Supreme Court On EWS Reservations : ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(Economically Weaker Sections)రిజర్వేషన్లపై నేడు సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సీజేఐ యూయూ లలిత్‌తో సహా నలుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు రాజ్యాంగ బద్ధత ఉంటుందని తీర్పు ఇచ్చింది. అగ్రవర్ణాలలో వెనుకబడిన విద్యార్థులకు విద్యా ప్రవేశాలు, ఉద్యోగాలలో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 2019లో కేంద్ర ప్రభుత్వం 103వ రాజ్యాంగ సవరణ చేసింది. అయితే ఈ సవరణ చెల్లుబాటును సవాలు చేస్తూ సుప్రీంలో 40 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై సీజేఐ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారణ చేపట్టి తీర్పును గత నెలలో రిజర్వ్ చేసింది.
ఈడబ్ల్యూఎస్ కోటా అమలు చేస్తే.. ఎస్సీ, ఎస్టీలతోపాటు ఇతర వెనుకబడిన వర్గాలకు(ఓబీసీ) ప్రస్తుతమున్న 50 శాతం రిజర్వేషన్ల పరిధి దాటుతుందన్నది పిటీషనర్ల ప్రధాన అభ్యంతరం. దీనిపై తొలుత జస్టిస్ మహేశ్వరి మాట్లాడుతూ, EWS సవరణ సమానత్వ కోడ్‌ను ఉల్లంఘించడంలేదని స్పష్టం చేశారు. మరో న్యాయమూర్తి జస్టిస్ బేలా మాట్లాడుతూ, EWS కోటా రాజ్యాంగ బద్ధమేనని, చెల్లుబాటు అవుతుందని పేర్కొంటూ జస్టిస్ మహేశ్వరి తీర్పుతో తాను ఏకీభవిస్తున్నట్టు చెప్పారు. ధర్మాసనంలోని మరో జడ్జి జేబీ పార్దీవాలా మాట్లాడుతూ 103వ రాజ్యాంగ సవరణను సమర్థించారు. దీంతో మెజార్టీ తీర్పు కేంద్రప్రభుత్వానికి అనుకూలంగా వచ్చినట్లయింది.