Delhi Liquor Case update(Telugu flash news): ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని కోర్టు సెప్టెంబర్ 2 వ తేదీ వరకు పొడగించింది. జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో ఇద్దరు నేతలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా ఎదుట హాజరుపరిచారు. ఈ క్రమంలో న్యాయమూర్తి కస్టడీని పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు గతంలో మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే సీబీఐ కేసులో ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ కస్టడీలో తీహార్ జైలులో ఉన్నారు.
ఈ కేసులో కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు అంతకు ముందే తాత్కాలిక బెయిల్‌ను మంజూరు చేసింది. అయితే అవసరమైన బెయిల్ బాండ్లు సమర్పించకపోవడంతో ఆయన తీహార్ జైలులోనే ఉన్నారు. అవినీతి ఆరోపణల కేసులో సీబీఐ విచారణలో భాగంగా కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ కొనసాగుతుంది. ఎక్సైజ్ పాలసీలో మార్పులు చేసే క్రమంలో అవకతవకలు చోటుచేసుకున్నాయని లైసెన్స్ హోల్డర్లకు నిబంధనలకు విరుద్ధంగా లబ్ధి చేకూర్చారని ఈడీ సీబీఐ ఆరోపణలు చేసాయి.
ఇదిలా ఉంటే ఇదే కేసులో ఎమ్మెల్సీ కవితను మార్చి 15వ తేదీన హైదరాబాద్‌లో ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇదే కేసులో సీబీఐ అధికారులు కూడా ఆమెను విచారించారు. ఏప్రిల్ 11వ తేదీన ఢిల్లీ కేసులో కవితను సీబీఐ కూడా అరెస్ట్ చేసింది. రెండు కేసుల్లోనూ ఆమె తిహార్ జైల్లోనే శిక్ష అనుభవిస్తున్నారు.
ఎమ్మెల్సీ కవిత తరపు న్యాయవాది కోర్టులో కీలక వాదనలు వినిపించారు. సాక్షులను ఒత్తిడికి గురి చేసి తప్పుడు వాంగ్మూలం నమోదు చేశారంటూ కవిత తరపు న్యాయవాది పేర్కొన్నారు. సాక్షుల వాంగ్మూలం నమోదు చేసిన సమయంలో చిత్రీకరించిన వీడియోలు, ఆడియోలను ఇవ్వాలంటూ ఈ సందర్భంగా న్యాయవాది మోహిత్ రావు కోర్టును అభ్యర్థించారు. ఒత్తిడి చేసి తీసుకున్న వాంగ్మూలాలు చెల్లుబాటు కావని శరత్ చంద్రారెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కవితపై ఆరోపణలు చేయడ సరి కాదని తెలిపారు.
Also Read: 22న దేశవ్యాప్తంగా భారీ ఆందోళన కార్యక్రమం.. కాంగ్రెస్ కీలక నిర్ణయం
శరత్ చంద్రారెడ్డి, కవితకు లావాదేవీలు జరిగినట్టు ఈడీ పేర్కొంటోంది కానీ అనేక ఏళ్ల నుంచి వారి మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్నాయన్న విషయాన్ని కోర్టు గుర్తించాలని తెలిపారు. ఇందుకు సంబంధించిన బ్యాంకు లావాదేవీల ఆధారాలు కూడా తమ వద్ద ఉన్నాయన్నారు. కోర్టు కేసులో కీలక అంశాలను పరిగణలోకి తీసుకోవాలని ఈ సందర్భంగా న్యాయవాది కోరారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు మరోసారి కస్టడీని పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.