
Parliament special session latest news(Politics news today India) :
ఇండియా పేరును భారత్ గా మార్చేందుకు కేంద్రం వేగంగా అడుగులు వేస్తోందనే సందేహాలు రేకెత్తుతున్నాయి. భారత్ అధ్యక్షతన జరిగే జీ-20 శిఖరాగ్ర సదస్సుకు వివిధ దేశాల అధినేతలు హాజరవుతారు. జీ-20 సదస్సుకు వచ్చే అథితిలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విందు ఇవ్వనున్నారు. ఈ సెప్టెంబర్ 9న విందు ఏర్పాటు చేస్తారు. రాష్ట్రపతి భవన్ నుంచి ఇప్పటికే అతిథులకు ఆహ్వానం పంపారు. అయితే ఈ ఆహ్వానంపై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని బదులుగా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ముద్రించారు. దీంతో ఇండియా పేరును భారత్ గా మార్చేస్తారనే ప్రచారం జరుగుతోంది.
జీ-20 సదస్సు బుక్‌లెట్‌లోనూ దేశం పేరు ‘భారత్, మదర్ ఆఫ్ డెమోక్రసీ’ అని పేర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో దేశం పేరు మార్పుస్తున్నారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఆంగ్లంలోనూ ‘ఇండియా’ నుంచి ‘భారత్’గా పేరు మారుస్తూ ఎన్డీఏ ప్రభుత్వం ప్రత్యేక తీర్మానం తీసుకొస్తుందని ప్రచారం జరుగుతోంది. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు 5 రోజులపాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కేంద్రం ఇప్పటికే నిర్ణయించింది. దేశం పేరు మార్పు కోసమే ఈ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారని అంటున్నారు.
అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ చేసిన ట్వీట్ కూడా దేశం పేరు మారుస్తున్నారనే వార్తలకు బలం చేకూర్చింది.”రిపబ్లిక్ ఆఫ్ భారత్ – మన నాగరికత అమృత్ కాల్ వైపు వేగంగా అడుగులు వేస్తుండటం గర్వంగా ఉంది’’ అని హిమంత ట్వీట్ చేశారు.కేంద్రంలోని అధికార కూటమి ఎన్డీఏకు వ్యతిరేకంగా విపక్షాలు తమ కూటమి పేరును ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయెన్స్ (INDIA-ఇండియా)గా పెట్టుకున్నాయి. ఈ పేరు పెట్టుకోవడంపై అప్పట్లో బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత దేశం పేరును ‘భారత్’ అని మార్చాలనే డిమాండ్లు బీజేపీ నేతల నుంచి బలంగా వినిపించాయి. ఈ క్రమంలోనే ఇండియా పేరు మార్పుపై వార్తలు దేశ రాజకీయాల్లో హీట్ ను పెంచాయి.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 1లో ‘ఇండియా : అది భారత్’ అని ఉంటుంది. కానీ ఇప్పుడు మోదీ ప్రభుత్వం వల్ల ‘భారత్, అది ఇండియా, రాష్ట్రాల సమాఖ్య’ అని చదవాలని ఇప్పటికే కాంగ్రెస్ విమర్శలు చేసింది. రాష్ట్రాల సమాఖ్యపైనా జరుగుతున్న దాడి అని జైరాం రమేశ్ కేంద్రంపై మండిపడ్డారు.