Coromandel train accident news: ఒడిశాలోని బాలేశ్వర్ సమీపంలోని బహనాగ్ బజార్ రైల్వేస్టేషన్ వద్ద ఘోర రైళ్ల ప్రమాదంపై జరిగిన ప్రాంతాన్ని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పరిశీలించారు. సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. విచారణకు ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేశామని ప్రకటించారు.
ఘటనాస్థలిలో సాధారణ పరిస్థితులు ఏర్పడేందుకు చర్యలు తీసుకున్నామని రైల్వే మంత్రి పేర్కొన్నారు. ఎన్డీఆర్‌ఎఫ్, ఓడీఆర్‌ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం సహాయకచర్యలపైనే పూర్తిగా దృష్టి సారించామన్నారు. రైలు ప్రమాద కారణాలను వెంటనే చెప్పలేమని స్పష్టం చేశారు. మరోవైపు సహాయక చర్యలు చేపట్టేందుకు హెలికాప్టర్‌లో ప్రత్యేక బృందాలను పంపారు. సహాయక చర్యలను రైల్వే ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు.
ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఘటనా స్థలానికి వెళ్లారు. సహాయక చర్యలను పరిశీలించారు. ఘటన జరిగిన తీరును రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్.. సీఎం నవీన్ పట్నాయక్ కు వివరించారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలను ఒడిశా సీఎస్ సహా ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. క్షతగాత్రులను తరలించేందుకు 200 అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచామని సీఎస్ తెలిపారు. బాధితులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు.
రైలు ప్రమాదంపై తమిళనాడు సీఎం స్టాలిన్ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహిచారు. చెన్నైలోని రాష్ట్ర ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్‌కు వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదం జరిగిన ఒడిశాలోని బాలాసోర్ ప్రాంతానికి తమిళనాడు మంత్రులు ఉదయనిధి స్టాలిన్, శివ శంకర్, అనిల్ మహేశ్ వెళ్లారు.