Time and Water OTT: ప్రకృతి అందాలను తెరపై చూడటం ఒక ఎత్తయితే.. మనిషి చేస్తున్న తప్పుల వల్ల అవే ప్రకృతి సంపదలు కళ్ల ముందే కనుమరుగవుతుంటే కలిగే బాధను అనుభవించడం మరో ఎత్తు. ఇప్పుడు వాతావరణ మార్పులు, భూతాపం కారణంగా మంచు పర్వతాలు కరిగిపోతున్న తీరు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి కీలకమైన అంశాన్ని ఫ్యామిలీ ఎమోషన్స్ తో ముడిపెట్టి తెరకెక్కించిన డాక్యుమెంటరీ ‘టైమ్ అండ్ వాటర్’ (Time and Water) ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ JioHotstarలో అందుబాటులో ఉంది. ఆస్కార్ నామినేటెడ్ దర్శకురాలు సారా డోసా రూపొందించిన ఈ చిత్రం ప్రకృతి ప్రేమికులతో పాటు డాక్యుమెంటరీలు ఇష్టపడేవారిని ఆలోచింపజేస్తుంది.
ఐస్లాండ్కు చెందిన రచయిత, కవి ఆండ్రి స్నేర్ మాగ్నాసన్ జీవిత అనుభవాలు, ఆయన కుటుంబ జ్ఞాపకాలు, ప్రకృతిపై ఉన్న ప్రేమ చుట్టూ ఈ డాక్యుమెంటరీ సాగుతుంది. ఆయన రాసిన ‘ఆన్ టైమ్ అండ్ వాటర్’ పుస్తకం నుంచి ప్రేరణ పొందిన ఈ చిత్రం.. భూమిపై జరుగుతున్న పర్యావరణ మార్పులను వ్యక్తిగత జ్ఞాపకాలతో ముడిపెడుతుంది.
ఐస్లాండ్లోని ఓక్జోకుల్ అనే హిమానీనదం ఒకప్పుడు ప్రకృతిలో భాగంగా ఉండేది. కానీ వాతావరణ మార్పుల కారణంగా అది క్రమంగా కరిగిపోయి, 2014లో అంతరించిపోయిన హిమానీనదంగా ప్రకటించబడింది. దానికి నివాళిగా ఆండ్రి ఒక లేఖ రాశారు. ఆ లేఖలోని భావోద్వేగమే ఈ డాక్యుమెంటరీలో ఒక ముఖ్యమైన అంశంగా మారుతుంది. మంచు పర్వతాలు కేవలం నీటి వనరులు మాత్రమే కావని, లక్షల ఏళ్ల భూమి చరిత్రను తమలో దాచుకున్న సహజ ఆర్కైవ్స్ అని ఈ చిత్రం గుర్తుచేస్తుంది.
ఇదే సమయంలో ఆండ్రి తన తాతయ్య, నానమ్మల పాత ఫొటోలు, వీడియోలు, పాటలను భద్రపరిచే ప్రయత్నం చేస్తుంటారు. ఒకవైపు తన కుటుంబానికి సంబంధించిన జ్ఞాపకాలు కాలగర్భంలో కలిసిపోకుండా కాపాడుకోవాలనే తపన.. మరోవైపు తన దేశంలోని మంచు పర్వతాలు కనుమరుగవుతున్నాయనే ఆవేదన ఆయనను వెంటాడుతుంటాయి. ఈ రెండు అంశాలను కలిపి చూపిస్తూ మనిషి జీవితం, ప్రకృతి, కాలం మధ్య ఉన్న సంబంధాన్ని దర్శకురాలు సారా డోసా ఎంతో అందంగా ఆవిష్కరించారు.
మన తర్వాతి తరాలకు ఎలాంటి భూమిని అందించబోతున్నాం? మనం కోల్పోతున్న ప్రకృతి సంపదను తిరిగి తీసుకురాగలమా? అనే ప్రశ్నలను ఈ డాక్యుమెంటరీ ప్రేక్షకుల ముందుంచుతుంది. సాధారణ కమర్షియల్ సినిమా తరహా కథనం కాకుండా, ప్రకృతి దృశ్యాలు, పాత జ్ఞాపకాలు, భావోద్వేగాలతో సాగే ఈ చిత్రం ఒక ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తుంది.
ఆస్కార్ నామినేటెడ్ డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ సారా డోసా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఐస్లాండ్ రచయిత ఆండ్రి స్నేర్ మాగ్నాసన్ తనగానే కనిపిస్తారు. షేన్ బోరిస్, ఎలిజా స్టీవెన్స్, జమేకా ఆట్రీ, సారా డోసా నిర్మాతలుగా వ్యవహరించారు. డాన్ డీకన్ సంగీతం అందించారు. 2026లో విడుదలైన ఈ డాక్యుమెంటరీ సుమారు 1 గంట 33 నిమిషాల నిడివి కలిగి ఉంది. ప్రస్తుతం JioHotstarలో స్ట్రీమింగ్ ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ ఆడియోలో అందుబాటులో ఉంది.
Read Also: వైకల్యాన్ని లెక్కచేయక చరిత్ర తిరగరాసిన ధీరవనిత… కంటతడి పెట్టించే రియల్ స్టోరీ