BigTV English

Trump Tariffs Effect: ట్రంప్ 25 శాతం టారిఫ్ వల్ల ఏయే రంగాలకు ఎక్కువ నష్టం? ఎలాంటి సమస్యలు వస్తాయి?

Trump Tariffs Effect: ట్రంప్ 25 శాతం టారిఫ్ వల్ల ఏయే రంగాలకు ఎక్కువ నష్టం? ఎలాంటి సమస్యలు వస్తాయి?

భారత్ నుంచి అమెరికాకు వెళ్లే ఎగుమతులపై 25 శాతం సుంకాలు విధిస్తూ ఆ దేశ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. ఆగస్ట్ 1 నుంచి సుంకాల పెంపు నిబంధనలు అమలులోకి వస్తాయని ఆయన కరాఖండిగా చెప్పేశారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య 129.2 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతోంది. సుంకాల పెంపు ఈ మార్కెట్ పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. సుంకాలు పెంచితే కచ్చితంగా ఆ మేర వస్తువుల రేట్లు కూడా పెరుగుతాయి. అవకాశాన్ని బట్టి ఎగుమతులు చేయాల్సి ఉంటుంది కాబట్టి వాటి రవాణా ఆలస్యం అవుతుంది. అంతే కాదు, ఆయా రంగాల్లో ఉన్న పరిశ్రమలు తీవ్ర ఒత్తిడికి గురవుతాయి. అమెరికా ఎగుమతులనే ప్రధాన ఆదాయ వనరుగా భావిస్తున్న కంపెనీలకు ఇది పెద్ద షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. ఇంతకీ అమెరికా విధించిన సుంకాల వల్ల భారత్ లోని ఏయే రంగాలు ప్రభావితం అవుతాయి, ఏయే కంపెనీలకు నష్టాలు వాటిల్లే అవకాశం ఉంది?


రత్నాలు, ఆభరణాలు..
భారత దేశ జెమ్స్ అండ్ జ్యుయెలరీ రంగం అమెరికా సుంకాల మోతతో తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కొంటోంది. ఈరంగంలో అమెరికాకు భారత్ నుంచి 10 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరుగుతున్నాయి. అంటే మార్కెట్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సుంకాలు పెరిగితే ఆటోమేటిక్ గా ఆయా వస్తువుల రేట్లు కూడా పెంచాల్సి ఉంటుంది. రేట్లు పెరిగితే ఆమేరకు డిమాండ్ ఉంటుందా లేదా అనేది ప్రశ్నార్థకమే. డిమాండ్ లేకపోతే భారతీయ కంపెనీలు లాభాలను తగ్గించుకుని, అవసరమైతే నష్టాలకు సైతం కొన్ని రోజులపాటు వ్యాపారం చేయాల్సి ఉంటుంది. అది కూడా కష్టమైతే కంపెనీలు అమెరికా ఎగుమతుల్ని పక్కనపెట్టి ఇతర ప్రత్యామ్నాయాలపై దృష్టిసారించాల్సి ఉంటుంది.

ఔషధ రంగం..
ట్రంప్ సుంకాల మోతతో భారతీయ ఔషధ రంగం తీవ్ర ఒత్తిడికి లోనవుతోంది. అమెరికాకు పేటెంట్ లేని ఔషధాలను ఎగుమతి చేసే అతిపెద్ద దేశం భారత్. ఈ రంగం వార్షిక ఎగుమతుల విలువ 8 బిలియన్ డాలర్లు. సుంకాల దెబ్బతో ఫార్మా ఎగుమతులు తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే భారత్ నుంచి వచ్చే ఔషధాలకంటే ఇతర దేశాలనుంచి తక్కువ ధరకు వాటిని దిగుమతి చేసుకునే అవకాశం అమెరికాకు ఉంటుంది. అందుకే వారు మన బిజినెస్ ని తగ్గిస్తారు. సుంకాల వార్త వినపడగానే సన్ ఫార్మాసుటికల్స్, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ లిమిటెడ్, సిప్లా లిమిటెడ్ వంటి కొన్ని ఔషధ పరిశ్రమల షేర్లు భారీగా పడిపోయాయి. ఆయా కంపెనీలు తమ ఆదాయంలో 30శాతం అమెరికా ఎగుమతుల ద్వారా పొందుతున్నాయి. ఇకపై ఆ స్థాయిలో బిజినెస్ జరగకపోవచ్చు.


వస్త్ర ఉత్పత్తి రంగం..
భారత్ నుంచి పెద్ద ఎత్తున వస్త్రాలు అమెరికాకు ఎగుమతి అవుతుంటాయి. గ్యాప్ కంపెనీ, వాల్ మార్ట్, పెపె జీన్స్ సహా అమెరికాకు చెందిన ఇతర కొన్ని టాప్ క్లాస్ కంపెనీలు భారత్ నుంచి వస్త్రాలను దిగుమతి చేసుకుని వారి బ్రాండ్లపై అమ్మకాలు చేస్తుంటాయి. సుంకాలు పెంచడం వల్ల భారత్ నుంచి ఎగుమతి అయ్యే వస్త్రాల రేట్లు పెరుగుతాయి. అదే జరిగితే వియత్నాం వంటి దేశాలు వ్యాపార పోటీలో లాభం పొందుతాయి. అమెరికా, వియత్నాంపై విధిస్తున్న సుంకాలు, భారత్ కంటే తక్కువ. అంటే ఆ దేశం నుంచి ఎక్కువ వస్త్రాలను అమెరికా దిగుమతి చేసుకుంటుంది. సుంకాల దెబ్బకు భారత్ లోని వర్థమాన్, వెల్ స్పన్, ఇండో కౌంట్.. వంటి వస్త్ర ఉత్పత్తి సంస్థలు నష్టాలపాలయ్యే అవకాశముంది. ఇప్పటికా ఆయా కంపెనీల షేర్లు కుదేలయ్యాయి.

ఎలక్ట్రానిక్స్..
అమెరికాకు వివిధ ఉత్పత్తులను ఎగుమతి చేసే ఎలక్ట్రానిక్స్ రంగంపై కూడా ట్రంప్ సుంకాల ప్రభావం పడబోతోంది. అమెరికాలో విక్రయించే ఆపిల్ కంపెనీ ఫోన్లను ఇటీవల భారత్ లోనే ఎక్కువగా తయారు చేస్తున్నారు. ఆ ఎగుమతులపై ఈ 25 శాతం సుంకాల పెంపు ప్రభావం పడుతుంది. అంటే ఆపిల్ కంపెనీ భారత్ లో మునుపటి మాదిరిగా ఎక్కువ ఫోన్ల ఉత్పత్తిని కొనసాగించకపోవచ్చు.

ట్రంప్ సుంకాల ప్రకటన భారత పారిశ్రామిక రంగంలో తీవ్ర అనిశ్చితికి కారణం అవుతోంది. ఆగస్ట్ 1 నుంచి సుంకాల మోత మోగిపోతుందనే సంకేతాలు వెలువడటంతో ఎగుమతులపై ఆధారపడిన కంపెనీల షేర్లు పతనం అయ్యాయి. భారత్‌-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ఖరారు తుది దశ చర్చలు ఆగస్ట్ 25న జరగాల్సి ఉంది. అయితే ఈలోగా ట్రంప్ సుంకాల బాంబు పేల్చారు. అంటే ఒకరకంగా ఈ చర్చల్లో భారత్ పై ఒత్తిడి తేవడం ట్రంప్ వ్యూహం కావొచ్చు. ఆ చర్చల తర్వాత ట్రంప్ తన సుంకాల నిర్ణయాన్ని పునఃపరిశీలించే అవకాశం ఉంటుందని వాణిజ్య రంగ నిపుణులు చెబుతున్నారు.

Related News

MLAs Free iPhones: ఎమ్మెల్యేలకు ఉచితంగా ఐఫోన్లు.. రాజకీయ రచ్చ, ఎక్కడంటే

Poonch sector firing: కాల్పులకు తెగబడ్డ పాక్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సైన్యం!

Dharali floods: 11 మంది జవాన్లు గల్లంతు.. మరో నలుగురు మృతి.. అక్కడ ఊరుఊరంతా..?

Cloud Burst: క్లౌడ్‌బరస్ట్ అంటే ఏమిటీ? ఊళ్లను వల్లకాడు చేసే ఈ విపత్తు.. సునామీ కంటే ప్రమాదకరమా?

Uttarakhand floods: ఉత్తరాఖండ్ వరదల ఎఫెక్ట్.. వందల సంఖ్యలో ప్రజల గల్లంతు?

Cloud Burst: ఉత్తరాఖండ్‌లో క్లౌడ్‌బరస్ట్.. రెప్పపాటులో కొట్టుకెళ్లిపోయిన ఊరు.. భారీ సంఖ్యలో మరణాలు?

Big Stories

×