర్టుకు వెళ్లారు. కేసు విచారణలో ఉండగా.. ఆగస్టు 2024లో ఈ అయిదుగురిలో నలుగురిని మధ్య ప్రదేశ్ హై కోర్టు తిరిగి ఉద్యోగంలోకి చేర్చుకోవాలని నిర్ణయించింది. కాని వీరిలో నలుగురిని మాత్రమే తిరిగి అపాయింట్ చేసుకుంది.
Also Read: ఆత్మహత్యల కేసుల్లో బ్రేకప్ చేసుకున్నవారిని శిక్షించలేం.. సుప్రీం తీర్పు
దీంతో ఆ అయిదు జడ్జి అదితి కుమార్ శర్మ తిరిగి సుప్రీం కోర్టుకు వెళ్లారు. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర న్యాయ శాఖ, హై కోర్టు నిర్వహణ అధికారులు కూడా ఈ కేసులో ప్రతివాదులుగా చేరారు. 2019-20 సంవత్సరంలో ఉద్యోగంలో చేరిన జడ్జి అదితి కుమార్ శర్మ పనితీరు ముందు చాలా బాగుండేదని, కానీ ఆ తరువాతి సంవత్సరాలలో ఆమె పర్‌పార్మెన్స్ రేటింగ్ వెరీ గుడ్ నుంచి గుడ్, గుడ్ నుంచి యావరేజ్, పూర్ గా దిగజారిందని హై కోర్టు నిర్వహణ అధికారులు తెలిపారు.
ఈ పర్‌పార్మెన్స్ రేటింగ్ జడ్జి ఎన్ని కేసుల్లో విచారణ జరిపారు.. విచారణ త్వరగా పూర్తి చేశారు అనే అంశాలను బట్టి నిర్ధారణ చేయడం జరిగిందని తెలిపారు. జడ్జి అదితి కుమార్ శర్మ అతి తక్కువ కేసులు విచారణ చేశారని.. ఈ కారణంగానే ఆమెపై చర్యలు తీసుకోవాల్సిందిగా న్యాయ శాఖకు సిఫార్సు చేయడం జరిగిందని వివరించారు.
మరోవైపు అదితి కుమార శర్మ తాను ఆ సమయంలో గర్భవతి అని, అందువల్ల సెలవుపై ఉన్నానని తెలిపింది. పైగా తనకు గర్భస్రావం జరిగి బిడ్డ చనిపోవడంతో తిరిగి ఉద్యోగంలో చేరడంలో ఆలస్యం జరిగిందని.. పైగా ఆ సమయంలో తాను మానసికంగా దుఖంలో ఉన్నానని తెలిపింది. తాను ఉద్యోగం చేసిన 4 సంవత్సరాలలో తన సర్వీసుపై ఎటువంటి మచ్చ రాలేదని వాదించింది.
ఇరువైపు వాదనలు విన్న సుప్రీం కోర్టు ధర్మాసనం హై కోర్టు తీరుపై మండిపడింది. ముఖ్యంగా విచారణ చేసిన ద్విసభ్య ధర్మాసనంలో జస్టిస్ బివి నాగరత్న మధ్య ప్రదేశ్ హై కోర్టు నిర్వహణ అధికారులను తప్పుబట్టారు. “ఒక మహిళ గర్భవతి అయితే సందర్బంలో ఆరోగ్య కారణాల రీత్యా ఆమె సెలవు తీసుకోవడం ఆమె హక్కు. ఆ సమయంలో ఆమె ప్రొబేషన్ పనితీరుని నిర్ధారించడం చాలా అన్యాయం. పైగా ఆమెకు గర్భస్రావం జరగడంతో బిడ్డ చనిపోయి శారిరకంగా, మానసికంగా వేదనలో ఉంది. మహిళలకు శారీరకంగా కొన్ని సమస్యలుంటాయని వాటిని కూడా పరిగణనలోకి తీసుకోకుండా ప్రొబేషన్ పనితీరుని నిర్ధారించడం మహిళల పట్ల వివక్ష చూపడమే అవుతుంది. పురుషులకు కూడా ఇలాగే రుతుక్రమం అయితే తెలిసేది. ఆమెను ఈ కారణాలతో ఉద్యోగంలో నుంచి తొలగించడం వ్యక్తిగత స్వేచ్ఛ, సమానత్వం హక్కులను కాలరాయడమే అవుతుంది”. అని ఘాటుగా వ్యాఖ్యానించారు.