Vande Bharat Express: కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లు దూసుకెళ్తున్నాయి. విమాన ప్రయాణానికి ఏమాత్రం తగ్గకుండా.. దేశవ్యాప్తంగా మొత్తం 10 రైళ్లు సేవలందిస్తున్నాయి. అలాగే తక్కువ సమయంలో గమ్యస్థానాన్ని చేర్చుతుండడంతో ఎక్కువ మంది వీటిలో ప్రయాణించేందుకు ఆసక్తి చూపుతున్నారు. నిత్యం రైళ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి.
తాజాగా ఈ రైళ్ల ఆక్యుపెన్సీకి సంబంధించిన నివేదికను రైల్వే అధికారులు విడుదల చేశారు. అందులో 5 రైళ్లు వందశాతానికి పైగా ఆక్యుపెన్సీతో నడుస్తుండగా.. మిగతా ఐదు తక్కువ ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. ముంబై-గాంధీనగర్ మధ్యలో నడిచే రైలు రికార్డు స్థాయి ఆక్యుపెన్సీతో నడుస్తోంది. 127 శాతం మేర భర్తీ అవుతూ దూసుకెళ్తోంది. అలాగే సికింద్రాబాద్-విశాఖ, ఢిల్లీ -వారణాసి మార్గంలో నడుస్తున్న రైళ్లు 125.76శాతం భర్తీ అవుతూ నడుస్తుంది.
బిలాస్‌పుర్-నాగ్‌పుర్ మధ్యలో నడిచే రైలు అత్యల్పంగా కేవలం 55 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తోంది. ఈ మార్గంలో ప్రయాణికుల సంఖ్యను పెంచేందుకు అధికారులు ప్రయాత్నాలు చేస్తున్నారు. ఇక ఈ ఏడాది 100.72 సగటు ఆక్యుపెన్సీని వందేభారత్ రైళ్లు నమోదు చేశాయి. ఇప్పటి వరకు వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లు మొత్తం 1635 ట్రిప్పుల్లో 20 లక్షలకు పైగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేశాయి.