Husband Can Travel Another Country despite 498A case| భార్య పెట్టిన క్రిమినల్ కేసు కారణంతో ఉద్యోగ అవకాశాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి వస్తే ఎలా ఉంటుంది? దాదాపు రెండేళ్లుగా నిరుద్యోగిగా ఉన్న ఓ వ్యక్తికి ఫారిన్ దేశంలో మంచి ఉద్యోగ అవకాశం వచ్చింది. అయితే, భార్య పెట్టిన కేసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతుండటంతో విదేశాలకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.
భర్తపై భార్య పలు క్రిమినల్ కేసులు నమోదు చేసింది. వీటిలో భారతీయ శిక్షాస్మృతిలోని 498A, 406 సెక్షన్లు ఉన్నాయి. అలాగే తమిళనాడు మహిళల వేధింపుల నిషేధ చట్టం.. 1998లోని సెక్షన్ 4 కింద కూడా కేసు నమోదైంది. భర్త విదేశాలకు వెళ్లేందుకు అనుమతించకూడదని భార్య తరఫు న్యాయవాది వాదించారు.
బెల్జియం వెళ్లిన తర్వాత ఆయన తిరిగి రాకపోవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన అందుబాటులో లేకపోతే కేసు విచారణ ఆలస్యమయ్యే ప్రమాదం ఉందన్నారు.
అయితే, భర్త తరఫు న్యాయవాది ఈ వాదనలను వ్యతిరేకించారు. తన క్లయింట్‌పై తప్పుడు ఆరోపణలు చేశారని కోర్టుకు తెలిపారు. 2024 మార్చి 15న పోలీసులు కేసు నమోదు చేశారని, ఏడాదికి పైగా దర్యాప్తు కొనసాగుతున్నప్పటికీ ఛార్జ్‌షీట్ దాఖలు కాలేదని వివరించారు.
అంతేకాకుండా, భర్త బెయిల్ నిబంధనలన్నీ పాటిస్తున్నారని తెలిపారు. కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లే ఉద్దేశం ఆయనకు లేదన్నారు. అవసరమైనప్పుడు ప్రతి విచారణకు హాజరవుతారని హామీ ఇచ్చారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా విచారణలో పాల్గొంటారని తెలిపారు.
రెండు వైపుల వాదనలు విన్న సుప్రీంకోర్టు కేసు వివరాలను పరిశీలించింది. భర్త ఏడాదికి పైగా భారత్‌లోనే ఉన్నప్పటికీ దర్యాప్తు పూర్తి కాలేదని గుర్తించింది.
బెల్జియంలో సైబర్ సెక్యూరిటీ ఆర్కిటెక్ట్‌గా పనిచేసే అవకాశం ఆయనకు వచ్చింది. ఈ అవకాశాన్ని కోల్పోతే ఆయన కెరీర్‌పై ప్రభావం పడవచ్చని కోర్టు అభిప్రాయపడింది. కేవలం కేసులు పెండింగ్‌లో ఉన్నాయనే కారణంతో విదేశాలకు వెళ్లకుండా అడ్డుకోవడం సరైంది కాదని పేర్కొంది.
Also Read: మా దేశానికి రండి మా పౌరులను ప్రేమించండి.. లవ్ చేయాలనుకునేవారికి ఉచిత ఫారిన్ ట్రిప్..
మొదటి షరతు: రెండు వారాల్లోగా భర్త ట్రయల్ కోర్టులో రూ.5 లక్షలు డిపాజిట్ చేయాలి. ఈ మొత్తాన్ని జాతీయ బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలి. మొదట ఏడాది పాటు ఉంచి, ఆయన తిరిగి వచ్చే వరకు లేదా విచారణ పూర్తయ్యే వరకు ఆటోమేటిక్‌గా రెన్యూ చేయాలి. కోర్టు ప్రత్యేక ఆదేశం లేకుండా ఈ మొత్తాన్ని విడుదల చేయకూడదు.
రెండో షరతు: రెండు వారాల్లోగా ట్రయల్ కోర్టుకు లిఖితపూర్వక హామీ ఇవ్వాలి. ఛార్జ్‌షీట్ దాఖలైన తర్వాత జరిగే ప్రతి విచారణకు హాజరుకావాలి. కోర్టు వ్యక్తిగతంగా రావాలని కోరితే తప్పనిసరిగా హాజరుకావాలి.
మూడో షరతు: ఇచ్చిన హామీని ఉల్లంఘిస్తే రూ.5 లక్షలు ప్రభుత్వానికి జప్తు అవుతాయి. ఇందుకు ట్రయల్ కోర్టు ప్రత్యేక ఆదేశాలు జారీ చేయాలి.
Also Read: ఉద్యోగులకు కొత్త కంపెనీ బంపర్ ఆఫర్.. ఏ టైమ్‌లోనైనా పనిచేయండి, ఇష్టమొచ్చినప్పుడు సెలవులు
2024 సెప్టెంబర్ 24న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సవరించింది. ఈ షరతులతో భర్త అప్పీల్‌ను అనుమతించింది.
అయితే, ఈ నిర్ణయంతో భార్య పెట్టిన కేసులు కొట్టివేసినట్లు కాదు. వాటిపై దర్యాప్తు, న్యాయపరమైన ప్రక్రియ కొనసాగుతాయి. ఉద్యోగ అవకాశాన్ని కాపాడుతూనే విచారణకు భర్త సహకరించేలా సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.