
Hyderabad news today(Telangana news live):
సోమవారం రాత్రి నుంచి తెలంగాణలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ ను వానలు ముంచెత్తుతున్నాయి. నగరంతోపాటు పరిసర ప్రాంతాల్లో చాలా కాలనీలు మునిగిపోయాయి. నాలాలు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బాచుపల్లిలో విషాదకర ఘటన జరిగింది.
బాచుపల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని ప్రగతినగర్ NRI కాలనీ వద్ద నాలా.. నాలుగేళ్ల బాలుడు మిథున్ ను మింగేసింది. ఆ పసివాడు తాత వెంట ఇంటి నుంచి బయటకు వచ్చిన దృశ్యాలు సీసీ కెమోరాల్లో కనిపించాయి. క్షణాల వ్యవధిలోనే బాలుడు నాలాలో పడిపోయి కొట్టుకుపోయాడు.
నిజాంపేట రాజీవ్ గృహకల్ప వద్ద బాలుడి మృతదేహం కనిపించింది. ఈ సమయంలో పసివాడి మృతదేహాన్ని బయటకు తీసే ప్రయత్నించారు. కానీ వీలుపడలేదు. ఆ తర్వాత తుర్క చెరువులోకి మృతదేహం కొట్టుకుపోయింది. చెరువు వద్దకు పోలీసులు, డీఆర్‌ఎఫ్ బృందాలు చేరుకుని బాలుడి మృతదేహాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నించాయి.
భారీ వర్షాల వల్ల జీహెచ్ఎంసీ పరిధిలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు మునిగిపోయాయి.దీంతో భారీగా ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. పొంగిపొర్లుతున్న నాలాలు వాహనదారులను, ప్రజలను కలవరపెడుతున్నాయి.