తమిళనాడులో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. తాజాగా అన్నా డీఎంకే – బీజేపీ మధ్య పొత్తు పొడిచింది. ఈ పొత్తు వల్ల డీఎంకే ఖాయంగా నష్టపోయేలా ఉంది. దీంతో సీఎం స్టాలిన్ ఈ పొత్తు వ్యవహారంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అది ఓడిపోయే అవినీతి కూటమి అని ధ్వజమెత్తారు. రాష్ట్ర స్వయంప్రతిపత్తిని తాకట్టు పెట్టి అధికారం కోసం అర్రులు చాస్టున్న అన్నా డీఎంకే బీజేపీతో చేతులు కలిపిందన్నారు. బీజేపీ చేతిలో బందీగా మారిన బానిస పార్టీ అన్నా డీఎంకే అని మండిపడ్డారు స్టాలిన్.
ప్రెస్ మీట్ పొత్తు..
బీజేపీ, అన్నాడీఎంకే సిద్ధాంతాల్లో క్లారిటీ లేదన్నారు సీఎం స్టాలిన్. నీట్ అంశాన్ని అన్నా డీఎంకే వ్యతిరేకించిందని, త్రి భాషా విధానంలో హిందీని రుద్దే అంశాన్ని, వక్ప్ యాక్ట్ ను, డీలిమిటేషన్ అంశాన్ని కూడా ఆ పార్టీ వ్యతిరేకించిందని గుర్తు చేశారు స్టాలిన్. అలాంటప్పుడు బీజేపీతో అన్నాడీఎంకే ఎలా పొత్తు పెట్టుకుందని ప్రశ్నించారు. కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ అనేది లేకుండా, కేవలం అది ప్రెస్ మీట్ పొత్తులా మారిందని ఎద్దేవా చేశారు.
స్టాలిన్ ప్రభుత్వంపై వ్యతిరేకత..!
తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది. అందులోనూ అధికార పార్టీకి అక్కడ ఓటమి ఖాయం అనే సంప్రదాయం కూడా ఉంది. దీంతో స్టాలిన్ కి వచ్చే ఎన్నికల విషయంలో బెంగ పట్టుకుంది. అయితే అన్నా డీఎంకేలోని నాయకత్వ లోపం ఆయనకు వరంగా మారింది. సరిగ్గా ఎన్నికల వేళ బీజేపీ వచ్చి పొత్తు పెట్టుకోవడంతో కూటమి కాస్త బలంగా కనపడుతోంది. దీంతో స్టాలిన్ లో అంతర్మథనం మొదలైంది. రెండోసారి కూడా ఆయనకు సీఎం పదవి ఇచ్చేంతగా తమిళనాడులో అభివృద్ధి జరగలేదు, అదే సమయంలో డీఎంకే నేతలపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీన్ని తమకు అనూకూలంగా మలచుకోవాలనుకుంటోంది బీజేపీ, అన్నా డీఎంకే కూటమి. ప్రభుత్వ వ్యతిరేకతను ఉపయోగించుకొని ఈసారి తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చూస్తోంది.
మరోవైపు హీరో విజయ్ పెట్టిన కొత్త పార్టీ కూడా తమిళనాట తనదైన ప్రభావం చూపించేలా ఉంది. తమిళనాడు అసెంబ్లీకి 2026లో జరిగే ఎన్నికలు కొత్త సమరాన్ని చూపిస్తాయని ఇటీవలే హాట్ కామెంట్స్ చేశారు తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ చీఫ్ విజయ్. ఆయన అన్నాడీఎంకేను అసలు పరిగణలోకి కూడా తీసుకోవట్లేదు. ఈసారి ఎన్నికలు డీఎంకే, టీవీకే మధ్యే ఉంటాయని చెప్పారు. ప్రస్తుతానికి టీవీకే పొత్తులో లేదు. కానీ రాబోయే రోజుల్లో టీవీకే కూడా పొత్తు రాజకీయాలు చేయాలని చాలామంది సూచనలు చేస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లాగా తమిళనాట విజయ్ రాజకీయాలు కొనసాగాలంటున్నారు. తొలి ఎన్నికల్లో అన్ని స్థానాలకు ఒంటరిగా పోటీ చేసి డీలాపడే కంటే పొత్తు రాజకీయాలు మేలని భావిస్తున్నారు. మరి విజయ్ ఎలాంటి స్టెప్ తీసుకుంటారో చూడాలి. ఈ బహుముఖ పోరులో స్టాలిన్ తన సీఎం సీటు కాపాడుకోవడం కష్టమనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.