Big Stories

UAE startup : కరెంట్ అక్కర్లేని డీశాలినేషన్

UAE startup

UAE startup : భూఉపరితలంలో దాదాపు మూడొంతుల మేర నీరే ఆక్రమించింది. ఈ అపార జలరాశిలో 96.5% సముద్రాల్లోనే ఉంది. అందుబాటులో ఉన్న స్వచ్ఛమైన నీరు 2.5 శాతమే. వందకోట్ల జనాభాకు నీరు దొరకడం గగనమైపోయింది. మరో 300 కోట్ల మందికి అంతంత మాత్రంగానే దొరుకుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సముద్రపు నీటినంతా స్వచ్ఛంగా మార్చేయవచ్చు కదా? అని ఎవరికైనా అనిపించవచ్చు.

- Advertisement -

కానీ అది అంత తేలిక కాదు. విద్యుత్తుతో పాటు వ్యయప్రయాసలెన్నో ఉంటాయి. అయితే విద్యుత్తుతో పని లేకుండానే ఉప్పునీటిని సహజ పద్ధతుల్లో మంచినీరుగా మార్చేయవచ్చని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE)కి చెందిన స్టార్టప్ కంపెనీ చెబుతోంది. అదెలాగన్నదీ కాప్-28 సదస్సులో వివరించింది మన్హత్ సంస్థ.

- Advertisement -

డీశాలినేషన్ ప్లాంట్ల వల్ల ఏటా 76 మిలియన్ టన్నుల కార్బన్-డై-ఆక్సైడ్ వాతావరణంలో కలుస్తున్నట్టు అంచనా. మన్హత్ సంస్థ అభివృద్ధి చేసిన ‘ఫ్లోటింగ్ ఫార్మ్స్’ టెక్నాలజీ ద్వారా కర్బన ఉద్గారాల బెడదకూ స్వస్తి చెప్పొచ్చు. విద్యుత్తు అవసరమే లేని ఓ పరికరం ద్వారా సముద్రజలాలను విజయవంతంగా మంచినీరుగా మార్చగలిగామని మన్హత్ సంస్థ వ్యవస్థాపకుడు సయీద్ అల్‌హసన్ వెల్లడించారు.

ఖలీఫా యూనివర్సిటీలో అల్‌హసన్ కెమికల్ అండ్ పెట్రోలియం ఇంజనీరింగ్ విభాగంలో ప్రొఫెసర్ కూడా. సముద్రజలాలను మంచినీరుగా మార్చేందుకు ప్రస్తుతం డీశాలినేషన్ విధానాన్ని అనుసరిస్తున్నారు. దాదాపు 120 దేశాలు ఈ పద్ధతిపైనే ఆధారపడ్డాయి. అయితే ఇందుకు ఎంతో విద్యుత్తు అవసరం. పైగా చివరగా మిగిలే బ్రైన్ వాటర్(వ్యర్థంగా మిగిలే ఉప్పునీరు)ను తిరిగి సముద్రాల్లోనే పారబోయాలి. సముద్ర జీవులకు ఇది ఎంతో చేటు కలిగిస్తుంది. వీటన్నింటికీ పరిష్కారంగా ‘ఫ్లోటింగ్ ఫార్మ్స్’ టెక్నాలజీని అల్‌హసన్ ప్రతిపాదిస్తున్నారు.

ఆయన నిరుడు రూపొందించిన పరికరం, టెక్నాలజీ వెరీ వెరీ సింపుల్. నీరు ఆవిరి అవుతుందనేది అందరికీ తెలిసిందే. అయితే నీటి అడుగుభాగం నుంచి ఈ ప్రక్రియ జరుగుతుంటుంది. అల్‌హసన్ రూపొందించిన పరికరంలో తొలుత నీటి బాష్పీకరణ(ఎవాపరేషన్) జరుగుతుంది.సాధారణ వాతావరణ పరిస్థితుల్లో ఫ్లోటింగ్ ఫార్మ్ పరికరంలోని నీరు ఆవిరిగా మారుతుంది.

ఉష్ణోగ్రత తగ్గిన వెంటనే(రాత్రి వేళల్లో) ఆ ఆవిరి గోళాకారపు పరికరం ఎగువభాగంలో ఘనీభవించి తిరిగి ఘనీభవిస్తుంది. అలా ఘనీభవించిన నీటిని కలెక్ట్ చేసి.. ఓ రిజర్వాయర్‌కు చేరుస్తారు. ప్రయోగాత్మకంగా ఓ చిన్న పరికరాన్ని తయారు చేసి పరీక్షించారు అల్‌హసన్. అవసరాలకు అనుగుణంగా భారీ ఫ్లోటింగ్ ఫార్మ్స్‌ను నిర్మించే పనిలో ఇప్పుడు ఉన్నారాయన.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News