Big Stories

Tripura Elections : బీజేపీ అధికారం నిలబెట్టుకుంటుందా..? త్రిపురలో గెలుపెవరిది?

Tripura Elections : త్రిపురలో బీజేపీ అధికారం తిరిగి నిలబెట్టుకుంటుందా? సీపీఎం, కాంగ్రెస్ కూటమి సత్తా చాటుతుందా? గ్రేటర్ తిప్రాల్యాండ్ నినాదం పనిచేస్తుందా? ఈ ప్రశ్నలకు త్రిపుర ఓటర్లు సమాధానం చెప్పే పనిలో ఉన్నారు. 60 అసెంబ్లీ స్థానాలున్న త్రిపురలో పోలింగ్ కొనసాగుతోంది. ఎన్నికల బరిలో 259 మంది అభ్యర్థులు ఉన్నారు. 3,337 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో మొత్తం 28.13 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల వేళ త్రిపురలో నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయి. అంతరాష్ట్ర, అంతర్జాతీయ సరిహద్దులను మూసేశారు. శుక్రవారం ఉదయం వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి.

- Advertisement -

ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ 55 చోట్ల దాని మిత్రపక్షం ఐపీఎఫ్ టీ 6 స్థానాల్లో పోటీ చేశాయి. ఒక చోట ఇరు పార్టీల అభ్యర్థులు బరిలో ఉన్నారు. సీపీఎం 47 స్థానాల్లో, కాంగ్రెస్ 13 చోట్ల పోటీ చేశాయి. తృణమూల్ కాంగ్రెస్ 28 స్థానాల్లో బరిలో దిగగా… స్వతంత్ర అభ్యర్థులు 58 మంది పోటీలో ఉన్నారు. తిప్రా మోతా పార్టీ అభ్యర్థులు 42 స్థానాల్లో బరిలో దిగారు. త్రిపుర సీఎం మాణిక్ సాహా బోర్దోవాలీ అసెంబ్లీ స్థానం నుంచి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జితేంద్ర చౌదరి సాబ్రూమ్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. తిప్రా మోతా అధ్యక్షుడు ప్రద్యోత్ దేబ్ బర్మన్ పోటీ చేయలేదు.

- Advertisement -

ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ కోసం ఉద్యమం చేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తిప్రా మోతా రాకతో ఈసారి త్రిముఖ పోరు కనిపిస్తోంది. గత ఐదేళ్లపాలనలో చేసిన అభివృద్ధే తమను గెలిపిస్తుందని బీజేపీ ధీమాగా ఉంది. కాషాయ పార్టీ దుష్ప్రరిపాలనకు చరమగీతం పాడాలని సీపీఎం, కాంగ్రెస్‌ ప్రజలకు పిలుపునిచ్చాయి. గ్రేటర్‌ తిప్రాల్యాండ్‌ రాష్ట్ర సాధన లక్ష్యంగా తిప్రా మోతా పార్టీ ప్రజల్లోకి వెళ్లింది. మరి త్రిపుర ఓటర్లు ఎటువైపు ఉన్నారో చూడాలి.

త్రిపురలో సుధీర్ఘకాలం కమ్యూనిస్టు పార్టీలే అధికారంలో ఉన్నాయి. 2018లో తొలిసారిగా బీజేపీ అధికారం దక్కించుకుంది. కాషాయ పార్టీ 36 స్థానాలు గెలిచి అధికారంలోకి వచ్చింది. ఈ సారి త్రిపుర ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారనే అనే అంశం ఉత్కంఠగా మారింది. మరోవైపు నాగాలాండ్, మేఘాలయలో ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుంది. మార్చి 2న ఈ మూడు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు చేపడతారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News