Turkey, Syria Earthquake : వరుస భూకంపాలతో టర్కీ, సిరియా మరుభూమిగా మారాయి. ఎటుచూసినా భవన శిథిలాల గుట్టలే దర్శనమిస్తున్నాయి. ఇళ్లు కూలి రోడ్లపై ఉంటున్న జనాన్ని భీకరమైన చలి వణికిస్తోంది. అక్కడ ఉష్టోగ్రతలు దారుణంగా పడిపోయాయి. శిథిలాలు తొలగిస్తుంటే వందల మృతదేహాలు బయటపడుతున్నాయి. టర్కీ, సిరియాలో మొత్తం మృతుల సంఖ్య 7,900 దాటిపోయింది. 20 వేల మందికి పైగా మరణించి ఉంటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేస్తోంది.
ఆర్తనాదాలు..ఆత్మీయులకోసం ఆరాటం..
టర్కీలో 6 వేల భవనాలు కుప్పకూలాయి. 25 వేల మంది సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. హతయ్ ప్రావిన్సులో కుప్పకూలిన ఓ భవన శిథిలాల నుంచి ఏడేళ్ల బాలికను సహాయక సిబ్బంది రక్షించి బయటకు తీశారు. ఆ వెంటనే ఆ బాలిక తన తల్లి గురించి అడగడం అందర్నీ కదిలించింది. మరోవైపు బాధితుల కోసం తాత్కాలిక శిబిరాలు, ఆసుపత్రులను ఏర్పాటు చేశారు. షాపింగ్ మాల్స్, స్టేడియాలు, మసీదులు, సామాజిక భవనాల్లో ప్రజలు తలదాచుకుంటున్నారు. ఇస్కెర్‌డెరున్‌లో ఆసుపత్రి కూలిపోవడంతో భూకంప బాధితులకు వైద్యం కోసం నౌకాదళ నౌకను సమీపంలోని రేవుకు పంపించారు.
ఆగని ప్రకంపనలు..
భారీ భూకంపం తర్వాత వరుసగా వస్తున్న ప్రకంపనలు టర్కీ, సిరియా ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటి వరకు రెండు వందలకుపైగా ప్రకంపనలు సంభవించాయి. దీంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. మరిన్ని ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు.
పోర్టుకు భారీ నష్టం..
కీలక నగరం ఇసికందరన్‌లోని లిమాక్ పోర్టు భూకంపం ధాటికి తీవ్రంగా దెబ్బతింది. కంటైనర్లు ఉన్న ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్తు వ్యవస్థ, సహజవాయు పైపులైన్లు దెబ్బతిన్నాయి. అక్కుయు అణు విద్యుత్తు కేంద్రానికి ఎలాంటి నష్టం వాటిల్లలేదని టర్కీ ప్రభుత్వం వెల్లడించింది.
భారత్ ఆపన్నహస్తం..
టర్కీకి భారత్ నుంచి ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు మంగళవారం సి-17 గ్లోబ్‌మాస్టర్ సైనిక రవాణా విమానాల్లో వెళ్లాయి. వైద్య సేవలకు కావాల్సిన ఔషధాలు, శిథిలాలను తొలగించడానికి వాడే పరికరాలు, జాగిలాలు వెంట తీసుకువెళ్లినట్లు అధికార వర్గాలు తెలిపాయి. గాజియాబాద్, కోల్‌కతా నుంచి ఈ బృందాలు నాలుగు విమానాల్లో వెళ్లాయి. 30 పడకల ఆసుపత్రిని అక్కడ ఏర్పాటు చేసేందుకు ఎక్స్‌రే యంత్రాలు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు, కార్డియాక్ మోనిటర్లు వైద్య బృందాలు తీసుకువెళ్లాయని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది.
అమెరికా భరోసా..
నాటో కూటమి దేశమైన టర్కీకి అన్నివిధాలా సాయం అందిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్దోగన్‌తో ఫోన్లో మాట్లాడి భరోసా కల్పించారు. గ్రీస్, దక్షిణకొరియా, బ్రిటన్, తైవాన్, స్విట్జర్లాండ్, జపాన్, లెబనాన్, జర్మనీ దేశాలు సాయం చేయడానికి ముందుకొస్తున్నాయి. రష్యా నుంచి అత్యవసర సేవల అందించే బృందాలు సిరియాకు వెళ్లాయి.