Operation Sindoor: పహల్‌గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత ప్రతీకారంతో రగిలిపోయింది భారత్. మంగళవారం అర్థరాత్రి పీఓకేలోని 9 ఉగ్రవాద స్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేసింది. దీనికి ‘ఆపరేషన్ సింధూర్’ అని పెట్టారు. సైన్యం చేపట్టిన ఆపరేషన్ గురించి సమాచారం ఇవ్వడానికి ఇద్దరు మహిళా అధికారులు మీడియా ముందుకొచ్చారు. వారిలో ఒకరు కల్నల్ సోఫియా ఖురేషి కాగా, మరొకరు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. ఇంతకీ వీరు సైన్యంలోకి ఎప్పుడు అడుగుపెట్టారు? ఇంకాస్త డీటేల్స్ లోకి వెళ్తే..
ఎవరా మహిళా అధికారులు
పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు స్థావరాలు ఎక్కడున్నాయి? సైన్యానికి చిక్కిన ఆ వివరాలను బయటపెట్టారు కల్నల్ సోఫియా ఖురేషి. దాయాది దేశంలో గుట్టుగా సాగుతున్న ఉగ్రవాద క్యాంపులను భారత సైన్యం ఎలా నాశనం చేసిందో కళ్లకు కట్టినట్టు వివరించారు. సోఫియా ఖురేషి.. ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్నారు. సోఫియా ఖురేషి గురించి ఆర్మీలో చాలామంది రకరకాలుగా చెప్పుకుంటారు. ధైర్యానికి ఆమె చిహ్నంగా చెబుతారు.
పూణేలో జరిగిన సైనిక విన్యాసాల్లో సైనిక దళానికి నాయకత్వం వహించిన ఫస్ట్ మహిళా అధికారిగా చరిత్ర సృష్టించారు. అందులో 18 దేశాల తరపున పాల్గొన్న ఏకైక మహిళా కమాండర్ కూడా. గుజరాత్‌కు చెందిన కల్నల్ ఖురేషి, బయో కెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసింది.
ఆమె సైనిక కుటుంబం నుండి వచ్చింది. ఆమె మెకనైజ్డ్ ఇన్‌ఫాంట్రీలో ఓ అధికారిని వివాహం చేసుకుంది. యూఎన్ శాంతి పరి రక్షక కార్యకలాపాలలో ఆరు సంవత్సరాలు అనుభవం సంపాదించారు. 2006 ఏడాది కాంగోలో ఆమె కాల్పుల విరమణలను పర్యవేక్షించిన ఘటన ఆమె సొంతం.
ALSO READ: పహల్‌గామ్ దాడికి భారత్ ప్రతీకారం.. కన్నీరు పెట్టిన పాక్ టీవీ యాంకర్
ఆమెలో నాయకత్వాన్ని అప్పటి ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ బిపిన్ రావత్ గుర్తించారు కూడా. మూడు దశాబ్దాలుగా ఉగ్రవాదానికి సంబంధించిన నిర్మాణాలు పాక్‌లో ఎలా జరుగుతున్నాయి? అవి పీఓకే వరకు ఎలా విస్తరించాయి? అనేది కళ్లకు కట్టినట్టు మ్యాపింగ్ ద్వారా వివరించారు.
సొంతూరు గుజరాత్
మరొకరు ఎయిర్ పోర్టులో వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉగ్రవాద శిబిరాలపై భారత్ నిర్వహించిన సరిహద్దు-దాడి గురించి మీడియాకు వివరించిన వారిలో ఆమె కూడా ఒకరు. వ్యోమికాసింగ్ గురించి చెప్పాలంటే చిన్నప్పటి నుండి ఎయిర్ ఫోర్సులో చేరాలన్నది ఆమె డ్రీమ్. ఆ ఇష్టంతోనే తొలిసారి నేషనల్ క్యాడెట్ కార్ప్స్-NCCలో చేరింది. ఆ తర్వాత ఇంజనీరింగ్ పూర్తి చేసింది. చివరికి సైన్యంలో చోటు దక్కించుకుంది.
సరిగ్గా ఆరేళ్ల కిందట అంటే డిసెంబర్ 18, 2019న ఆమె హెలికాప్టర్ పైలట్‌గా నియమితులయ్యారు. ఆ తర్వాత వైమానిక దళ పైలట్‌గా కీలకమయ్యారు. ప్రమాదకర ప్రాంతాల్లో విమానాలు నడిపిన అనుభవం ఆమె సొంతం. రెండున్నర వేలకు పైగా గంటల విమానం నడిపిన అనుభవాన్ని సంపాదించారు. ఈశాన్య రాష్ట్రాలు, అలాగే జమ్మూ కాశ్మీర్ వంటి క్లిష్టతరమైన ఏరియాల్లో చీతా, చేతక్ వంటి హెలికాప్టర్లను నడిపారు.
2020 ఏడాది అరుణాచల్ ప్రదేశ్‌లో ఓ కీలకమైన రెస్క్యూ ఆపరేషన్‌కు నాయకత్వం వహించారు. ఆ సమయంలో అక్కడి పౌరులను తరలించడానికి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నారు. 2021లో ఆమె మౌంట్ మణిరాంగ్ (21,650 అడుగులు)పర్వతారోహణ యాత్రలో చేరి తన నైపుణ్యాన్ని నిరూపించుకున్నారు.